Annamacharya Jayanti 2024 : శ్రీ మహా విష్ణువు ఖడ్గమే అంశగా జన్మించిన పదకవితా పితామహుడి జయంతి!
Annamacharya Jayanti 2024 : సాహితీ చరిత్రలో తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు అన్నమయ్య జయంతి ఈ రోజు. వైశాఖ పౌర్ణమి విశాఖ నక్షత్రంలో జన్మించాడు అన్నమయ్య...
Annamacharya Jayanti Mahotsavam 2024 : శ్రీ మహావిష్ణువు ఖడ్గం అయిన నందకం అంశగా అన్నమయ్య జన్మించాడని చెబుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలో రాజంపేట మండలానికి సమీపంలో ఉన్న తాళ్లపాకలో నారాయణసూరి, లక్కమాంబనారాయణ సూరి పుణ్య దంపతులకు వైశాఖ పౌర్ణమి రోజు జన్మించాడు అన్నమయ్య. తల్లిదండ్రులు స్మార్త సంప్రదాయానికి చెందిన బ్రాహ్మణ వర్గానికి చెందినప్పటికీ...వైష్ణవ దీక్షను స్వీకరించి రామానుజాచార్య సంప్రదాయంలో వైష్ణవుడిగా మారాడు అన్నమయ్య. శ్రీవేంకటేశ్వరునిపై సంకీర్తనలను రచించి గానం చేసిన అన్నమాచార్యుల జయంతి సందర్భంగా తిరుమల సహా, ఆయన పుట్టిన తాళ్లపాకలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
Also Read: మీ జాతకంలో ఉండే దోషాలకు అద్భుతమైన పరిష్కారం చూపే వైశాఖ పౌర్ణమి!
అందుబాటులో 15 వేల కీర్తనలు
32 వేలకు పైగా సంకీర్తనలు రాసి తెలుగు భాషలో మాధుర్యాన్ని, భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం వంటి కీర్తనలు రచించి గానం చేసి శ్రీవేంకటేశ్వరస్వామిని మెప్పించిన అసామాన్య భక్తుడు అన్నమయ్య. అయితే అన్నమయ్య రాసిన సంకీర్తనల్లో కేవలం 15 వేల సంకీర్తనలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అన్నమయ్య...నారసింహడు, రామడు, కృష్ణుడు, హనుమంతుడు, అలమేలు మంగలను కీర్తిస్తూ ఎన్నెన్నో కీర్తనలను రచించినా అవన్నీ అంకితం ఇచ్చింది మాత్రం శ్రీ వేంకటేశ్వరస్వామికే. ఈ కీర్తనలలో కేవలం భక్తిమాత్రమే కాదు.. బ్రహ్మ మొక్కటే పరబ్రహ్మమొక్కటే..అంటూ సామాజిక కోణం కూడా ప్రదర్శించాడు.
“వేడుకతో చదివితే వేదశాస్త్ర సంపన్నుడౌ
జాడతో నూరకుండితే జడుడౌను!
ఓడక తపసియైతే ఉన్నతోన్నతుడౌ
కూడక సోమరి ఐతే గుణహీనుడౌను!”
“శ్రద్ధతో చేస్తేనే కార్యాలు పూర్తవుతాయి..మొక్కుబడిగా చేసే పనిలో ఎలాంటి ఫలితం ఉండదు...శ్రద్ధగా చదివితే వేదశాస్త్ర పారంగతుడివి అవుతావు నామమాత్రంగా చదివితే మూర్ఖుడిగా మిగులుతావన్నది పై శ్లోకం అర్థం...
Also Read: ఈ రోజే బుద్ధ పూర్ణిమ, వైశాఖ పౌర్ణమి - ఇలా చేస్తే చాలా మంచిది!
అన్నమయ్య వివాహం
నిరంతరం భగవంతుడి ధ్యానంలో మునిగితేలే అన్నమయ్యకు సాక్షాత్తూ శ్రీ వేంకటేశ్వరస్వామి దిగివచ్చి తిమ్మక్క, అక్కమ్మ అనే ఇద్దరినీ ఇచ్చి వివాహం జరిపించాడు. ఇద్దరు భార్యలతో కలిసి తిరుమలను దర్శించిన అన్నమయ్య ఆ సమయంలోనే శ్రీవేంకటపతికి రోజుకొక సంకీర్తన వినిపించాలని సంకల్పించాడు. అప్పటి నుంచి కీర్తలు రచిస్తూ వాటిని తాళపత్రాల్లో నిక్షిప్తం చేశాడు. భార్యలతో కలసి తీర్థయాత్రలకు బయలుదేరిన అన్నమయ్య మొదట చెన్నకేశ్వ స్వామిని దర్శించుకున్నారు...ఆ తర్వాత నవనారసింహ క్షేత్రం అయిన అహోబిలం వెళ్లారు. ఆ క్షేత్రాన్ని తన కీర్తనలతో స్తుతించాడు.
తాళ్లపాకలో శ్రీవారి కళ్యాణం
అన్నమాచార్యుల జయంతి ఉత్సవాలు మే 23 నుంచి మే 29 వరకూ తాళ్లపాకలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తాళ్లపాకలోని ధ్యానమందిరం వద్ద శ్రీవారి కల్యాణం నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా 3 రోజుల పాటూ అన్నమయ్య విగ్రహం వద్ద సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వహిస్తారు.
తిరుపతిలో సాంస్కృతిక కార్యక్రమాలు
తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో వారం రోజుల పాటూ రోజూ ఉదయం సప్తగిరి గోష్టిగానం, సాయంత్రం 6 గంటలకు సంగీత సభ జరగనుంది. మే 23 నుంచి 29వ వరకు ఉదయం 10.00 గంటలకు సాహితీ సదస్సు సహా వాద్య, నృత్య కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఓవరాల్ గా చెప్పాలంటే యుగాలు మారినా, తరాలు మారినా...కలియుగ దైవం ఉన్నంతకాలం శ్రీ అన్నమాచార్యుల వారు భక్తుల మదిలో పదిలంగా ఉంటారు...