Khairatabad Ganesh Immersion 2024: గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహాగణపతి - కన్నుల పండువగా వేడుక, వేలాదిగా పాల్గొన్న భక్తులు
Ganesh Immersion 2024: ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ప్రక్రియ ఘనంగా ముగిసింది. మంగళవారం ఉదయం ప్రారంభమైన శోభాయాత్ర మధ్యాహ్నానికి హుస్సేన్ సాగర్ చేరుకుంది.

Khairatabad Ganesh Immersion Completed: ఖైరతాబాద్ మహాగణపతి (Khairatabad Ganesh) నిమజ్జనం ప్రక్రియ ముగిసింది. ఎన్టీఆర్ మార్గ్‌లోని 4వ నెంబర్ క్రేన్ వద్ద భారీ గణపయ్యను నిమజ్జనం చేశారు. భక్తుల జయ జయ ధ్వానాల మధ్య గౌరీపుత్రుని తనయుడు గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. సూపర్ క్రేన్ ద్వారా 70 అడుగుల మహాశక్తి గణపతిని నిమజ్జనం చేశారు. అంతకుముందు ఉత్సవ కమిటీ నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం ఉదయం ప్రారంభమైన శోభాయాత్ర టెలిఫోన్ భవన్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్ మీదుగా మధ్యాహ్నానికి హుస్సేన్ సాగర్ చేరుకుంది. ఈ శోభాయాత్రలో భక్తులు వేలాది మంది పాల్గొన్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఖైరతాబాద్ గణేశుని నిమజ్జనం పూర్తి కావడంతో ఇక మిగిలిన చోట్ల విగ్రహాల నిమజ్జనం ఊపందుకోనుంది.
జనసంద్రంగా ట్యాంక్ బండ్
అటు, గణేష్ నిమజ్జనం సందర్భంగా భాగ్యనగరం సందడిగా మారింది. ట్యాంక్ బండ్ పరిసరాలు జనసంద్రంగా మారాయి. ఇసుకేస్తే రాలనంతగా భక్తులు తరలి రావడంతో ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్, సచివాలయం, ఐమాక్స్ మార్గాలు కిక్కిరిసిపోయాయి. వేలాది విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరుతున్నాయి. బుధవారం సాయంత్రానికి అన్ని విగ్రహాల నిమజ్జనం పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా దాదాపు 25 వేల మంది పోలీసులు బందోబస్తు విధుల్లో నిమగ్నమయ్యారు. సీసీ కెమెరాలతో నిఘా తీవ్రం చేశారు. ఆకతాయిల చర్యలు అరికట్టేలా షీ టీమ్స్ బృందాలు సైతం రంగంలోకి దిగాయి.
ట్యాంక్ బండ్‌పై నిమజ్జనం ప్రక్రియను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. క్రేన్ డ్రైవర్స్, ఇతర సిబ్బంది అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. మూడు షిఫ్టుల్లో డ్రైవర్స్, సిబ్బందికి విధులు కేటాయించేలా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
ట్రాఫిక్ ఆంక్షలు
గణేష్ నిమజ్జనం సందర్భంగా మంగళ, బుధవారాల్లో నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి పెద్దఎత్తున గణేష్ విగ్రహాలు హుస్సేన్ సాగర్ వైపు రానుండడంతో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తామని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. మరోవైపు, గణేష్ నిమజ్జనం ఉత్సవాల సందర్భంగా అర్ధరాత్రి వరకూ ఎంఎంటీఎస్ రైళ్ల అదనపు సర్వీసులను ద.మ రైల్వే నడపనుండగా.. ఆర్టీసీ సైతం ప్రత్యేక బస్సులు నడపనుంది. అర్ధరాత్రి 2 గంటల వరకూ మెట్రో సర్వీసులు నడుస్తాయని అధికారులు వెల్లడించారు.
రికార్డు ధరకు బాలాపూర్ లడ్డూ
మరోవైపు, బాలాపూర్ గణేశుని లడ్డూ రికార్డు ధర పలికింది. గతేడాది వేలంలో లడ్డూ రూ.27 లక్షలకు వెళ్లగా.. ఈసారి రూ.30 లక్షల వెయ్యికి పలికింది. కొలను శంకర్ రెడ్డి ఈ మొత్తాన్ని చెల్లించి లడ్డూను దక్కించుకున్నారు. కొత్త రూల్ ప్రకారం ముందుగా గతేడాది అమ్ముడుపోయిన లడ్డూ ధర డిపాజిట్ చేస్తేనే ఈసారి వేలంలో పాల్గొనే అవకాశం కల్పించగా.. చాలా తక్కువ మంది మాత్రమే డబ్బులు డిపాజిట్ చేసి వేలంలో పాల్గొన్నారు. లడ్డూ దక్కించుకున్న అనంతరం శంకర్ రెడ్డి మాట్లాడారు. 'బాలాపూర్ లడ్డూ మా కుటుంబానికి దక్కడం ఇది తొమ్మిదోసారి. ఈ లడ్డూను ప్రధాని మోదీకి అంకితం చేస్తున్నా.' అని పేర్కొన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

