Ratha Sapthami 2023: ద్వాదశ ఆదిత్యులు ఎవరెవరు, రథ సప్తమికి కనిపించే సూర్యుడి పేరేంటి!
Dwadasa Aadityulu: సూర్యుడు ఒక్కడే కదా..ద్వాదశ ఆదిత్యులు అని ఎవరిని అంటారనే సందేహం కొందరికి రావొచ్చు..ద్వాదశ ఆదిత్యులు అంటే 12 మంది సూర్యులు అనికాదు..సూర్యుడి తీక్షణత ఆధారంగా వచ్చిన పేర్లవి...
Ratha Sapthami 2023: ఏడాదిలో ఒక్కో రాశి మారుతూ మొత్తం 12 తెలుగు నెలల్లో ఒ్కకో నెలకు ఒక్కో ప్రాధాన్యతను వహిస్తాడు. తెలుగు నెలల ప్రకారం ఆయా సమయంలో సూర్యుడి తీక్షణతని బట్టి ఈ పేర్లు వచ్చాయని చెబుతారు. హిందూ పురాణాలలో "అదితి", కశ్యపుని 12 మంది పుత్రులను ద్వాదశాదిత్యులు అంటారు. సంవత్సరంలోని పన్నెండు నెలల కాలంలో సూర్యుడు ఉండే స్థితులను బట్టి ద్వాదశాదిత్యుల పేర్లతో వర్ణించారు. మహాభాగవతం 12వ స్కంధం చివరిలో ద్వాదశాదిత్యుల వర్ణ ఉంది. ఒక్కొక్క నెలలో సూర్య భగవానుడు ఆయా నామంతో పూజలందుకుంటాడు. సూర్యుడి వెంట ఉండే ఆరుగురు పరిజనులు కూడా నెలని బట్టి మారుతుంటారు.
Also Read: ఈ ఏడాది రథసప్తమి ఎప్పుడొచ్చింది, సూర్యుడిని ఎందుకు ఆరాధించాలి
మహాభారతం, ఆదిపర్వంలోని శ్లోకాలలో చెప్పిన ద్వాదశ ఆదిత్యుల పేర్లు
ధాతా మిత్రః ఆర్యమా శక్రో వరుణ స్త్వంశ ఏవచ
భగో వివస్వాన్ పూషా చ, సవితా దశమస్తథా
ఏకాదశస్తథా త్వష్టా, ద్వాదశో విష్ణురుచ్యతే
జఘన్యజస్తు సర్వేషా మాదిత్యానా గుణాధికః
(ధాత, మిత్ర, ఆర్యమ, శక్ర, వరుణ, అంశ, భగ, వివస్వాన్, పూష, సవిత, త్వష్ట, విష్ణువు)
ఏ నెలలో సూర్యుడిని ఎలా పిలుస్తారు...
1. చైత్రం - 'ధాత'
2. వైశాఖం - అర్యముడు
3. జ్యేష్టం - మిత్రుడు
4. ఆషాఢం - వరుణుడు
5. శ్రావణం - ఇంద్రుడు
6. భాద్రపదం-వివస్వంతుడు
7. ఆశ్వయుజం-త్వష్ణ
8. కార్తీకం-విష్ణువు
9. మార్గశిరం- అంశుమంతుడు
10. పుష్యం-భగుడు
11. మాఘం-పూషుడు
12. ఫాల్గుణం-పర్జజన్యుడు
12 నెలల్లో సూర్యుడి తీక్షణతను బట్టి ఆ పేర్లు వచ్చాయని చెబుతారు.
Also Read: రథసప్తమి రోజు తలపై జిల్లేడు ఆకులు -రేగుపళ్లు పెట్టుకుని స్నానం చేయాలంటారెందుకు!
సూర్యకాంతి ఏడు వర్ణాల కలయిక అని వైజ్ఞానికులు చెబుతుంటే ఆయన ఏడు గుర్రాలున్న రథం మీద లోక సంచారం చేస్తాడని వేదవాజ్మయం చెబుతోంది. ఆ ఏడు గుర్రాల పేర్లు
1. గాయత్రి, 2. త్రిష్ణుప్పు, 3. అనుష్టుప్పు, 4. జగతి, 5. పంక్తి, 6. బృహతి, 7. ఉష్ణిక్కు వీటి రూపాలు సప్త వర్ణాలకు సరి పోలుతాయి.
బ్రహ్మస్వరూప ఉదయే మధ్యాహ్నే తు మహేశ్వరః |
అస్తకాలే స్వయం విష్ణుః త్రయీమూర్తిర్దివాకరః |
సూర్యభగవానుడు ఉదయం వేళలో బ్రహ్మ స్వరూ పంగాను, మధ్యాహ్నం వేళలో మహేశ్వరునిగాను, సాయం వేళలో విష్ణు స్వరూపంగా ఉండి ప్రతిరోజూ త్రిమూర్తి రూపంగా ఉంటూ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంటాడు. సౌరమానం ప్రకారంగా ఏటా మాఘమాసంలో శుద్ధ సప్తమి రథసప్తమి గా పరిగణిస్తారు. సూర్యభగవానుడు జన్మించిన పుణ్య తిధి ఈ రోజు. మాఘమాసంలో శుద్ద సప్తమిని, ‘సూర్యసప్తమి‘, ‘అచలాసప్తమి‘, ‘మహాసప్తమి‘, ‘సప్తసప్తి సప్తమి‘ అని అనేక పేర్లతో జరుపుకుంటారు.
సూర్యగ్రహణతుల్యా సా శుక్లా మాఘస్య సప్తమీ |
అరుణొదయవేళాయాం స్నానం తత్ర మహాఫలమ్ ||
మాఘ శుద్ధ సప్తమి సూర్య గ్రహణంతో సమానం. అరుణోదయసమయంలో చేసిన స్నాన, జప, అర్ఘ్యప్రదాన, తర్పణాలు కోట్ల రెట్ల పుణ్యఫలాన్ని, ఆయురారోగ్య సంపదలను ఇస్తాయి.
రథ సప్తమి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి..సూర్యునికి ఇష్టమైన అర్క పత్రాలను రెండు భుజాలపై తలపై పెట్టుకుని…
సప్త సప్త మహా సప్త సప్త ద్విపా వసుంధర|
సప్త జన్మ కృతం పాపం మకరే హన్తి సప్తమి||
అనే శ్లోకం చెప్పుకుంటూ స్నానం చేయాలి
‘సూర్యునికి అర్కః అని పేరు’. అందుకే సూర్యునికి జిల్లేడు అంటే మహా ప్రీతి. వీటితో కలపి చేసే స్నానం ఆయుర్వేద లక్షణాలను కలిగి ఉంటుంది.. అనేక చర్మ రోగాలను నివారిస్తుంది.