Sri Rama Navami 2022: సకలపాపాలు నశింపజేసి, అంతః శుద్ధిని కలిగించే రెండక్షరాలు ఇవే
భగవన్నామస్మరణలో ఏదో తెలియని అంతరశక్తి, మహిమ ఉంటాయి. అయితే అన్ని నామాలు వేరు రామ నామం వేరంటారు. ఎందుకు, ఈ నామం ఎందుకంత ప్రత్యేకం..శ్రీరామనవమి సందర్భంగా ఏబీపీ దేశం ప్రత్యేక కథనం...
2022 ఏప్రిల్ 10 శ్రీరామనవమి
మనకున్న ఏడుకోట్ల మహామంత్రాల్లో రెండక్షరాలా "రామ" మంత్రం శ్రేష్టమైనదని మనుస్మృతిలో ఉంది. ఎందుకంటే ఇది హరిహరతత్వాలు కలసిన మహామంత్రం. అంటే శ్రీ మహావిష్ణువు, శివుడు కలిస్తే ఏర్పడిన దివ్యమంత్రం. ఎలా అంటే...
'ఓం నమోనారాయణాయ' అనే అష్టాక్షరి మంత్రంలో "రా" అనేది జీవాక్షరం. ఎందుకంటే ఈ మంత్రంలోంచి 'రా' తొలగిస్తే ఓం నమో నాయణాయ అన్నది అర్ధం లేనిదవుతుంది.
'ఓం నమశ్శివాయ' అనే పంచాక్షరి మంత్రంలో "మ" అనేది జీవాక్షరం. ఎందుకంటే ఈ మంత్రంలో 'మ' తొలగిస్తే నశ్శివాయ అవుతుంది. అంటే శివుడే లేడని అర్ధం.
ఈ రెండు జీవాక్షరాల సమాహారమే "రామ". శివకేశవుల సంఘటిత శక్తియే 'రామ'మంత్రం. అందుకే రామమంత్రం సర్వశక్తివంతమైన,శ్రేష్టమైన ముక్తిప్రసాద మంత్రంగా చెబుతారు.
Also Read: ఆంజనేయుడిని పూజిస్తే శనిప్రభావం ఎందుకు తగ్గుతుంది
"రా శబ్దోశ్చారణాదేవ ముఖాన్నిర్యాంతి పాతకాః
పునః ప్రవేశ భీత్యాచ మకారస్తూ కవాటవత్ "
నోరు తెరిచి "రా" అని చెప్పినప్పుడే పాపాలు నోటిద్వారా బయటకు పోయి.. మళ్లీ లోపలకు ప్రవేశించకుండా "మ"కారం తో నోటిని మూసి బంధించేదని అర్థం. అంటే రామ అని పిలిస్తే సర్వపాపాలు శరీరం నుంచి బయటకు వెళ్లి అంతః శుద్ధి కలిగుతుందని అర్థం.
"శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే "
శివుడు పార్వతీదేవికి శ్రీరామ నామ గొప్పతానాన్ని తెలియజేస్తూ ఉపదేశించిన మంత్రం ఇది. విష్ణు సహస్రనామం పారాయణం తర్వాత ఈ శ్లోకంతోనే దాన్ని ముగిస్తారు. శ్రీరామ.. శ్రీరామ.. శ్రీరామ అని మూడు సార్లు అంటే ఇందులోనే వెయ్యి నామాలు ఉన్నాయని.. సకలదేవతలూ ఇందులోనే ఉన్నారని శివుడు పార్వతికి తెలియజేసినట్టు పురాణాలు చెబుతున్నాయి.
Also Read: రాముడి కోదండం ఆకారంలో ఆలయం, చుట్టూ రామాయణ ఘట్టాలు, ఈ అద్భుత ఆలయాన్ని ఒక్కసారైనా చూసితీరాల్సిందే
దశావతారాల్లో ఏడవ అవతారంగా, రావణ సంహరనార్ధమై శ్రీరాముడు వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి గురువారం రోజు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12గంటలకు జన్మించాడు. ఏటా ఈ రోజునే శ్రీరామనవమిని పండగలా జరుపుకుంటాం.
శ్రీ రఘురామ, చారు తులసీ దళధామ, శమక్షమాది శృం
గార గుణాభిరామ; త్రిజగన్నుత శౌర్య రమాలలామ దు
ర్వార కబంధరాక్షస విరామ; జగజ్జనకల్మషార్ణవో
త్తారకనామ భద్రగిరి దాశరథీ కరుణా పయోనిధీ.
మంగళకరమైన ఇక్ష్వాకు వంశంలో జన్మించి తులసి మాలలు ధరించిన,శమ క్షమాది శృంగార గుణములు తాల్చి... రాక్షసుల సంహరించి లోకాలను కాపాడిన రామా...నీకు మంగళం, మా పాపాలు హరింపజేయి..
Also Read: అనారోగ్యం, శనిబాధలు తొలగిపోవాలంటే మంగళవారం ఇలా చేయండి