Maha Navami 2024 : దసరా మహోత్సవాల్లో తొమ్మిదోరోజు అభయాన్నిచ్చే శ్రీ మహిషాసుర మర్దిని అలంకారం!
Navratri 9th Day: శరన్నవరాత్రుల్లో చివరి రోజు ఆశ్వయుజ శుక్ల నవమిని మహర్నవమి అంటారు. ఆ మర్నాడు విజయదశమితో వేడుకలు పూర్తవుతాయి. ఈ రోజు ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ మహిషాసురమర్థినిగా దర్శనమిస్తోంది
Mahishasura Mardhini: మహర్నవమి రోజు అమ్మవారిని అపరాజితగా పూజిస్తారు. మహిషాసురమర్దిని అలంకాంలో అమ్మవారు సింహవాహినిగా పది చేతుల్లో ఆయుధాలు ధరించి దర్శనమిస్తుంది. ఈ రోజు అమ్మవారికి ఎర్రటి వస్త్రాన్ని సమర్పిస్తారు. మహిషాసురమర్దిని పూజిస్తే భయాలు తొలగి, శత్రువులపై విజయం సాధిస్తారని భక్తుల విశ్వాసం.
మహిషాసురుడు విధ్వంసం సృష్టిస్తున్నప్పుడు దేవతలందరూ తమ శక్తులను మిళితం చేసి అమ్మ పార్వతీదేవి భయంకరమైన అవతారమైన దుర్గను సృష్టించారు. శివుని తేజస్సుతో ముఖం, విష్ణువు తీవ్రతతో బాహువులు, బ్రహ్మ తేజస్సుతో పాదాలు, యముడి తేజస్సుతో శిరోజాలు, చంద్రుని తేజస్సుతో వక్షస్థలం, ఇంద్రుని వైభవంతో నడుము, వరుణుడి తేజస్సుతో తొడలు, సూర్యుడి తేజస్సుతో పాదాల వేళ్లు, ప్రజాపతి తేజస్సుతో దంతాలు, అగ్ని తేజస్సుతో కళ్ళు, సాయంత్రం ప్రకాశంతో కనుబొమ్మలు, గాలి నుంచి చెవులు..ఇతర దేవతల తీవ్రతతో మిగిలిన శరీర భాగాలు ఏర్పడ్డాయి.
దేవతకు ప్రాణం పోసారు కానీ.. మహిషాసుర అంతం కోసం ఇంకా అపారమైన శక్తి అవసరం కదా... అప్పుడు శివుడు త్రిశూలం, విష్ణువు సుదర్శన చక్రం, హనుమంతుడు గద, శ్రీరాముడు ధనుస్సు, అగ్ని- వరుణుడు - ప్రజాపతి సహా మిగిలిన దేవతలంతా తమ ఆయుధాల శక్తిని ఇచ్చారు. ఆ ఆయుధాలు తీసుకుని సింహవాహనాన్ని అధిరోహించిన అమ్మవారు మహిషాసురుడిని సంహరించి మహిషాసుర మర్థినిగా నిలిచింది.
అమ్మవారికి తనవాళ్లు, పరాయివాళ్ళు అనే భేదభావం లేదు. ఆమెకు నాశనం లేదు..నిత్య స్వరూపిణి. మృత్యువును నశింపచేసే ముక్తేశ్వరి. తాను చేసిన మేలుకి బదులుకోరిని తల్లి..అన్ని మంత్రాలకు, అన్ని యంత్రాలకు, అన్ని తంత్రాలు ఆమెను ఆశ్రయించే ఉంటాయి. అమ్మవారి అనుగ్రహం లభిస్తే సాధ్యం కానిది లేదు.
Also Read: ఆశ్వయుజ మాసం ప్రారంభ - ముగింపు తేదీలు.. కార్తీకమాసం ఎప్పటి నుంచి మొదలు!
‘నదీనాం సాగరోగతిః’
ఎక్కడినుంచో నదులన్నీ చివరకు సముద్రంలో చేరినట్టు ..మంత్ర, తంత్ర,యంత్రాలన్నీ చివరకు జగన్మాతలోనే చేరుతాయి. ఆ జగన్మాతే మహిషాసుర మర్దిని.
అమ్మవారి ఉపాసకులు కుండలినీ శక్తితో సాధన చేసేవారు..9 రోజులు అమ్మవారిని తొమ్మిది విధాలుగా పూజించి.. పదో రోజు దశ అవస్థలో విజయాన్ని పొందుతారు. అందుకే నవరాత్రి వ్రతానికి విజయదశమి ముగింపుగా చెబుతారు. బాలా త్రిపుర సుందరి, గాయత్రి, లలితా త్రిపురసుందరి, అన్నపూర్ణ, మహాలక్ష్మి, సరస్వతి, దుర్గ, మహిశాసురమర్దిని, రాజరాజేశ్వరి పేర్లతో రోజుకో అలంకారంలో పూజిస్తారు. నవరాత్రుల ఆరంభంలో బాలపూజ చేయలేనివారు చివరి మూడు రోజుల్లో చిన్నారులను అమ్మవారిలా అలంకరించి, పూజించి, వస్త్రాలు సమర్పించి, భోజనం పెడతారు.
అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ..సకల భయాలు తొలగించి , సర్వ సంపదలు ప్రసాదిస్తుందని భక్తు విశ్వాసం. ఆ శక్తి స్వరూపిణి, మహేశ్వరి, పరాశక్తి, జగన్మాత లేకుంటే పరమేశ్వరుడు కూడా తన విధులను నిర్వర్తించలేడు. శివుని శక్తి రూపమే దుర్గ అని స్వయంగా ఆదిశంకరాచార్యులు తన అమృతవాక్కులో పేర్కొన్నారు.
మనసును జయిస్తే మనిషి మహాత్ముడు అవుతాడు. అదే మనసుకి వశమైతే పతనైపోతాడు. ఇది అధర్మ కాముకతకు జగన్మాత విధించిన శిక్ష. మహిషాసురుడు అంటే వక్రబుద్ధి, క్రూరబుద్ధి కలవాడు, కామాంధుడు అని అర్థం. అలాంటి దుష్టబుద్ధిగల వారి అజ్ఞానం మర్దించి, మహిషబుద్ధిని నశింపజేసి, జ్ఞానాన్ని , వివేకాన్ని కలిగించే దేవత మహిషాసురమర్దిని
మహేం, మహేం, వాసీ దన్తీతి మహిషాః అసురాః రాక్షసాః తాన్ మర్ణయతీతి మహిషాసుర మర్దినీ
భూమినీ ప్రజలను హింసించేవారని, లోక కంటకులైన రాక్షసులని, దుర్మార్గంతో భూదేవికి భారమైన వాళ్ళను మట్టుపెట్టే మహాశక్తి జగన్మాత.. ఆ జగన్మాతే ‘మహిషాసురమర్దిని’
శ్లోకం
సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాథకే,
శరణ్యే త్య్రంబకేదేవి నారాయణి నమోస్తుతే
Also Read: దసరాకి కాశీ వెళితే చాలు.. మొత్తం 9 మంది అమ్మవార్లను దర్శించుకోవచ్చు!