Karthika masam 2022: క్షీరాబ్ది ద్వాదశి కథ: ఇది విన్నా, చదివినా చాలు సకల పాపాలు తొలిగిపోతాయ్!
కార్తీక శుద్ద ద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అంటాం. ఈ ద్వాదశి విశిష్టతను తెలిపే కథ భాగవతంలోనూ కార్తీక పురాణంలోనూ ప్రస్తావించబడింది. దాన్ని విన్నా, లేక చదివినా సమస్త పాపాలు తొలిగిపోతాయి.
కార్తీకమాసం పరమపవిత్రమైనది. అందులోనూ కార్తీక శుద్ద ఏకాదశి మొదలుకుని పౌర్ణమి వరకు ఉన్న ఐదు రోజులను ఇంకా పవిత్రమైనవిగా భావిస్తారు. కార్తీక శుద్ద ఏకాదశి రోజున విష్ణుమూర్తి నిద్ర నుంచి మేలుకుంటాడు. అందుకే దాన్ని ఉత్థాన ఏకాదశి అని పిలుస్తాం. ఇక తెల్లవారి అంటే కార్తీక శుద్ద ద్వాదశి తిథిని ఉత్థాన ద్వాదశి లేదా చిలుకు ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి అని రకరకాల పేర్లతో పిలుస్తాం.
ముందు రోజున యోగనిద్ర నుంచి మేలుకొన్న శ్రీమహా విష్ణువు ఈరోజున లక్ష్మీదేవితో కలిసి భూలోకానికి వస్తాడట. అందుకే ఈరోజున చాలామంది తులసీదేవికి, ఉసిరిక చెట్టుకు కలిపి పూజలు నిర్వహిస్తారు. తులసీ కళ్యాణం చేస్తారు. భాగవతంలోని అంబరీషుడి కథ ఈరోజు గురించిన విశిష్టతను తెలియజేస్తుంది. అలాగే కార్తీక పురాణంలోనూ ఈ కథ గురించిన ప్రస్తావన ఉంది.
ప్రహ్లాదుడిలాగానే అంబరీషుడు మహా విష్ణు భక్తుడు. ఇతను ఇక్ష్వాకు వంశరాజు. నభగ మహారాజు కుమారుడు. ఎల్లప్పుడూ హరియందే మనసును లగ్నం చేసేవాడు. ఆ భక్తుడు ఒకసారి ద్వాదశి వ్రతాన్ని చేశాడు. ద్వాదశి వ్రతం అంటే ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశి తిథి వచ్చాక బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాను భుజించాలి. ఇలా సంవత్సరం పాటు నిర్వహించాలి. ఒకసారి ద్వాదశి వ్రతాన్ని ఆచరిస్తున్న అంబరీషుడికి, ద్వాదశి రోజున భుజించే సమయానికి దూర్వాస మహర్షి అక్కడకు వస్తాడు. మహర్షులను విడిచిపెట్టి తాను భుజించడం తగదని తెలిసి అంబరీషుడు మహర్షిని భోజనానికి ఆహ్వానిస్తాడు. అప్పుడు దూర్వాస మహర్షి సంతోషంగా అంగీకరించి తాను నదిలో స్నానం చేసి వచ్చేవరకు వేచి ఉండమని చెప్పి నదివైపు వెళ్లాడు.
అదే సమయానికి ద్వాదశి ఘడియలు అయిపోవస్తుంటాయి. స్నానానికని వెళ్లిన దుర్వాసమహర్షి ఇంకా రాడు. మహర్షిని విడిచి భోజనం చేస్తే ఆయన ఆగ్రహానికి గురికాక తప్పదు. అందునా దుర్వాసుడికి చాలా కోపం. అలా అని పారణ అంటే ఉపవాసం విడిచిపెట్టకుండా ఉంటే వ్రతదోషం అవుతుంది. దాంతో అంబరీషుడు తన కులగురువైన వశిష్టుడి సలహామేరకు ఆ శుభముహూర్తంలో కేవలం తులసీ నీళ్లు తాగి దీక్ష విరిమిస్తాడు. ఇది శాస్త్రప్రకారం సమ్మతమే. కానీ స్నానం చేసి వచ్చిన దుర్వాసుడు తన దివ్య దృష్టి ద్వారా జరిగిన విషయాన్ని తెలుసుకుని ఆగ్రహానికి లోనవుతాడు. అతన్ని పదిరకాల జన్మలనెత్తమని శపిస్తాడు. అంతేకాదు అప్పటికప్పుడే ఒక రాక్షసుడిని సృష్టించి అంబరీషుడిని సంహరించమంటాడు. ఆ రాక్షసుడు అత్యంత భయానకంగా మారి అంబరీషుడి ఎదుట నిలవగానే ఆయన భయంతో శ్రీహరిని ప్రార్థిస్తాడు. దాంతో ఆయకు రక్షణగా సుదర్శన చక్రం ఉద్భవించి ఆ రాక్షసుడిని సంహరించి, దురస్వాసుడి వెంటపడుతుంది.
దుర్వాసుడు సుదర్శన చక్రం బారి నుంచి కాపాడమని వేడుకుంటూ బ్రహ్మాదిలోకాలన్నింటికీ వెళ్తాడు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆ చక్రం వెంబడిస్తూనే ఉంటుంది. చివరికి మహా విష్ణువుని కూడా శరణువేడతాడు. కానీ ఆయన కూడా తాను అంబరీషుని భక్తికి బందీ కాబట్టి నేనేమీ చేయలేనని అంబరీషుడినే శరణువేడుకోమనీ చెప్తాడు. చివరికి దుర్వాసుడు వెళ్లి అంబరీషుడిని శరణు వేడుతాడు. దాంతో ఆయన సుదర్శన చక్రాన్ని ఉపసంహరించమని, ఆ దివ్య చక్రాన్ని స్తుతిస్తూ వేడుకుంటాడు. ఇలా దుర్వాసుడిని రక్షిస్తాడు అంబరీషుడు. అలాగే దుర్వాసుడు ఇచ్చిన శాపాన్ని, అవసరం వచ్చినప్పుడు పది అవతారాలుగా లోకరక్షణకోసం తాను అనుభవిస్తానని శ్రీమహావిష్ణువు. దీనివల్ల భక్తులకు పరమాత్మ ఎప్పుడూ బంధీనే అనే అంశం మనకు స్పష్టమవుతుంది. ఇలా ఎవరైతే ఈ ద్వాదశి రోజున ఈ కథను విన్నా, లేక చదివినా అనేక పాపాలు నశించి, పుణ్యఫలం కలుగుతుందని కార్తీక పురాణంలో ఉంది.