Bathukamma 2025 : మహాలయ అమావాస్య నుంచి దుర్గాష్టమి వరకూ..ఏ రోజు ఏ బతుకమ్మ? ఏ రోజు ఏ నైవేద్యం?
Bathukamma 2025 Starting Ending Dates: మహాలయ అమావాస్య నుంచి దుర్గాష్టమి వరకూ బతుకమ్మ పండుగ జరుపుకుంటారు. ఈ ఏడాది స్టార్టింగ్ ఎండింగ్ డేట్స్.. ఏ రోజు ఏ బతుకమ్మ? ఏ రోజు ఏ నైవేద్యం? తెలుసుకోండి..

Bathukamma 2025 Start and End Date: దసరా నవరాత్రులతో సమానంగా వైభవంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. ప్రకృతితో మనిషికి ఉన్న సంబంధం విడదీయరానిది అని చాటిచెప్పే పండుగ ఇది. శరన్నవరాత్రుల్లో తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాల్లో అమ్మవారిని పూజించినట్టే.. 9 రూపాల్లో బతుకమ్మను పూజిస్తారు. ఏటా మహాలయ అమావాస్య రోజు ప్రారంభమై... అమావాస్య, పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్టి, సప్తమి, అష్టమి వరకూ 9 రోజులు జరుపుకుంటారు. బతుకమ్మ పండుగ ప్రారంభమైన మర్నాటి నుంచి దసరా నవరాత్రులు మొదలవుతాయి.
ఈ ఏడాది సెప్టెంబర్ 21 మహాలయ అమావాస్య నుంచి 30 దుర్గాష్టమి వరకూ వరకూ బతుకమ్మ జరుపుకుంటారు
మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ
మహాలయ అమావాస్య నుంచి బతుకమ్మ మొదలవుతుంది. ఈ రోజు పేర్చే పూలు ముందురోజు తీసుకొచ్చి వాడిపోకుండా నీళ్లలో వేసి మర్నాడు బతుకమ్మ పేర్చుతారు. మొదటి రోజు తమ పూర్వీకులకు అన్నదానం చేసిన తర్వాత బతుకమ్మ పేర్చుతారు..అందుకోసం ఎంగిలిపూల బతుకమ్మ అంటారు. ఈ రోజు బియ్యంతో కలిపి నువ్వులు, బియ్యం పిండి నైవేద్యంగా సమర్పిస్తారు.
రెండో రోజు అటుకుల బతుకమ్మ
దసరా నవరాత్రుల మొదటి రోజు...ఆశ్వయుజ మాసం మొదటి రోజున అటుకుల బతుకమ్మ జరుపుకుంటారు. ఈ రోజు తంగేడు, గునుగు, బంతిపూలు, చామంతి, గడ్డిపూలతో రెండు లైన్లలో బతుకమ్మను పేరుస్తారు. ఈ రోజు బెల్లం, అటుకులు నైవేద్యంగా సమర్పిస్తారు.
మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ
మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ జరుపుకుంటారు. ఈ రోజు చామంతి, మందారం, సీతమ్మ జడ, రామబాణం పూలు పేర్చి బతుకమ్మను అందంగా అలంకరిస్తారు. గౌరమ్మకు పూజలు చేసి అనంతరం దగ్గరున్న నీటిలో నిమజ్జనం చేస్తారు. ఈ రోజు ముద్దపప్పు, పాలు బెల్లంతో కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు
నాల్గవ రోజు నాన బియ్యం బతుకమ్మ
ఆశ్వయుజ మాసం తదియ రోజు నాన బియ్యం బతుకమ్మను పేర్చుతారు. తంగేడు, గునుగు పూలతో పేర్చి గౌరమ్మను పెట్టి పూజిస్తారు. నానబెట్టిన బియ్యం, పాలు బెల్లం నివేదిస్తారు
ఐదవ రోజు అట్ల బతుకమ్మ
అశ్వయుజ మాసం చవితి రోజు అట్ల బతుకమ్మను పూజిస్తారు. ఈ రోజు గౌరమ్మకు గోధుమ అట్లు లేదా బియ్యం పిండితో వేసిన దేసెలు నివేదిస్తారు
ఆరో రోజు అలిగిన బతుకమ్మ
ఆశ్వయుజ మాసం పంచమి రోజు అలిగిన బతుకమ్మను ఆరాధిస్తారు. ఈ రోజు బతుకమ్మ అలుగుతుందని..ఏమీ తినదని అంటారు. అందుకే నైవేద్యం సమర్పించరు.
ఏడో రోజు వేపకాయ బతుకమ్మ
ఆశ్వయుజ శుక్ల షష్టి బతుకమ్మ పండుగ ఏడో రోజు వేపకాయల బతుకమ్మను పూజిస్తారు. ఈ రోజు బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్ల ఆకారంలో తయారు చేసి నివేదిస్తారు
ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ
ఆశ్వయుజ మాసం శుక్ల పక్షం సప్తమి రోజు వెన్నముద్దల బతుకమ్మను పూజిస్తారు. ఈ రోజు నువ్వులు, వెన్న, నెయ్యి బెల్లం నివేదిస్తారు
ఆఖరి రోజు సద్దుల బతుకమ్మ
ఆశ్వయుజ శుక్ల అష్టమి... బతుకమ్మ పండుగలో చివరిరోజు సద్దుల బతుకమ్మ.ఈ రోజు ఊరూవాడా సంబురమే. గౌరమ్మను పూజించి చిన్నా పెద్దా ఆడిపాడి గౌరమ్మను సందడిగా తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు. ఈ రోజు 5 రకాల నైవేద్యాలు సమర్పిస్తారు.






















