Bathukamma 2025 Celebration Schedule: రేపటి నుంచి తెలంగాణలో బతుకమ్మ సంబరాలు, ఉత్సవాల పూర్తి షెడ్యూల్ విడుదల
Bathukamma 2025 Date and Schedule: సెప్టెంబర్ 21న తెలంగాణలో బతుకమ్మ సంబరాలు మొదలవుతున్నాయి. బతుకమ్మ ఉత్సవాల పూర్తి షెడ్యూల్ మంత్రి జూపల్లి కృష్ణారావు విడుదల చేశారు.

Telangana Bathukamma 2025 | హైదరాబాద్: తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మ సంబురాలు రేపటి (సెప్టెంబర్ 21వ తేదీ) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొదలుకానున్నాయి. బతుకమ్మ ప్రారంభ వేడుకలకు చారిత్రక వేయి స్తంభాల గుడిని ముస్తాబు చేశారు. బతుకమ్మ అరంభ వేడుకలో తెలంగాణ పర్యాటక శాఖ, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క (అనసూయ) పాల్గొననున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. సకల జనులు, సబ్బండ వర్ణాలు కలిసి ఏకత్వస్ఫూర్తిని చాటేలా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు రూపోందించింది. చారిత్రక ప్రదేశాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, వారసత్వ కట్టడాలు, పర్యాటక ప్రాంతాల్లో 9 రోజుల పాటు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నహాలు చేసిందని మంత్రి జూపల్లి తెలిపారు.

ప్రకృతితో మమేకమైన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల ఔన్నత్యాన్ని బతుకమ్మ పండుగ విశ్వవ్యాప్తంగా చాటుతోందని అన్నారు. తెలంగాణ ఆడ్డబిడ్డలందరికీ ఈ సందర్భంగా బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలందరి బతుకుల్లో వెలుగులు నింపుతూ, మరింతగా సుఖ సంతోషాలతో జీవించేలా దీవించాలని ప్రార్థించారు.బతుకమ్మ పండగను సంప్రదాయ బద్ధంగా జరుపుకోవాలని కోరారు.






















