Makar Sankranti 2023: సంక్రాంతి ఆద్యంతం సందడి చేసే హరిదాసు, బసవన్న సాక్షాత్తూ ఎవరో తెలుసా!
భోగి,సంక్రాంతి,కనుమ,ముక్కనుమ…ఏ రోజు ఆనందం ఆ రోజుదే. సంబరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే హరిదాసు, బసవన్న సాక్షాత్తూ పరమేశ్వరుడు,శ్రీ మహావిష్ణువు రూపాలని తెలుసా..
Makar Sankranti 2023: భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ... పండుగలో ఈ నాలుగు రోజుల్లో నిత్యం ఇంటి ముందు సందడి చేస్తారు హరిదాసు, డూడూ బసపన్న. పండుగలో ప్రతి రోజూ ప్రతిక్షణమూ ప్రత్యేకమే..మొదటి రోజు భోగి..
భోగి
నలుగుపిండితో స్నానాలు, భోగిమంటలతో భోగికి స్వాగతం పలుకుతారు. ఇంట్లో ఉండే పాత చీపుర్లూ, విరిగిన బల్లలు, పాత వస్తువులు మంటల్లో వేస్తారు. అంటే పాతను వదిలేసి కొత్తజీవితానికి ఆహ్వానం పలుకుతారు. నాలుగు మార్గాల కూడలిలో వేసే పెద్ద మంట...అప్పటి నుంచి ఇంతకంటే మరింత వేడితో ఉత్తరాయణ సూర్యుడు రాబోతున్నడనేందుకు సంకేతం. సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలుకుతూ ప్రతి ఇంటి ముందూ రంగవల్లులు కళకళలాడిపోతుంటాయి. రంగురంగుల ముగ్గులు వాటి మధ్య గొబ్బిళ్లు ముచ్చటగొలుపుతాయి. ఇక పిండివంటల గురించి చెప్పుకోవాలంటే ఊరంతా ఘుమఘుమలే.
Also Read: సంక్రాంతికి అందరూ ఊరెళ్లిపోతారెందుకు!
సంక్రాంతి
అయ్యగారికి దణ్ణం పెట్టు..అమ్మగారికి దణ్ణం పెట్టూ అంటూ ఇంటింటికి వచ్చే గంగిరెద్దులు పల్లెకి మరో కళ. శివ లింగాకృతికిని గుర్తుచేసే ఎత్తైన మూపురంతో శివునిడో కలసి సంక్రాంతి సంబరాలకు వచ్చానని చెప్పే సంకేతం బసవన్న. ఇంటి ముందు ముగ్గులో బసవన్న నిల్చుంటే ఆనేల ధర్మభద్దమైనది అని చెబుతారు. ఇక పిల్లల్లో సరదాని రెట్టింపు చేసే హరిదాసుల సందడే వేరు. తలపై పాత్ర పెట్టుకుని భక్తుల కోసం నేరుగా శ్రీహరే హరిదాసుగా మారి వస్తాడని నమ్మకం. తలమీద గుమ్మడికాయ ఆకారంలో ఉండే పాత్ర భూమికి సంకేతం. ఆ పాత్రను తలమీద పెట్టుకోవడం అంటే....శ్రీ హరి అయిన తానే భూమిని ఉద్దరిస్తున్నానని చెప్పటం. భక్తులంతా సమానమంటూ తరతమ భేదాల్లేకుండా ఇంటిఇంటికీ తిరుగుతాడు.
కనుమ
పండుగలో మూడో రోజు కనుమ. ఈరోజు మొత్తం పంటలు, పశువులదే. వ్యవసాయంలో సహాయం చేసే పశువులకు కృతజ్ఞతాపూర్వకంగా శుభాకాంక్షలు చెప్పే రోజు ఇది. ఆవులు,ఎద్దులను అందంగా అలంకరించి వాటికి పూజ చేస్తారు. ఈ పండుగ రోజు కోడిపందాలు, ఎడ్ల పందాలు ప్రత్యేక ఆకర్షణ. కేవలం ఆ ఊర్లలో ఉండేవారు మాత్రమే కాదు..పక్క ఊర్లు, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈ పందాలు చూసేందుకు ఆరాటపడతారు.
Also Read: కనుమ రోజు ప్రయాణం చేయకూడదు అంటారు కదా నిజమా - చేస్తే ఏమవుతుంది!
ముక్కనుమ
భోగి, సంక్రాంతి, కనుమ..ఇలా మూడు రోజుల పాటు ప్రతిక్షణం ఆనందం నింపే పండుగను ఘనంగా సాగనంపేరోజే నాలుగో రోజైన ముక్కనుమ. ఇంటి మందు పెద్ద రథం ముగ్గు వేసి ఓ ఇంటిముందు వేసే ముగ్గు కొసని మరొకరు కలుపుతూ ఊరంతా కలసి పెద్ద రథాన్ని తయారు చేస్తారు. ఒకరికొకరు చేదోడు వాదోడుగా అంతా కలసి ఉండాలని సూచించేందుకు రథం ముగ్గు సంకేతం. ఇలా నాలుగు రోజులు నాలుగు క్షణాల్లా గడిచిపోయే వేడుకే సంక్రాంతి.
2023లో జనవరి 14 శనివారం భోగి
జనవరి 15 ఆదివారం సంక్రాంతి
జనవరి 16 సోమవారం కనుమ
జనవరి 17 మంగళవారం ముక్కనుమ
ABP దేశం ప్రేక్షకులందరకీ భోగి,సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు