Teachers Day 2023: పురాణాల్లో గురువు అంటే వేద వ్యాసుడే - ఈయనని ఆదిగురువు అని ఎందుకంటారో తెలుసా!
Teachers Day 2023: హిందూ సంప్రదాయం ప్రకారం తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదే. పురాణ కాలం నుంచి గురువు అనగానే వ్యాసుడినే ఎందుకు పూజిస్తారు? వ్యాసుడిని ఆదిగురువు అని ఎందుకంటారో తెలుసా...
Maharshi Veda Vyasa Guru of Gurus :
సప్త చిరంజీవుల్లో ఒకడైన వేద వ్యాసుడి అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు. వేదాలను నాలుగు భాగాలుగా విభజించి వేద వ్యాసుడయ్యాడు. వేదాలతో పాటూ మహాభారతం, భాగవతం, అష్టాదశపురాణాలు రచించినదీ వ్యాసుడే. ఆయన అందించిన ఆధ్యాత్మిక వారసత్వం కారణంగానే వ్యాసుడిని గురువులకు గురువుగా, ఆది గురువుగా పూజిస్తారు. వ్యాసుడి పుట్టిన రోజైన ఆషాడ పౌర్ణమిని గురు పౌర్ణమిగా, వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటారు. ఈ రోజు ( సెప్టెంబరు 5) టీచర్స్ డే సందర్భంగా..ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించిన వేదవ్యాసుడిని కూడా స్మరించుకోవాలంటారు పండితులు..
వేద వ్యాసుడు ఎవరు!
పడవనడుపుకునే దాశరాజు కుమార్తె పేరు మత్స్య గంధి. ఆమె అసలు పేరు సత్యవతి. యుక్త వయస్సు వచ్చిన తర్వాత తండ్రికి సహాయంగా పడవనడుపుతూ ఉండేది. ఒక రోజు వశిష్ట మహర్షి మనవడు శక్తి మహర్షి కుమారుడైన పరాశర మహర్షి తీర్ధయాత్రల్లో భాగంగా యమునా నదిని దాటవలసి వచ్చింది. ఆ సమయంలో మత్స్య గంధి తండ్రి అప్పుడే తినేందుకు కూర్చుంటాడు. మహర్షిని ఆగమనడం సరికాదని భావించి కుమార్తె మత్స్యగంధికి పడవ నడిపే పని అప్పగిస్తాడు. సరిగ్గా నది మధ్యకు వెళ్లేసరికి పరాశమ మహర్షి మనసు చలించింది. వెంటనే తన మనసులో కోర్కెను ఆమెకు చెప్పాడు పరాశర మహర్షి. అప్పుడు మత్స్యగంధి ఇలా అంది
మత్స్య గంధి: మహానుభావులు , కాలజ్ఞానులైన మీ ఆలోచన సమంజసమేనా..పైగా పగటి పూట కోరిక తీర్చుకోవడం సరికాదని మీకు తెలియదా
పరాశర మహర్షి: మహర్షులు తలుచుకుంటే సాధ్యం కానిదేముంది అన్నట్టు..ఒక్కసారిగా పడవ చుట్టూ మాయా తిమిరాన్ని అంటే చీకటిని సృష్టించాడు
మత్స్య గంధి: మహర్షుల వారి కోరిక తీరిస్తే కన్యత్వం భంగమవుతుంది..నా తండ్రికి ముఖం ఎలా చూపించుకోగలను
పరాశర మహర్షి: నాతో సంగమించిన తరువాత కూడా నీ కన్యత్వం చెడదు...మరో వరం కూడా కోరుకో
మత్స్య గంధి: నా శరీరం నుంచి వస్తున్న ఈ మస్త్యగంధం( చేపలవాసన) నుంతి విముక్తి కల్పించండి
అప్పటి నుంచి ఆమె శరీరంపై మత్స్య వాసన పోయి గంధపు వాసన పరిమళించింది..అది కూడా ఓ యోజన దూరం వరకూ. అప్పటి నుంచీ మత్స్య గంధి యోజనగంధిగా మారిపోయింది.
ఆ సమయంలో మహర్షి కోర్కె తీర్చగా జన్మించిన పుత్రుడే వ్యాసుడు
Also Read: ద్వారక సముద్రంలో మునిగినప్పుడు మిస్సైన కృష్ణుడి విగ్రహం ఇప్పుడు ఎక్కడుందంటే!
వేదజ్ఞానంతో జన్మించిన వ్యాసుడు
సూర్యసమాన తేజస్సుతో, సర్వ వేదజ్ఞానంతో జన్మించిన వ్యాసుడు పుట్టిన వెంటనే తపస్సుకి వెళుతున్నా అని తల్లితో చెబుతాడు. బాధపడుతున్న తల్లిని చూసి ఎప్పుడు స్మరిస్తే అప్పుడు తప్పక వస్తా అని మాట ఇచ్చి వెళ్లిపోతాడు. చిన్నప్పుడే ఓ ద్వీపంలో వదిలేయడం వల్ల ద్వైపాయనుడు, కృష్ణద్వైపాయనుడు అని వ్యాసుడిని పిలుస్తారు. మహాభారతాన్ని రచించిన వ్యాస మహర్షి భారతకథలో భాగమై ఉన్నాడు. అయినప్పటికీ కర్తవ్య నిర్వహణ మాత్రమే చేస్తూ మిగిలిన వారికి కర్తవ్యబోధ చేస్తూ తిరిగి తన దారిన తాను వెళ్లిపోతాడు.
పాండవులు-కౌరవులు అంతా వ్యాసుడి వారసులే
వ్యాసుడు జన్మించిన వెంటనే తల్లి అనుమతితో తపోవనానికి వెళతాడు. ఆ తరువాత యోజనగంధి అయిన సత్యవతి…భీష్ముడి తండ్రి శంతనుడు వివాహం చేసుకుంచాడు. సత్యవతి తండ్రి దాశరాజు షరతు ప్రకారం భీష్ముడు బ్రహ్మచర్య వ్రతం అవలంబిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. శంతనుని మరణం తరువాత వారి కుమారులైన చిత్రాంగధుడు, విచిత్రవీర్యుడు అకాలమరణం చెందుతారు. ఇక భరతవంశాన్ని నిలిపేందుకు మరో అవకాశం లేకపోవడంతో సత్యవతి తన పుత్రుడైన వ్యాసుడిని స్మరిస్తుంది. భరతవంశాన్ని నిలబెట్టమని కుమారుడిని అడుగుతుంది. అప్పుడు వ్యాసుడి ద్వారా అంబికకు దృతరాష్ట్రుడు, అంబాలికకు పాండురాజు, దాశీకి విదురుడు జన్మిస్తారు. ధృతరాష్టుడి సంతానం కౌరవులు, పాండురాజు సంతానం పాండవులు. ఇక మహాభారతం ప్రతి మలుపులోనూ వ్యాసుడు ఉంటాడు.
Also Read: ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలియాలంటే కృష్ణతత్వం అర్థంచేసుకోవాలి!
ఓంకారం నుంచి ఉద్భవించిన వేదాలు
ఓంకారం నుంచి నాలుగు వేదాలను ఉద్భవించాయి. ఆ ‘అ’కార, ‘ఉ’కార ‘మ’కారములనుంచి సత్వ,రజో,తమో అనే త్రిగుణాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం అనే చతుర్వేదాలు, భూ॰భువ॰సువ॰ అనే త్రిలోకాలు, జాగృత్, స్వప్న, సుషుప్తి అవస్థలు జనియించాయి. ఆ తరువాత బ్రహ్మదేవుడు చతుర్వేదాలను వెలువరించి తనకుమారులైన మరీచి తదితరులకిచ్చాడు. వారు తమ కుమారులైన కశ్యపుడు తదితరులకు ఇచ్చారు. అయితే వేదాలు క్లిష్టమైనవి, అందరకీ అర్థంకానివి కనుక వేద ఉపనిషత్తు సారంతో కూడిన అష్టాదశ పురాణాలను రచించాడు వేద వ్యాసుడు. ఈ పురాణాలను వ్యాసుడు తన శిష్యుడైన రోమహర్షణుకి చెప్పాడు. రోమహర్షుడు తిరిగి వాటిని తన శిష్యులైన త్రైయారుణి, సావర్ణి లాంటి శిష్యులకు అందించాడు. ఆ తర్వాత అలా ఒకరి నుంచి ఒకరికి సంక్రమించాయి. ప్రస్తుతం హిందువులు చదువులున్న పురాణ, ఇతిహాసాలన్నీ వేద వ్యాసుడు అందించినవే. అందుకే ఆయనను ఆది గురువు అంటారు.
భగవంతుడికి భక్తుడికి సంధాన కర్త గురువు
హిందూ మతంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధాన కర్తగా భావిస్తుంటారు. వేదవ్యాసుని మానవజాతికి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళాడు కాబట్టి ఆయన్ను మానవాళికంతటికీ గురువుగా భావిస్తుంటారు
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.