Shakambari Festival 2024: ఇంద్రకీలాద్రిపై శాకాంబరి ఉత్సవాలు.. కూరగాయలతో అమ్మవారిని ఎందుకు అలంకరిస్తారు!
Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు ఏటా ఆషాఢమాసంలో నిర్వహించే శాకాంబరి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆషాఢ శుద్ధ త్రయోదశి నుంచి పౌర్ణమి వరకూ 3 రోజుల పాటూ ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు....
Shakambari Utsavalu 2024: ఆషాఢ మాసంలో మూడు రోజుల పాటూ నిర్వహించే శాకాంబరి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. జూలై 19 త్రయోద్రశి శుక్రవారం ప్రారంభమైన శాకాంబరి ఉత్సవాలు జూలై 21 పౌర్ణమి ఆదివారం వరకూ మూడు రోజుల పాటూ ఘనంగా జరుగుతాయి. విఘ్నేశ్వర పూజతో ప్రారంభమైన శాకాంబరి ఉత్సవాలు..వరుణ పూజ, పుణ్యాహవచనము, అఖండ దీపారాధన చేసి అంకురార్పణ చేశారు. జూలై 19 సాయంత్రం 4 గంటలకు కలశస్థాపన, అగ్నిప్రతిష్టాపన, మండపారాధన హారతి నిర్వహిస్తారు. దుర్గమ్మ సన్నిధిలో నిర్వహించే ఈ ఉత్సవాల కోసం కేవలం విజయవాడ నుంచి మాత్రమే కాదు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు కూరగాయలు సర్పిస్తారు. అమ్మవారి గర్భగుడితో పాటూ .. ఆలయ పరిసర ప్రాంతాలు మొత్తాన్ని పూర్తిగా కూరగాయలతో అలంకరిస్తారు. మొత్తం 25 టన్నుల వివిధ రకాల కూరగాయలు, పండ్లుతో అందంగా అలంకరించారు. మూడు రోజుల పాటూ శాకాంబరిగా దర్శనమిచ్చే దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు బారులుతీరుతున్నారు.శాకాంబరి ఉత్సవాల సందర్భంగా భక్తులకు కదంబం ప్రసాదం పంపిణీ చేయనున్నారు. అమ్మవారిని శాకంబరీదేవిగా పూజిస్తే ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా ఉంటాయని, కరవు కాటకాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.
Also Read: పురాణాల్లో ఉపాధ్యాయ దినోత్సవం..గురుపౌర్ణమి ( జూలై 21) విశిష్టత ఇదే!
హోరెత్తుతున్నవానలు - ఘాట్ రోడ్ మూసివేత
శాకాంబరిగా దర్శనమిస్తున్న దుర్గమ్మను దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వానలు ముంచెత్తుతున్నాయి. దీంతో భక్తుల క్షేమం కోసం...ముందస్తు చర్యలు చేపట్టిన దుర్గగుడి అధికారులు ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ మూసివేశారు. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడితే ప్రమాదం అని ముందుగానే అప్రమత్తమయ్యారు.
శాకాంబరి ఉత్సవాలు మొదలైందే భద్రకాళి సన్నిధిలో
మరోవైపు వరంగల్ భద్రకాళి అమ్మవారి శాకాంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అసలు శాకాంబరి ఉత్సవాలు మొదలైందే భద్రకాళి సన్నిధిలో. దైవం ప్రసాదించిన పూలు, పండ్లు అన్నీ అమ్మకు సమర్పిస్తే కరవుకాటకాలు దరిచేరవని..చేపట్టిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది, ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఏటా ఆషాఢంలో కూరగాయలతో అమ్మను ఆరాధిస్తే సకాలంలో వానలు కురిసి, పంటలు బాగాపండుతాయని, కరవు కాటకాలు దరిచేరవని నమ్ముతారు. అందుకే శాకాంబరిగా కొలువైన అమ్మవారిని దర్శనం చేసుకోవడం అత్యంత శుభప్రదం అంటారు.
Also Read: చాతుర్మాస్య దీక్ష మొదలైంది..ఈ నాలుగు నెలలు పాటించాల్సిన నియమాలేంటి!
శాకాంబరి ఉత్సవాలు ఎందుకు?
దేవీ భాగవతంతో పాటు మార్కండేయ పురాణంలో ఉన్న చండీసప్తశతిలో శాకాంబరీ దేవి గురించి ప్రస్తావన ఉంది. ‘నీటి చుక్క కూడా లేకుండా వందేళ్ల పాటూ అనావృష్టి సంభవిస్తుంది..అప్పుడు మునులంతా తనను స్తుతిస్తారని.. ఆ సమయంలో నా దేహం నుంచి శాకాలను పుట్టించి మళ్లీ వానలు కురిసి, పంటలు పండేవరకూ ప్రజల ఆకలితీరుస్తానని..శాకాంబరిదేవిగా ప్రసిద్ధి చెందుతానని చెప్పింది. అందుకు కృతజ్ఞతగా అమ్మవారిని శాకాంబరిదేవిగా అలంకరిస్తారు. కమలాసనంలో కూర్చున్న అమ్మ పిడికిలి నిండా వరి మొలకలు, మిగిలిన చేతుల్లో పూలు, పండ్లు, దుంపలు, ఇతర కూరగాయలు పట్టుకుని ఉంటుంది. శాకాంబరీ దేవిని భక్తిశ్రద్ధలతో ప్రార్థించేవారికి తరగని సంపద అమ్మవారు ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం.
Also Read: శ్రీ మహావిష్ణువు నిద్రపోవడం ఏంటి.. చాతుర్మాస్య దీక్ష ఎందుకు చేయాలి - ఈ దీక్ష ఎన్ని రకాలు!