(Source: Poll of Polls)
Karthika Vanabhojanam 2024: కార్తీక సమారాధన అంటే క్యాటరింగ్ భోజనాలు కాదు..అసలైన వనభోజనాలంటే ఇవి!
Karthika Masam 2024 : కార్తీకమాసంలో వనసమారాధనలు, ఆత్మీయ సమ్మేళనాల సందడి సాగుతుంటుంది. అసలు వనభోజనాలు కార్తీమాసంలోనే ఎందుకు చేస్తారు? సమారాధనలు, వనభోజనాలంటే ఎలా ఉండాలో తెలుసా..
Importance of Karthika Vanabhojanam: కార్తీకమాసం మొదలవగానే వనసమారాధనకు ప్లాన్ చేసుకుంటారు. వీకెండ్ వస్తే చాలు వనాలన్నీ సందడిగా మారిపోతాయి. ఇప్పుడంటే పార్కులు, రిసార్ట్స్ లో సమారాధనలు ఏర్పాటు చేసుకుంటన్నారు కానీ అప్పట్లో తోటల్లో పిక్నిక్స్ సందడి సాగేది. ముఖ్యంగా వనభోజనం అంటే ఉసిరి చెట్టు ఉండాల్సిందే.
వనము అంటే ఎన్నో వృక్షాల సముదాయం, వశించేందుకు వీలైన ప్రదేశం అని అర్థం. రావి, మఱ్ఱి, మారేడు, మద్ది, మోదుగ, జమ్మి, ఉసిరి, నేరేడు, మామిడి, వేప, పనస, తులసి, అరటి, జామ, కొబ్బరి, నిమ్మ..ఇలా వివిధ మొక్కలతో వనాలుండేవి. ఆ మధ్యలో జంతువుల, పక్షుల దప్పిక తీరేందుకు సెలయేరు ఉంటుంది. ఇలాంటి వనాల్లో దేవతలు కొలువై ఉంటారు..అందుకే ఈ వనాల్లో మహర్షులు తపస్సు చేసేవారు. ఇలా దేవతలకూ, మహర్షులకూ ప్రతిరూపాలుగా ప్రశాంతతకు, పవిత్రతకు నిలయమైన ప్రదేశంలో వనభోజనాలు చేయాలంటారు.
కార్తీక పౌర్ణమి రోజు నైమిశారణ్యంలో మునులంతా కలసి సూతమహర్షి ఆధ్వర్యంలో వనభోజనాలు చేసినట్టు కార్తీకపురాణంలో ఉంది. ఈ నెలలో ఉసిరి చెట్టు కింద శ్రీ మహావిష్ణువుని పూజిస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని చెబుతారు. పైగా ఉసిరిచెట్టును క్షమాగుణానికి ప్రతీకగా సూచిస్తారు. లక్ష్మీనారాయణుల స్వరూపం. అందుకే ఉసిరి చెట్టుకింద వన భోజనం చేస్తారు.
శ్రీ కృష్ణుడు అయితే నిత్యం వనభోజనాలు చేశాడని చెప్పుకోవచ్చు. స్నేహితులతో కలసి గోవులను కాసే కన్నయ్య.. వనభోజనానికి వెళదాం అని చెప్పేవాడట. వాస్తవానికి నిత్యం చద్ది తెచ్చుకుని అంతా కలసి చెట్టుకిందే కూర్చుని తినేవారు..కానీ వనభోజనాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించేవాడు శ్రీ కృష్ణుడు...ఎందుకంటే వనభోజనాల విశిష్టత గురించి అందరకీ తెలియజెప్పటమే ఇందులో ఆంతర్యం...
Also Read: కార్తీకమాసం స్పెషల్.. నవనంది క్షేత్రాలు ఎక్కడున్నాయ్ - మొదట దర్శించుకోవాల్సిన నంది ఏది!
ఏడాది మొత్తం మనం తినేది అసాక్షి భోజనమే...
సమయం దాటాక తినడం, అతిథికి పెట్టకుండా తినడం, ఎవరెవరో వండిన వంట తినడం, హోటళ్లు-క్యాటరింగ్ సర్వీసుల ద్వారా వచ్చిన భోజనం తినడం ఇలా మొత్తం 9 రకాలున్నాయి. వీటిలో రెండు మాత్రమే ఆమోదయోగ్యం అని చెబుతారు పండితులు.. వాటిలో ఒకటి ఇంట్లో చేసుకునే వంట, రెండోది గుడిలో తీసుకొచ్చిన ప్రసాదం - ఆలయంలో సంతర్పణలో తినే భోజనం. ఇవి కాకుండా తినే ప్రతి ఆహారమూ అసాక్షి భోజనం కిందకే వస్తుంది.
నడుస్తూ తినడం, మాట్లాడుతూ తినడం, మంచపై కూర్చుని తినడం ఇవి కూడా భోజనం సమయంలో చేయకూడని పనులు.. ఇలా తినే ఆహారంపై కలి పురుషుడి ప్రభావం ఉంటుంది. ఇలాంటి భోజనం తిన్న దోషాలు తొలగిపోవాలంటే శ్రీ మహాలక్ష్మిసమేతంగా శ్రీ మహావిష్ణువు కొలువైన ఉసిరి చెట్టుకింద కూర్చుని భోజనం చేయాలి. ఇలా చేస్తే అసాక్షి భోజనం ద్వారా శరీరంలో చేరే కలిపురుషుడు మాయమైపోతాడని చెబుతారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం..అన్నం ముందు అందరూ సమానమే అని చెప్పడమే సహపంక్తి భోజనం వెనుకున్న ఆంతర్యం.
పచ్చని చెట్లు మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో బంధుమిత్రులంతా కలసి వంట చేసుకుని సహపంక్తి భోజనాలు చేయాలి. ఆ భోజనమే ఆరోగ్యం ఆనందం, మానసిక ఉల్లాసం. కానీ ప్రస్తుతం రోజుల్లో జరుగుతున్న చాలా వనసమారాధనల్లో క్యాటరింగ్ భోజనాలే కనిపిస్తున్నాయ్. బిజీ లైఫ్ లో సమారాధనకు టైమ్ దొరకడమే కష్టం అనుకుంటే ఇక వంటలు చేసుకోవడం అంటే మరీ కష్టంగా భావిస్తున్నారు. అందుకే క్యాటరింగ్ సర్వీసులను వినియోగించుకుంటున్నారు. అంటే వనసమాధనల్లోనూ అసాక్షి భోజనాలే చేస్తున్నారని అర్థం. ఒక్కొక్కరు ఒక్కో వంటని వండి తీసుకొచ్చి అంతా పంచుకుని తిన్నా పర్వాలేదు కానీ క్యాటరింగ్/హోటల్ భోజనాలు తీసుకొచ్చి తింటే వనభోజనం అవదంటున్నారు పండితులు.
అంతా కలసి వంటలు చేసుకుని..సహపంక్తి భోజనాలు చేసి.. ఆ తర్వాత పిల్లలు, పెద్దలు అంతా కలసి ఆటపాటలతో సందడి చేస్తారు. జగమంత కుటుంబం నాది అనే భావనతో పాటూ అందరిలో సృజనాత్మకత బయటపడే సందర్భం కూడా ఇదే.
Also Read: కార్తీక మాసం ఎప్పటితో ఆఖరు .. పోలి స్వర్గం ఎప్పుడు - ఆ పేరెలా వచ్చింది!
కార్తీకమాసంలో చేసే ఈ వనభోజనాల్లో ఆధ్యాత్మిక చింతన మాత్రమే కాదు..ఆరోగ్యం కూడా. భారతీయ ఆయుర్వేదంలో వృక్షాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. అందుకే మంచు కురిసే సమయంలో ఉసిరి చెట్టు కింద శ్రీ మహా విష్ణువును పూజించి ..ఆ వనంలో వండిన ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యం, మానసిక ఉల్లాసం ఉంటుందని కార్తీక పురాణంలో ఉంది. ఆయా వృక్షాల మీదుగా వీచే గాలి..ముఖ్యంగా ఉసిరి చెట్టునుంచి వీచే గాలి ఆరోగ్యానికి ఎంతో మంచిది..అందుకే ఉసిరి చెట్టుకింద వనభోజనం ఆరోగ్యం అంటారు ఆయుర్వేద నిపుణులు.
వనభోజనాలకు వెళ్లేవారు వేకువజామునే స్నానం, దీపం అనంతరం వనానికి చేరుకోవాలి. ఉసిరి చెట్టు, రావి చెట్టు లాంటి దేవతా వృక్షాలను అందంగా అలంకరించాలి. అంతాకలసి వంటలు చేసుకుని సహపంక్తి భోజనాలు చేయాలి. ఇంత ఆనందం మధ్యం కులం, ప్రాంతం, ఆచారం, నియమాలకు తావుండకూడదు. ఒకప్పుడు కార్తీక వనసమారాధన అంటే పెళ్లిళ్లు కుదిర్చే వేదికగా ఉండేది..కార్తీకంలో సంబంధం కుదుర్చుకుని మాఘ, ఫాల్గుణ మాసాల్లో వివాహం నిశ్చయం చేసుకునేవారు.
వనభోజనాల మధుర స్మృతులు ఎప్పటికీ గుర్తుండిపోవాలి... వృక్షాలవల్ల ఎన్ని ఉపయోగాలో చిన్నారులకు చెప్పాలి.. అందరితో కలసి జీవిస్తే ఉండే ఆనందాన్ని భవిష్యత్ తరాలకు చాటిచెప్పాలి. .. వనసమారాధనల ఆంతర్యం ఇదే...
Also Read: కార్తీకమాసం స్పెషల్..తెలంగాణలో ప్రముఖ శైవ క్షేత్రాలు!