Nava Nandulu Full Tour: కార్తీకమాసం స్పెషల్.. నవనంది క్షేత్రాలు ఎక్కడున్నాయ్ - మొదట దర్శించుకోవాల్సిన నంది ఏది!
History Of Nava Nandi temples: కార్తీకమాసంలో శైవ క్షేత్రాలు సందర్శించేందుకు భక్తులు ప్లాన్ చేసుకుంటారు. అయితే ఒకేరోజు 9 శివాలయాలను దర్శించుకునే అవకాశం ఉంది..అవే నవ నంది క్షేత్రాలు

Nandyal Nava Nandulu Full Tour: పరమేశ్వరుడి వాహనం అయిన నంది పేరుమీద తొమ్మిది క్షేత్రాలున్నాయి..వాటినే నవనందులు అంటారు. కార్తీకమాసంలో ఈ నందులను దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. ఈ తొమ్మిది నందులు కర్నూలు జిల్లాలోనే కొలువై ఉండడం విశేషం. వీటలో మహానంది ఒకటైతే దాని చుట్టుపక్కల మిగిలిన 8 నందులు ఉన్నాయి. ఉదయం నుంచి సాయంత్రంలోగా ఈ నవనందులను దర్శించుకోవచ్చు. కాలినడకన కూడా ఈ క్షేత్రాలు దర్శించుకునేవారున్నారు..
ప్రథమ నంది
నందుల్లో మొదటిదైన ప్రథమ నంది చామకాల్వ ఒడ్డున, నంద్యాల రైల్వే స్టేషన్ సమీపంలో ఉంది. ఇక్కడ సూర్యాస్తమయం సమయంలో సూర్యకిరణాలు నందిపై పడడం విశేషం. సాక్షి గణపతి దర్సనం అనంతరం ప్రథమ నందితోనే నవనందుల దర్శనం ప్రారంభిస్తారు.
నాగ నంది
నంద్యాల బస్ స్టాండ్ కు సమీపంలో ఆంజనేయ స్వామి ఆలయంలో కొలువైంది నాగ నంది. నాగులు గరుత్మంతుడి ధాటికి తట్టుకోలేక పరమేశ్వరుడి కోసం ఇక్కడ తపస్సు చేశాయని స్థలపురాణం. మొదట్లో నల్లమల అడవిలో ఉండే ఈ ఆలయంలో విగ్రహాలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో వాటిని తీసుకొచ్చి ఆంజనేయుడి ఆలయంలో ప్రతిష్టించారు.
Also Read: కార్తీక మాసం ఎప్పటితో ఆఖరు .. పోలి స్వర్గం ఎప్పుడు - ఆ పేరెలా వచ్చింది!
సోమ నంది
నంద్యాలలో జగజ్జనని ఆలయానికి సమీపంలో ఉంటుంది సోమనంది. సోముడు అంటే చంద్రుడు. స్వయంగా చంద్రుడు ఇక్కడ తపస్సు చేశాడని స్థలపురాణం.
సూర్య నంది
నంద్యాల నుంచి మహానందికి వెళ్లే మార్గంలో బొల్లవరం అనే గ్రామం నుంచి కుడివైపు తిరిగితే వస్తుంది సూర్య నంది ఆలయం. రోజూ సూర్యకిరణాలు శివలింగంపై పడడం ఇక్కడ విశేషం. గుప్తనిథుల తవ్వకాల్లో ఈ ఆలయం ధ్వంసమైంది...
శివ నంది
నంద్యాల నుంచి మహానందికి వెళ్లే మార్గంలో తిమ్మవరం గ్రామం దాటిన తర్వాత ఎడమవైపు ఉంటుంది శివ నంది. దీనినే రుద్ర నంది అని కూడా అంటారు. మిగిలిన 8 నందుల ఆలయాల కన్నా ఇక్కడ శివలింగం పెద్దగా ఉంటుంది.
విష్ణు నంది
మహానంది రోడ్డు మార్గంలో తెలుగు గంగ కెనాల్ ను ఆనుకుని ఉన్న మట్టి రోడ్డు ద్వారా వెళితే విష్ణు నంది ఆలయం ఉంటుంది. దీనినే కృష్ణ నంది అని కూడా పిలుస్తారు. ఇక్కడ శ్రీ మహావిష్ణువు శివుడిని ఆరాధించాడని స్థలపురాణం.
Also Read: కార్తీకమాసంలో మారేడు దళం సమర్పించి బిల్వాష్టకం పఠిస్తే చాలు శివయ్య దిగివచ్చేస్తాడు!
గరుడ నంది
నంద్యాల నుంచి మహానంది రూట్ లో ఉంటుంది గరుడ నంది. గరుత్మంతుని తల్లి వినతాదేవి తను చేపట్టిన పనిలో ఆటంకాలు కలగకూడదంటూ శివుడిని పూజించిన ప్రదేశం ఇదని స్థల పురాణం.
మహానంది
మహానందిలో ఉండేది స్వయంభూలింగం. ఇక్కడ పవిత్రమైన కొలనులో నీరు 5 అడుగుల మేర లోతు ఉంటుంది. ఈ నీరు వేసవిలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉంటుంది. ఇక్కడ భోళా శంకరుడు గోవుపాద రూపంలో వెలిశాడని..అందుకే మహానందీశ్వరున్ని గోపాదలింగేశ్వరుడుగా పూజిస్తారు.
వినాయక నంది
మహానంది ఆలయానికి వాయువ్య దిక్కున ఉంటుంది వినాయక నంది ఆలయం. వినాయకుడు స్వయంగా ఇక్కడ తపస్సు చేసి శివుడిని ప్రతిష్టించాడని అందుకే వినాయక నందీశ్వర ఆలయంగా పిలుస్తారని స్థలపురాణం.
నంద్యాలలో బస చేస్తే ఈ ఆలయాన్నీ ఒకే రోజు దర్శించుకోవచ్చు.
Also Read: మీరు దర్శించుకుంటున్నది ఎలాంటి శివలింగం - ఎన్ని రకాలున్నాయో తెలుసా!






















