Lord Shiva: కార్తీకమాసంలో మారేడు దళం సమర్పించి బిల్వాష్టకం పఠిస్తే చాలు శివయ్య దిగివచ్చేస్తాడు!
Bilva Dalam: పరమేశ్వరుడి పూజలో భాగంగా 'ఏకబిల్వం శివార్పణం' అని చెబుతూ మారేడు దాళం సమర్పిస్తారు. శివపూజలో బిల్వదళానికి ఎందుకంత ప్రాముఖ్యతో తెలుసా..
Importance Of Bilva Dalam: త్రిశూలానికి సంకేతంలా కనిపించే మారేడు దళాలు లేనిదే శివపూజ పూర్తికాదు.. అభిషేక ప్రియుడైన శివయ్యకి నీళ్లు సమర్పించి అనంతరం మారేడు దళాలు సమర్పిస్తే చాలు కరిగిపోతాడు. అసలు భోళా శంకరుడికి మారేడు దళాలంటే ఎందుకంత ప్రీతి.
బిల్వానాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం!
అఘోర పాపసమ్హారం ఏకబిల్వం శివార్పణం!
బిల్వపత్రాన్ని దర్శిస్తే పుణ్యం కలుగుతుంది. మారేడు పత్రాన్ని స్పృశిస్తే చాలు సకల పాపాలు హరించుకుపోతాయి. ముక్కంటిపై భక్తితో బిల్వ దళం అర్పిస్తే చాలు అంతులేని పుణ్యం లభిస్తుంది. అందుకే శివపూజలో మారేడు దళానికి అంత ప్రాధాన్యత...
Also Read: కార్తీక పౌర్ణమి పూజా ముహూర్తం.. సులువుగా పూజ చేసుకునే విధానం!
బిల్వ దళం అంటే శివుడికి ఎందుకంత ప్రీతి అంటే..ఈ వృక్షాన్ని స్వయంగా ఆయన సృష్టించినదే. దీనివెనుక ఓ పురాణ కథ కూడా చెబుతారు పండితులు.
శివుడి అనుగ్రహం కోసం శ్రీ మహాలక్ష్మి సప్తర్షులతో ఏకాదశ రుద్ర యాగం తలపెట్టింది. యాగం నిర్విఘ్నంగా పూర్తైంది..ఇంతలో హోమగుండం నుంచి ఓ వికృతమైన శక్తి రూపం బయటకు వచ్చి ఆకలి అని కేకలు వేసింది. అప్పుడు శ్రీ మహాలక్ష్మి ఖడ్గంతో తన వామభాగపుస్తనాన్ని ఖండించి ఆమె ఆకలి తీర్చాలి అనుకుంది. అప్పుడు ప్రత్యక్షమైన శంకరుడు లక్ష్మీదేవిని వారించి... వక్షస్థలాన్ని కోసిచ్చేందుకు సిద్ధమైన నువ్వు 'విష్ణు వక్షఃస్థల స్థితాయ నమః' అని పూజలందుకుంటావ్ అని చెప్పి... లక్ష్మీదేవి నివేదిత స్థలం నుంచి ఓ వృక్షాన్ని సృష్టించాడు. అదే బిల్వవృక్షం..ఈ దళాలతో తనను పూజించేవారికి అనుగ్రహం సిద్ధిస్తుందని చెప్పాడు శంకరుడు. అలా శివయ్య సేవకోసమే భూలోకంలో పుట్టింది బిల్వవృక్షం...అందుకే శివారాధనలో అంత ప్రత్యేకం..
Also Read: కార్తీక పౌర్ణమి రోజు ఇంట్లో ఏ మూల చీకటిగా ఉండకూడదు - ఇంకా ఈ నియమాలు పాటించండి!
శివుడు సృష్టించిన వృక్షం కావడం వల్లనో ఏమో.. మారేడు దళాలు త్రిశూలానికి సంకేతంగా మూడు మూడు ఆకులుగా కనిపిస్తుంది. ఓ దళం అంటే మూడు ఆకులు.. ఈ దళాలతో పూజిస్తే పరమేశ్వర అనుగ్రహం తక్షణం లభిస్తుందని భక్తుల విశ్వాసం. మారేడు చెట్టు దగ్గర దీపం వెలిగించే వారికి తత్వజ్ఞానం సిద్ధిస్తుంది. మరణం తర్వాత శివ సాయుజ్యం తప్పక పొందుతారు. అప్పుడే చిగురిస్తున్న మారేడు కొమ్మల్ని స్పృశించి ఆ చెట్టుని పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయి.
ఓసారి కోసిన మారేడు దళాన్ని రెండు వారాల పాటూ పూజకు ఉపయోగించవ్చు. బిల్వదళం వాడినా పర్వాలేదు కానీ మూడు ఆకులు మాత్రం తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ఈ మూడు రేకులు త్రిమూర్తులు అని కూడా చెబుతారు.
ఓ బిల్వ వృక్షమే ఇంత పవర్ ఫుల్ అయితే..ఏకంగా వనం ఉన్న ప్రదేశం కాశీ క్షేత్రంలో సమానం అని చెబుతారు. ఈ చెట్టుకింద శివుడు నివాసం ఉంటాడు..ఇంటి ఆవరణలో ఈశాన్యంవైపు బిల్వవృక్షం ఉంటే అపమృత్యదోషం ఉండదంటారు వాస్తు పండితులు. ఈ వృక్షం తూర్పున ఉంటే సుఖం, పడమరవైపు ఉంటే మంచి సంతానం, దక్షిణం వైపు ఉంటే యమబాధలుండవు...అంటే మారేడు చెట్టు ఏ దిక్కున ఉన్నా మంచిదే అని అర్థం.
బిల్వాష్టకం
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం
త్రిజన్మపాపసంహారం ఏకబిల్వం శివార్పణం
త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః
శివపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం
అఖండ బిల్వ పత్రేణ పూజితే నందికేశ్వరే
శుద్ధ్యంతి సర్వపాపేభ్యో ఏకబిల్వం శివార్పణం
సాలిగ్రామ శిలామేకాం విప్రాణాం జాతు చార్పయేత్
సోమయజ్ఞ మహాపుణ్యం ఏకబిల్వం శివార్పణం
దంతికోటి సహస్రాణి వాజపేయ శతాని చ
కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం
లక్ష్మ్యాస్తనత ఉత్పన్నం మహాదేవస్య చ ప్రియం
బిల్వవృక్షం ప్రయచ్ఛామి ఏకబిల్వం శివార్పణం
దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం
అఘోరపాపసంహారం ఏకబిల్వం శివార్పణం
కాశీక్షేత్రనివాసం చ కాలభైరవదర్శనం
ప్రయాగేమాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం
మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే
అగ్రతః శివరూపాయ ఏకబిల్వం శివార్పణం
ఫలశృతి
బిల్వాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ
సర్వపాప వినిర్ముక్తః శివలోకమవాప్నుయాత్
Also Read: కార్తీక పౌర్ణమి సందర్భంగా మీ బంధుమిత్రులకు ఇలా శుభాకాంక్షలు తెలియజేయండి