Ramadan 2023: రంజాన్ ఉపవాస దీక్షలు ఎందుకంత కఠినంగా ఉంటాయి, దానివెనుకున్న ఆంతర్యం ఏంటి!
Tough Rules of Ramadan Fasting: ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభం అయింది. సౌదీ అరేబియాలో నెలవంక దర్శనమివ్వడంతో పలు దేశాల్లో ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి.
Ramadan 2023: ఇస్లాం మతంలో రంజాన్ నెలకు చాలా ప్రాధాన్యత ఉంది. ధానధర్మాలకు ప్రతీకగా చెప్పే ఈ మాసంలో నెల రోజుల పాటూ ఉపవాస దీక్షలు చేస్తారు. ఈ దీక్షలతో శరీరం, మనసులోని మలినాలు ప్రక్షాళన కావడంతో పాటు సర్వపాపాలు దహించుకుపోతాయని విశ్వసిస్తారు. సూర్యోదయ సమయంలో ‘సహర్’ నుంచి సూర్యాస్తమయం సమయంలో జరిపే 'ఇప్తార్' వరకు మంచి నీళ్లు కూడా ముట్టుకోకుండా కటిక, కఠిన ఉపవాసం చేస్తారు. ముస్లింల పవిత్రగ్రంధం అయిన ఖురాన్ ఈ మాసంలోనే ఆవిర్భవించిందని మతపెద్దలు చెబుతారు.
ఇస్లామిక్ క్యాలెండర్‌ను అనుసరిస్తూ పవిత్ర మాసంలో ఉపవాస దీక్షలు చేస్తారు. ప్రతి రోజూ ఐదు సార్లు నమాజ్ చేస్తారు..వాటిని ఫజర్, జొహర్, అసర్, మగ్రీబ్, ఇషా అని పిలుస్తారు. వీటిని ఉపవాస దీక్షల సమయంలోనూ కొనసాగిస్తూ..రంజాన్ సందర్భంగా ప్రత్యేకమైన తరావీహ్ నమాజ్‌ను ఆచరిస్తారు.
Also Read: ఈ సారి మన దేశంలో ఈద్ కా చాంద్ ఆలస్యం
కఠిన నిబంధనలతో ఉపవాసం
- ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం 9వ నెల రంజాన్ మాసం
- రంజాన్ మాసంలో ముస్లింలు కఠిన నిబంధనతో కూడిన ఉపవాస దీక్షలు, ప్రార్థనలతో గడుపుతారు
- తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్రలేచి నమాజ్ చేస్తారు. నిత్యం ఐదు పూటలా నమాజ్ చేస్తారు, దీన్ని పంచ్‌వక్త అని అంటారు
- నమాజ్-ఇ-యేషా అనంతరం రాత్రి 10 గంటల వర కు పవిత్ర ఖురాన్‌ను చదువుతారు. అనంతరం దాదాపు 20 నమాజ్‌లు చేస్తారు. వీటిని ‘తరవి’ నమాజ్‌లు అని అంటారు
- 'రోజా' అనే పదాన్ని పవిత్రమైన ఉపవాసం అనేదానికి పర్యాయపదంగా వాడతారు
- 'రోజా' చేస్తున్న వారు ఉదయం సహర్ నుంచి ఇప్తార్ వరకు కనీసం ఉమ్మీని కూడా మింగకుండా కఠిన ఉపవాసం చేయాలి
- సహర్ ముందు తిన్న ఆహారమే రాత్రి ఇప్తార్ వరకు మంచినీరు కూడా ముట్టుకోకుండా కఠిన ఉపవాసాలు నిర్వహిస్తారు.
సహర్ అంటే
సహర్ అంటే ప్రతి ముస్లిం రోజా ఉండే రోజు ఉదయం 3 గంటలకు నిద్ర లేచి ఆహారం సిద్ధం చేసుకుని తీసుకుంటారు. సహర్ అనేది ఉదయం ఉపవాసం ప్రారంభించే ముందు తీసుకొనే భోజనం. అనంతరం ఫజార్ నమాజ్ చేసి ఉపవాసాన్ని ప్రారంభిస్తారు.
ఇఫ్తారీ
సూర్యాస్తమయం తర్వాత ఖర్జూరపు పండు గానీ ఇతర పండ్లు ఏవైనా తిని ఆ రోజు ఉపవాసం విరమిస్తారు..దీనిని ‘ఇఫ్తారీ’ అంటారు.
జకాత్ అంటే
ప్రతి ముస్లిం జకాత్ చేయాలనేది మత విశ్వాసం. జకాత్ అంటే ధానధర్మాలు చేయడం. మనం సంపాదించే దానిలో ఖర్చులకు పోనూ మిగతా సంపాదనలో 2.5 శాతం దానం చేయాలని అర్థం.
Also Read: శ్రీరామ నవమి ఎప్పుడొచ్చింది, రామాయణాన్ని నారాయణుడి కథగా కాదు నరుడి కథగా చదవాలంటారు ఎందుకు!
ఉపవాసం వెనుక తర్కం
ఉపవాసం అంటే దేవుడి కోసం ప్రాపంచికసుఖాలు వదిలివేయటం అని అర్థం. ఉపవాసం అంటే తపస్సు లాంటింది. ఎందుకంటే ఒక వ్యక్తి ఆహారాన్ని, ఇతర కోర్కెలను త్యజించి పూర్తిగా దేవుడిపై దృష్టిసారించడం. అంటే బాహ్య ప్రపంచానికి దూరంగా అంతర్గత ఆధ్యాత్మిక ప్రపంచానికి దగ్గరగా చేరుకోవడం. ఒక్క మాటలో చెప్పాలంటే కార్తీకమాసం అయనా రంజాన్ అయినా ఉపవాసం అంటే దేవుడికోసం కాదు..ప్రతివ్యక్తిలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం అనే వెలుగులోకి తరలివెళ్లడం.