Varalakshmi Vratham 2025 Date: శ్రావణమాసం ఎప్పటి నుంచి ఎప్పటివరకు, విశిష్టత & పూజా విధానం - వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు!
Sravana Masam 2025 Dates: ఆషాఢ పౌర్ణమి అయిపోయింది..త్వరలో శ్రావణమాసం మొదలవబోతోంది. 2025లో శ్రావణమాసం తేదీలు, వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు జరుపుకోవాలి? పూర్తి వివరాలు

Sravana Masam 2025: చాంద్రమానాన్ని అనుసరించిన నెలల్లో ఐదోనెల శ్రావణం. ఈ నెలలో వచ్చే పౌర్ణమి రోజు చంద్రుడు శ్రవణం నక్షత్రంలో సంచరిస్తాడు..అందుకే శ్రావణం అనే పేరొచ్చింది. శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతిపాత్రమైన నెల మాత్రమే కాదు.. ప్రత్యేక పూజలు, నోములు, ఉపవాసాలకు అనువైన మాసం ఇది. ఆషాఢమాసంలో మొదలయ్యే శక్తి పూజలకు కొనసాగింపుగా శ్రావణమాసంలో పూజలు కొనసాగుతాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి జన్మనక్షత్రం శ్రవణం..అందుకే ఈ నెలలో అమ్మవారిని ప్రశన్నం చేసుకుంటే స్వామివారి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. ఈ నెలరోజుల్లో ఆచరిస్తే చిన్న పుణ్యకార్యం అయినా విశేష ఫలితాలను ఇస్తుందంటారు.
శ్రావణమాసం 2025 ప్రారంభం- ముగింపు తేదీలు (Sravana masam 2025 starting and ending dates)
2025 శ్రావణమాసం ప్రారంభ తేదీ - జూలై 25 శుక్రవారం ( మొదటి శ్రావణ శుక్రవారం)
మొదటి శ్రావణ మంగళవారం - జూలై 29
రెండో శ్రావణ శుక్రవారం - ఆగష్టు 01
రెండో శ్రావణ మంగళవారం - ఆగష్టు 05
మూడో శ్రావణ శుక్రవారం , వరలక్ష్మీ వ్రతం - ఆగష్టు 08
మూడో శ్రావణ మంగళవారం -ఆగష్టు 12
నాలుగో శ్రావణ శుక్రవారం - ఆగష్టు 15
నాలుగో శ్రావణ మంగళవారం -ఆగష్టు 19
ఆఖరి శ్రావణ శుక్రవారం - ఆగష్టు 22
ఆగష్టు 23 శనివారం అమావాస్య తో శ్రావణమాసం ఆఖరి రోజు
ఆగష్టు 24 ఆదివారం నుంచి బాధ్రపదమాసం ప్రారంభం
శ్రావణ సోమవారం (Shravana Somavar Puja Dates )
దక్షిణాయనంలో అత్యంత విశేషమైన నెలల్లో శ్రావణం ఒకటి. శివ కేశవులకు ఎలాంటి బేధం లేకుండా పూజించే నెల ఇది. ఈ నెలలో వచ్చే సోమవారాలు మహిమాన్వితమైనవి అని చెబుతారు పండితులు. సోమవారం శివయ్యకు ప్రీతికరం అని భక్తులు అందరకీ తెలుసు కానీ శ్రావణమాసంలో వచ్చే సోమవారాలు మరింత విశిష్టమైనవి. శ్రావణమాసంలో వచ్చే సోమవారం రోజు రుద్రాభిషేకం, బిళ్వార్చన చేస్తే అత్యంత శుభప్రదం. ఇదే రోజు పార్వతీదేవికి కుంకుమ పూజ చేస్తే సౌభాగ్యం సిద్ధిస్తుంది. ( శ్రావణ సోమవారాలు జూలై 28, ఆగష్టు 4, ఆగష్టు 11, ఆగష్టు 18)
శ్రావణ మంగళవారం (Sravana Mangala Gowri Vratham)
వివాహిత స్త్రీలకు అత్యంత ప్రత్యేకం శ్రావణ మంగళవారాలు. ఈ నెలలో వచ్చే మంగళవారాల్లో మంగళ గౌరి వ్రతం ఆచరిస్తే దాంపత్యజీవితం సంతోషంగా ఉంటుందని నమ్మకం. శ్రావణమాసంలో వచ్చే మంగళవారాల్లో గౌరీవ్రతాన్ని ఆచరించి ముత్తైదువులకు తాంబూలం, వాయనం సమర్పించుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో అవివాహితులు కూడా ఈవ్రతాన్ని ఆచరిస్తారు.
శ్రావణ శుక్రవారం (Sravana sukravaram pooja vidhanam)
శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీవ్రతం ఆచరిస్తారు. ఈ రోజు వరలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే భోగభాగ్యాలు కలుగుతాయని విశ్వాసం. ధనం, భూమి, విజ్ఞానం, ప్రేమ, కీర్తి, సంతోషం, శాంతి, బలం ఇవే అష్టలక్ష్ముల రూపంలో ఉన్నాయంటారు. శ్రావణ మాసంలో శుక్రవారం రోజు లక్ష్మీపూజ చేస్తే సౌభాగ్యం, ఆనందం.
శ్రావణ శనివారం (Shravana Shanivara 2025)
సోమవారం, మంగళవారం, శుక్రవారం మాత్రమే కాదు..శ్రావణమాసంలో వచ్చే శనివారం కూడా ప్రత్యేకమే. ఈ రోజు శ్రీనివాసుడిని పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయట. శ్రీవేంకటేశ్వర ఆరాధనతో పాటూ మీ ఇంటి ఇలవేల్పుని పూజిస్తే సకల శుభాలు చేకూరుతాయి. శ్రావణమాసంలో వచ్చే శనివారాల్లో ఉపవాసం ఉండి దేవాలయంలో ప్రదక్షిణలు చేస్తే కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.






















