Karthika Snanam: కార్తీకమాసం 30 రోజులు తలస్నానం చేసి పూజ చేయాలా? అనారోగ్యంతో ఉండేవారూ ఈ నియమం పాటించకపోతే పాపమా?
Karthika Masam 2025: కార్తీకమాసంలో పాటించాల్సిన నియమాల జాబితా చాలా ఉంటుంది. మొదటి నియమమే స్నానం..ఆ తర్వాత దీపం, జపం, దానం...మరి మొదటి నియమమే సడలిస్తే ఏమవుతుంది?

Karthika Masam 2025
కార్తీకం నెల రోజులు నియమాలు పాటించాలి అనుకునేవారు తలస్నానంతో మొదలుపెడతారు
రోజూ వేకువజామునే నదులు, చెరువులు, బావులు వద్ద స్నానమాచరించి ఆ ఒడ్డునే దీపం వెలిగించి హరిహరులను ప్రార్థిస్తారు
మరి అనారోగ్యంతో ఉండేవారి పరిస్థితి ఏంటి? నిత్యం తలకుకాకుండా...సాధారణ స్నానం ఆచరించి దీపం వెలిగించకూడదా?
కార్తీకమాస నియమాల్లో మొదటిదే తలకుస్నానం ఆచరించడం కదా? మరి ఆ నియమాన్నే ఉల్లంఘిస్తే ఎలా అంటారా?
వ్రతం, పూజ, నోము, ఉపవాసం..ఏదైనా కానీ భగవంతుడికి భక్తుడిని మరింత దగ్గర చేయడంలో భాగమే. అందుకే ఇలా చేస్తేనే భగవంతుడు కరుణిస్తాడని అనుకోవాల్సిన అవసరం లేదు..భక్తి ప్రదర్శించే విషయంలో ఒక్కొక్కరి తీరు ఒక్కోలా ఉంటుంది.
కొందరు కఠినమైన పూజలు చేస్తారు
మరికొందరు మానవసేవే మాధవ సేవ అంటారు
ఇంకొందరు మూగజీవాలకు ఆహారం అందించి అదే భగవంతుడి సేవగా భావిస్తారు
ఇంకా ఆలయాలను సందర్శించి భక్తి ప్రదర్శించేవారు కొందరు..నిత్యం భక్తిశ్రద్ధలు పూజలు చేసేవారు ఇంకొందరు...
అంటే..మీరు భక్తిశ్రద్ధలతో చేసే పనిలోనే భగవంతుడు ఉన్నాడు..మీరు పాటించే నియమాల్లో కాదని తెలుసుకోవాలని చెబుతారు ఆధ్యాత్మికవేత్తలు
కార్తీకమాసం అంటేనే నెలరోజుల పాటూ చన్నీటిస్నాలు.. దీపాలు, పూజలు...ఆలయాల్లో భక్తుల సందడి. ఇల్లు, ఆలయం ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక వాతావరణమే. అయితే దీపధూపాలకు ముందు ఆచరించే చన్నీటి స్నానం దగ్గరే కొందరికి సమస్య వస్తుంది. ఆరోగ్యం సహకరించదు. అయినప్పటికీ అమ్మో..చన్నీళ్లతో తలకు స్నానం ఆచరించకపోతే ఏమవుతుందో అనే భయంతో నియమాలను అనుసరించేస్తారు. ఫలితంగా అనారోగ్యం పాలవుతారు.
కార్తీకమాసంలో నిత్యం తలకు చన్నీటి స్నానం చేయకపోతే పాపమా? చేయకపోతే ఏమవుతుంది? దీనివెనుకున్న ఆంతర్యం ఏంటి?
సూర్యోదయం కన్నా ముందు వణికించే చలిలో తలకు చన్నీటిస్నానం చేయమని ఎందుకు చెప్పారంటే... అప్పటివరకూ బయటపడని అనారోగ్య సమస్యలేమైనా ఉంటే ఈ చన్నీటి స్నానాలతో బయటపడతాయి . తాము ఆరోగ్యంగా ఉన్నాం అనుకునేవారికి ఈ నెల రోజులు ఓ పరీక్ష. నిజంగా ఆరోగ్యంగా ఉండే ఈ నెలరోజుల చన్నీటి తలస్నానంతో ఏమీ కాదు..అనారోగ్యం ఏదైనా లోపల ఉంటే అది బయటపడుతుంది. అందుకే అప్పటికే అనారోగ్యంతో ఉండేవారు ఈ పరీక్షలో పాల్గొనాల్సిన అవసరం లేదు. కేవలం సాధారణ స్నానం ఆచరించి భక్తిశ్రద్ధలతో కార్తీకదీపం వెలిగించి.. శ్రీహరిని, శివుడుని పూడిస్తే చాలు.
కార్తీకస్నానం భక్తిలో భాగం మాత్రమే కాదు
సూర్యోదయానికి ముందు చన్నీటిస్నానం ఒంటికి పట్టిన బద్ధకాన్ని వదిలించేస్తుంది. చురుకుగా మారుస్తుంది. మానసిక ప్రశాంతతని ఇస్తుంది.. రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. అంతేకానీ సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించకపోతే పాపం చుట్టుకుంటుందని కాదు.. సోమరిగా తయారవుతారని అలా చెప్పారు. అందుకే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు నిత్యం చన్నీటి తలస్నానాలు చేసి అనారోగ్యాన్ని మరింత పెంచుకోవద్దు.
మరీ అంతలా పట్టింపు ఉంటే.. కార్తీకమాసం మొదటి రోజు, కార్తీకసోమవారాలు, ఏకాదశి ద్వాదశి తిథులు, కార్తీక పౌర్ణమి, కార్తీకమాసం చివరి రోజు తలకు స్నానం ఆచరించి ఇంట్లో...తులసి మొక్క దగ్గర..ఆలయంలో దీపాలు వెలిగించాలని చెబుతారు పండితులు
కార్తీకమాసం నియమాలు పాటించేవారు ఇవి గమనించండి?
కార్తీకమాసం ప్రారంభమైన వారంలో మీరు పాటించిన నియమాల వల్ల ఆరోగ్యంలో ఏమైనా మార్పులు వచ్చాయా గమనించండి. అనారోగ్యం మొదలైనట్టు అనిపిస్తే ఈ నియమాలు అనుసరించకపోతే ఏదో జరిగిపోతోందనే అపోహ నుంచి బయటకు వచ్చి...భక్తిని ప్రదర్శించుకోండి. హిందూధర్మంలో పాటించే నియమాలన్నీ జీవనవిధానాన్ని మెరుగుపర్చుకునేందుకు, పరిశుభ్రత కోసమే...
కార్తీకపురాణంలో ఉన్న కథల ప్రకారం.. మనస్ఫూర్తిగా చేసే నమస్కారం, భక్తితో వెలిగించే దీపం ఈ నెలలో అత్యంత ప్రధానం
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.






















