Kurma Jayanti 2024 : శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒకటి - బ్రహ్మదేవుడు ప్రతిష్టించిన ఆలయం!
Kurma Jayanti 2024 :శ్రీ మహా విష్ణువు దశావతారాల్లో ఒకటి కూర్మావతారం. కూర్మరూపంలో మహావిష్ణువు దర్శనమిచ్చే ఒకేఒక్క ఆలయం శ్రీ కూర్మం. శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ఈ ఆలయం విశిష్టత మీకోసం..
Kurma Jayanti 2024 : వైశాఖ పౌర్ణమి రోజే కూర్మజయంతి వచ్చింది. ఇదే రోజు అన్నమాచార్య జయంతి, బుద్ధ పూర్ణిమ... శ్రీమహావిష్ణువు దశావతారాల్లో ఒకటి కూర్మనాథుడు... ఈయన కొలువైన పుణ్యప్రదేశమే శ్రీకూర్మం....
మంధనాచల ధారణ హేతో, దేవాసుర పరిపాలవిభో
కూర్మాకార శరీర నమో, భక్తం తే పరిపాలయమామ్.
సత్యయుగంలో దేవతలు - రాక్షసులు అమృతం కోసం మందరగిరిని కవ్వంగా, వాసుకిని తాడుగా చేసుకుని పాలసముద్రం చిలుకుతున్నారు. ఇంతలో మందరగిరి పర్వతం జారిపోతూ సముద్ర మధనానికి ఆటంకం కలిగిస్తోంది. ఈ ఆటంకాన్ని ఎలా అధిగమనించాలని దేవతలంతా శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా..అప్పుడు నారాయణుడు కూర్మరూపంలోకి మారి..మందరగిరి పర్వతాన్ని తన భుజాలపై మోస్తూ క్షీరసాగరమథనం చేసేందుకు సహకరించాడు. అలా ఉద్భవించినదే కూర్మావతారం. శ్రీ మహావిష్ణువుకి ఎన్నో ఆలయాలున్నాయి కానీ కూర్మరూపంలో కొలువైన ఆలయం ఇదొక్కటే కావడం విశేషం.
Also Read: శ్రీ మహా విష్ణువు ఖడ్గమే అంశగా జన్మించిన పదకవితా పితామహుడి జయంతి!
పశ్చిమాభిముఖంగా కూర్మనాథుడు
కృతయుగంలో శ్వేతరాజు..ఆయన భార్య వంశధారల భక్తికి మెచ్చిన కూర్మనాథుడు వారి కోర్కె ప్రకారం పశ్చిమాభిముఖంగా వెలిశాడు. శ్రీ కూర్మం ప్రస్తావన కూర్మ, బ్రహ్మాండ,పద్మ పురాణాలలో ఉంది. శ్రీరామచంద్రుడు, జమదగ్ని సహా ఎందరో పురాణ పురుషులు కూర్మనాథుడిని దర్శించుకున్నారు. ఈ ఆలయంలో ఉన్న మరో ప్రత్యేకత రెండు ధ్వజస్తంభాలు. ఈ రెండింటిని శివకేశవులకు ప్రతీకలుగా చెబుతారు. మూలవిరాట్టును సృష్టికర్త బ్రహ్మదేవుడు ప్రతిష్టించాడు. స్వామివారి సుదర్శన చక్రంతో ఇక్కడ పుష్కరిణి సృష్టించారని...ఇక్కడ స్నానమాచరిస్తే కలిదోషాలు తొలగిపోతాయని చెబుతారు.
కాశీతో సమానమైన క్షేత్రం శ్రీ కూర్మం
వారణాశిలో పిండ ప్రదానం చేస్తే పితృదేవతలకు స్వర్గప్రాప్తి ఉంటుందంటారు. అయితే పితృకార్యాలకు అందే విశిష్టమైనది శ్రీ కూర్మం. కాశీ వెళ్లలేని వారు శ్రీ కూర్మంలోనే పిండప్రధానాలు నిర్వహిస్తారు. ఏటా మాఘశుద్ధ చవితి రోజు గంగాదేవి శ్రీకూర్మం వచ్చి ఇక్కడ శ్వేతపుష్కరిణిలో స్నానమాచరిస్తుందని..భక్తులు విడిచిన పాపాలు ప్రక్షాళన చేస్తుందని చెబుతారు. అందుకే అంత పవిత్రత ఉ్నన పుష్కరిణిలో అస్తికలు కలిపితే పితృదేవతలు కొంతకాలానికి సాలగ్రామ శిలగా మారుతారని విశ్వశిస్తారు. ఈ ఆలయం నుంచి ఓ సొరంగ మార్గం ఉందని...ఈ మార్గం ద్వారా కాశీ చేరుకోవచ్చంటారు. కానీ ఇప్పుడు ఆ సొరంగ మార్గం మూసివేశారు.
Also Read: మీ జాతకంలో ఉండే దోషాలకు అద్భుతమైన పరిష్కారం చూపే వైశాఖ పౌర్ణమి!
ఆలయ నిర్మాణం ఎప్పుడు జరిగిందంటే..
వాస్తవానికి ఈ ఆలంయ ఎవరు నిర్మించారన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియదు కానీ ఏడో శతాబ్ధంలో ఈ ఆలయం వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి తరతరాలుగా రాజవంశాలు అభివృద్ధి చేస్తున్నాయి. కళింగ, ఆంధ్ర, చోళుల రాజవంశ పాలనలో దీన్ని అభివృద్ధి చేశారు. ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యుల శిష్యులైన శ్రీనరహరితీర్థులు శ్రీ కూర్మాన్ని సందర్శించారు. ఆలయ పైభాగం అష్టదళ పద్మాకారంలో ఉంటుంది. శిల్పకళ ఆకట్టుకుంటుంది. ఇక్కడున్న రాతి స్తంభాలు ఒకదానితో మరొకటి పోలిక ఉండకపోవడం విశేషం.
అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని దర్శించుకుని...అక్కడి నుంచి శ్రీ కూర్మం వెళ్లొచ్చు. ఈ రెండు ఆలయాలు చూడాలి అనుకునేవారు శ్రీకాకుళంలో స్టే చేసేందుకు సౌకర్యాలున్నాయి. శ్రీకాకుళం పాత బస్టాండ్ నుంచి అరసవెల్లి వెళ్లి అక్కడి నుంచి పది కిలోమీటర్ల దూరంలో శ్రీ కూర్మం ఉంది.