Vaishakha Purnima 2024: మీ జాతకంలో ఉండే దోషాలకు అద్భుతమైన పరిష్కారం చూపే వైశాఖ పౌర్ణమి!
మే 23 వైశాఖ పౌర్ణమి, బుద్ధ పౌర్ణమి...ఈ రోజు రావిచెట్టుకి పూజలు చేస్తే శారీరక, మానసిక బాధలు నశించడంతో పాటూ జాతకంలో ఉండే దోషాలు తొలగిపోతాయని చెబుతారు.
Spiritual Significance Of The Peepal Tree: ప్రకృతిని ఆరాధించడం భారతీయ సంప్రదాయంలో ఓ భాగం. ఓ తనయుడికి జన్మనివ్వడం కన్నా నలుగురు నడిచేదారిలో నీడనిచ్చే చెట్టుని నాటడం పుణ్యప్రదం అని చెబుతోంది భవిష్య పురాణం. కేవలం బాటసారులకు మాత్రమేకాదు...మహా వృక్షాలు మానవసృ, దేవ, నాగ, గంధర్వ, కిన్నెర, రాక్షసులకు నిలయంగా ఉంటాయని...పితృదేవతలను తృప్తి పరుస్తాయని భవిష్యపురాణంలో పేర్కొన్నారు. ఇలాంటి మహావృక్షాల్లో అత్యంత విశిష్టమైనది రావిచెట్టు. ఈ వృక్షాన్ని శ్రీ మహావిష్ణువు స్వరూపంగా పూజిస్తారు. జాతకంలో దోషాలున్నా, కుటుంబంలో సమస్యలున్నా, శనిదోషం వెంటాడుతున్నా..ఇంకా వివాహ సమస్యలు, సంతాన సమస్యలు ఇలా అన్నింటికీ రావిచెట్టు పూజ పరిష్కారం.
Also Read: ఈ రోజే బుద్ధ పూర్ణిమ, వైశాఖ పౌర్ణమి - ఇలా చేస్తే చాలా మంచిది!
సకల దోషాలకు పరిష్కారం రావిచెట్టు పూజ
రావిచెట్టును త్రిమూర్తుస స్వరూపంగా భావిస్తారు... రావిచెట్టు మూలంలో శ్రీ మహావిష్ణువు, చెట్టు కాండంలో శివుడు, చెట్టు ఆకుల భాగంలో బ్రహ్మ ఉంటాడని చెబుతారు. ఈ చెట్టుకి నమస్కరించి, ప్రదిక్షిణ చేస్తే సంపూర్ణ ఆయుష్షు లభిస్తుందని, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని పద్మపురాణంలో ప్రస్తావించారు. రావిచెట్టుకు నీరు సమర్పించేవారికి ఇహలోకంలో చేసే పాపాలు నశించి స్వర్గలోకం ప్రాప్తిస్తుందని విశ్వాసం. రావిచెట్టుపై పితృదేవతలుంటారని, తీర్థయాత్రలు చేసిన పుణ్యఫలం రావిచెట్టు చుట్టూ ప్రదిక్షిణ చేస్తే లభిస్తుందని విశ్వశిస్తారు. అందుకే రావిచెట్టుకింద పూజ, యాగం , పురాణ పఠనం అత్యంత పుణ్యప్రదం అని భావిస్తారు. మరీ ముఖ్యంగా జాతకంలో దోషాలతో బాధపడేలారు, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉండేవారు రావిచెట్టుకి నీరు సమర్పించి చెట్టుకింద దీపం వెలిగించి నమస్కరిస్తే శనీశ్వరుడి ఆగ్రహం తగ్గి అనుగ్రహం లభిస్తుంది.
వైశాఖ పూర్ణిమ మరింత ప్రత్యేకం
శ్రీ మహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన వైశాఖ పౌర్ణమి రోజు రావిచెట్టుకు పూజచేస్తే వెంటాడుతున్న సమస్యల నుంచి బయటపడడంతో పాటూ శుభఫలితాలు పొందుతారని శాస్త్రం చెబుతోంది. ఈ రోజు రావి చెట్టుకు నీళ్లు పోసి, నువ్వుల నూనె లేదంటే ఆవునేతితో దీపారాధన చేయాలి. రావి చెట్టుకు నీళ్లు కలిపిన పాలు, నల్ల నువ్వులు బెల్లం కలిపి నైవేద్యంగా పెడితే పితృదేవతల అనుగ్రహంతో వంశాభివృద్ధి ఉంటుంది. పసుపు, కుంకుమ సమర్పిస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఎవరి జాతకంలో అయినా వివాహానికి సంబంధించిన దోషాలుంటే..ముందుగా రావిచెట్టుతో పెళ్లి జరిపించి ఆ తర్వాత వరుడు లేదా వధువుతో వివాహం జరిపిస్తారు. వైశాఖ పౌర్ణమి రోజు సముద్రస్నానం ఆచరించి రావిచెట్టు దగ్గర దీపం వెలిగించి 11 ప్రదక్షిణలు చేస్తే శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుందని జ్యోతిష శాస్త్ర పండితులు చెబుతున్నారు. ఈ రోజు చేసే దానధర్మాలు, పూజలకు కోటిరెట్లు ఫలితం ఉంటుందని శాస్త్రవచనం.
Also Read: అమావాస్య-పౌర్ణమికి పిచ్చి ముదురుతుందా , వ్యాయామం చేసేవారిపైనా ప్రభావం ఉంటుందా!
దేవతా వృక్షం
వాతావరణ కాలుష్యాన్ని నివారించి, రోగకారక క్రిములను నాశనం చేసే శక్తి ఉండడం వల్లే రావిచెట్టును దేవతా వృక్షంగా భావిస్తారు. అందుకే ప్రతి దేవాలయ పరిధిలో రావిచెట్టు ఉంటుంది. ఈ చెట్టుకి హానిచేయడం అంటే బ్రహ్మహత్యతో సమానంగా భావిస్తారు. వైజ్ఞానిక పరంగా రావిచెట్టు నిరంతర ప్రాణ వాయువుని వెలువరిస్తుంది..అందుకే దీని సమీపంలో ఉండడం వల్ల ప్రాణశక్తి వృద్ధి చెందుతుంది.