Krishna Temples in Hyderabad Timings Location: హైదరాబాద్‌లో ప్రసిద్ధ కృష్ణ దేవాలయాలు! లొకేషన్స్ & టైమింగ్స్!
Janmashtami 2025: శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా సమీపంలో వైష్ణవ ఆలయాలను సందర్శిస్తుంటారు. అయితే హైదరాబాద్ వాసులు దర్శించుకునేందుకు మీకు సమీపంలో ఉన్న కృష్ణుడి ఆలయాలు, సందర్శనా సమాయాలేంటో తెలుసా?

Popular Krishna Temples in Hyderabad: శ్రీమహా విష్ణువు దశావతారాల్లో 8వ అవతారం శ్రీ కృష్ణుడు. ఆగష్టు 16 శనివారం దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. హిందువులతో పాటూ విదేశీయులు కూడా జన్మాష్టమి వేడుకల్లో భాగమవుతారు. కృష్ణుడు జన్మించిన రోజుని కృష్ణాష్టమి, గోకులాష్టమి అని పిలుస్తారు. శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా భాగ్యనగరవాసులు ఈ ఆలయాలను సందర్శించుకోవచ్చు..
ఇస్కాన్ టెంపుల్
ఇస్కాన్ ఆలయాలు దేశవ్యాప్తంగా అంత్యంత అందమైన ఆధ్యాత్మిక, మతపరమైన కేంద్రాలు. హైదరాబాద్ లో ఉన్న ఇస్కాన్ దేవాలయం కూడా ఇందులో ఒకటి. అబిడ్స్ లో ఉన్న ఈ ఇస్కాన్ టెంపుల్ ని శ్రీ రాధా మదన మోహన ఆలయం అని పిలుస్తారు. ఇక్కడ శ్రీ గౌర-నితై, శ్రీ జగన్నాథ బలదేవ-సుభద్ర, శ్రీ రాధా మదన-మోహనుల విగ్రహాలు కొలువుతీరి ఉంటాయి. హైదరాబాద్ లో అత్యంత ప్రసిద్ధ చెందిన ఆలయాల్లో ఇస్కాన్ టెంపుల్ ఒకటి. కృష్ణాష్టమి సందర్భంగా ఆగస్టు 16 వ తేదీన మహాభిషేకాలు, మహా ప్రసాద వితరణ, హారతులు మరింత ప్రత్యేకంగా ఉంటాయి. ఈ రోజు దర్శించుకుంటే కన్నుల పండువగా ఉంటుంది.

ఇస్కాన్ టెంపుల్ సందర్శనా సమయాలు: రోజూ ఉదయం 4.30 నుంచి మధ్యాహ్నం 12.30 మళ్లీ సాయంత్రం 4.30 నుంచి రాత్రి 8.30 వరకు. దర్శనానికి ప్రవేశ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం
హైదారబాద్‌లో ప్రసిద్ధిచెందిన శ్రీకృష్ణుని ఆలయాల్లో మరొకటి శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం. ఇది కూకట్ పల్లి హౌజింగ్ బోర్డు కాలనీ గోవర్దన గిరి మీద ఉంది. ప్రకృతి మధ్యలో శ్రీ కృష్ణుడు రుక్మిణీ దేవి, సత్యభామ సమేతంగా భక్తులకు దర్శనమిస్తాడు. ఇక్కడ గోదాదేవిని కూడా దర్శించుకోవచ్చు. ప్రధాన ఆలయం పెద్దదేం కాదు కానీ ప్రశాంతమైన వాతావరణం ఆహ్లాదభరితంగా ఉంటుంది. సూర్యోదయం, సూర్యాస్తమయం ఇక్కడ మరింత అందంగా కనిపిస్తుంది. ఆలయం పక్కనే గోశాల కూడా ఉంటుంది.

శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం సమయాలు: ఉదయం 6 గంటల నుంచి 11.30 వరకు..తిరిగి 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులకు అనుమతి ఉంటుంది. శనివారం ఆదివారాల్లో రాత్రి 9 గంటల వరకూ భక్తులను అనుమతిస్తారు

శ్రీ జగన్నాథ స్వామి టెంపుల్
హైదరాబాద్‌లో ప్రసిద్ధిచెందిన శ్రీ కృష్ణుని ఆలయాల్లో మరొకటి జగన్నాథ స్వామి టెంపుల్. బంజారా హిల్స్‌లో ఉన్న ఈ ఆలయం పూరీ ఆలయానికి ప్రతిరూపంలా ఉంటుంది. గర్భగుడిలో జగన్నాథుడు సోదరుడు బలభద్రుడు,సోదరి సుభద్రతో కొలువై ఉంచాడు. ఈ ప్రాంగణంలో గణపతి ఆలయం, శివాలయం, లక్ష్మీదేవి ఆలయం, విమలా దేవి ఆలయం, ఆంజనేయుడు, నవగ్రహాలను కూడా దర్శించుకోవచ్చు. ఆలయంలో గోడలపై భాగవత చిత్రాలు, దశావతార చిత్రాలు ఆకట్టుకుంటాయి. 3000 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఆలయం కోసం ఒడిశా నుంచి సుమారు 600 టన్నుల ఇటుక రాయిని తెప్పించారు.

శ్రీ జగన్నాథ స్వామి టెంపుల్ సమయాలు: రోజూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటలవరకూ భక్తులకు అనుమతి ఉంటుంది.ఎలాంటి ప్రవేశ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్
హైదరాబాద్ లో ప్రసిద్ధిచెందిన మరో కన్నయ్య ఆలయం హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్. ఇది బంజారా హిల్స్ రోడ్ నం. 12 లో 2018లో నిర్మించారు. ఈ ఆలయ సందర్శన సాయంత్రం సమయంలో బావుంటుంది. రాధ గోవింద, లక్ష్మీ నారసింహ స్వామిని కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు. కృష్ణాష్టమి సందర్భంగా భక్తులతో కళకళలాడిపోతుంది ఈ ఆలయం.

హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ సందర్శన సమయాలు: ఉదయం 7:15 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు , సాయంత్రం 5:15 నుంచి రాత్రి 8:45 వరకు భక్తులను అనుమతిస్తారు.























