Spirituality: ఈ రెండు తిథుల్లో ఏ పని ప్రారంభించినా అడ్డంకులు, అష్టకష్టాలు తప్పవా!
ఏదైనా పని మొదలుపెట్టేటప్పుడు మంచి తిథి చూసుకుంటారు కొందరు. అయితే దశమి, ఏకాదశి అనగానే మంచిదే అనుకుంటారు కానీ మిగిలిన తిథుల్లోనూ మంచి ఫలితాలనిచ్చేవి ఉన్నాయి.. అవేంటో చూద్దాం...
పాడ్యమి నుంచి పౌర్ణమి లేదా అమావాస్య వరకూ 15 రోజులు... నెల రోజుల్లో ఒక్కో తిథి రెండుసార్లు వస్తుంది. అమావాస్య వెళ్లిన పాడ్యమి నుంచి తెలుగు నెల మొదలైతే పదిహేను రోజులకు పౌర్ణమి వస్తుంది..మళ్లీ 15 రోజులకు వచ్చే అమావాస్యతో తెలుగు నెల పూర్తవుతుంది. పౌర్ణమి ముందు వచ్చే రోజులను శుక్లపక్షం అని..అమావాస్య ముందొచ్చే రోజులను కృష్ణపక్షం అని అంటారు. అయితే కొన్ని పనులు తలపెట్టినప్పుడు ఈ తిథి మంచిదా కాదా అనే సందేహం వస్తుంది. పెద్ద పెద్ద కార్యక్రమాలకు అయితే పండితుల దగ్గరకు వెళ్లి ముహూర్తం పెట్టించుకుంటారు. కానీ కొన్ని చిన్న చిన్న పనులకు మాత్రం కేవలం మంచి తిథి చూసుకుని ముందడుగు వేస్తారు. అలాంటప్పుడు కూడా అమావాస్య ముందు ఏదైనా పని చేయాలంటే ఆలోచిస్తారు...అమావాస్య మర్నాడు బలిపాడ్యమి అనే సెంటిమెంట్ మరికొందరికి ఉంటుంది. అయితే ముఖ్యంగా కొన్ని తిథులు ఎప్పుడూ మంచి ఫలితాలనిస్తే...మరికొన్ని తిథులు అశుభఫలితాలను ఇస్తాయంటారు పండితులు.
Also Read: రథ సప్తమి వెనుకున్న ఆధ్యాత్మిక -ఆరోగ్య రహస్యం , పూజా విధానం
తిధులు - వాటి ఫలితాలు
పాడ్యమి తిథి మొదటి అర్థభాగం మంచిదికాదు..తర్వాత అర్థభాగం మంచిది.
విదియ రోజు ఏ పని తలపెట్టినా శుభమే
తదియ కూడా మంచి రోజే. ఈ రోజు చేసే పనుల్లో విజయం, ఆనందం కలుగుతాయంటారు
చవితి చల్లని తిథి అనే పేరు. అయితే మధ్యాహ్నం వరకూ వినాయకుడికి, ఆ తర్వాత మనకు మంచిది
పంచమి తిథి శుభానికి చిహ్నం, ఈ తిథిలో ఏం చేసినా లాభమే
షష్టి రోజు ఏ పనీ పెద్దగా కలసిరాదు..అందుకే ఈ రోజు ఏ పనీ కొత్తగా ప్రారంభించరు. ఒకవేళ అమృత ఘడియలు, తారాఫలం చాసుకుని ప్రారంభించినా ఏదో చిన్న అడ్డంకి మాత్రం తప్పదంటారు పండితులు
సప్తమి రోజు ఏం చేసిన కలిసొస్తుంది, అన్నింటా విజయం వరిస్తుంది. ముఖ్యంగా చదువులకు సప్తమి తిథి మంచిదంటారు
అష్టమి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.. ఇది కేవలం దుర్గాదేవికి మాత్రమే కలిసొచ్చే తిథి..ఈ రోజు ఏం చేసినా అష్టకష్టాలు తప్పవు
నవమి తిథి గురించి చెప్పుకునే ముందు శ్రీరాముడిని తలుచుకోండి..ఆయనకే తప్పలేదు మనమెంత..అందుకే నవమి రోజు కూడా కొత్తగా ఏ కార్యాలూ ప్రారంభించరు
దశమి ...పేరులోనే ఉంది దశ తిరుగుతుందని...ఈ రోజు ఏం చేసినా విజయమే
ఏకాదశి...ఈ రోజు పది పనులు చేపడితే అందులో ఒకటి అవుతుందని చెబుతారు పండితులు
ద్వాదశి తిథి ప్రయాణాలకు మంచిందట. అయితే ఖాళీ కడుపుతో బయలుదేరకుండా ఏదైనా తినేసి వెళితే తలపెట్టిన పనులు నెరవేరుతాయంటారు
త్రయోదశి రోజు ఏ పని చేసినా విజయం వరిస్తుందంటారు
చతుర్దశి తిథిని పెద్దగా పట్టించుకోపోవడం మంచిది
పౌర్ణమి తిథి అన్నీ శుభాలే. ఈ రోజు వర్జ్యం లేకుండా ఉండే మరింత మంచిదని చెబుతారు పండితులు
అమావాస్య రోజు ఏ పనీ కొత్తగా చేయకపోవడమే మంచిదంటారు
Also Read: ఈ ఆలయంలో ప్రతి శిల్పం ఓ పాఠం చెబుతుంది, రథ సప్తమి స్పెషల్
అయితే..షష్టి –శనివారం, సప్తమి –శుక్రవారం, అష్టమి –గురువారం, నవమి – భుదవారం, దశమి –మంగళవారం, ఏకాదశి –సోమవారం, ద్వాదశి –ఆదివారం వచ్చినప్పుడు శుభకార్యాలు చేసుకోవచ్చంటారు. అయితే కొన్ని సార్లు..తిథి కన్నా తారాబలం కుదిరినప్పుడు కూడా కొత్త పనులు ప్రారంభిస్తారు.
నోట్: కొన్ని పుస్తకాలు, కొందరు పండితుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రాసిన వివరాలివి..వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం...