Janmashtami 2025: అల్లరి కృష్ణయ్య 5 అద్భుత ఆలయాలు! ఈ క్షేత్రాల్లో కృష్ణాష్టమి వేడుకలు చూసి తీరాల్సిందే
Top 5 Krishna Temples In India: మహారాష్ట్రలో విఠోబా అంటారు, రాజస్థాన్‌లో శ్రీనాథ్‌జీగా కొలుస్తారు, ఉడిపిలో కృష్ణుడు, గురువాయూరులో గురువాయురప్ప ప్రతి క్షేత్రం ప్రత్యేకమే..

Janmashtami 2025: శ్రావణమాసం బహుళపక్షం అష్టమి తిథి అర్థరాత్రి సమయంలో రోహణి నక్షత్రంలో జన్మించాడు శ్రీ కృష్ణుడు. ఈ రోజు జరుపుకునే కృష్ణాష్టమి వేడుకలు మధుర,బృందావనంలో అంబరాన్నంటుతాయి. ఈ రెండు ప్రదేశాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కన్నయ్యకు అద్భుతమైన ఆలయాలున్నాయి. ప్రతి ఆలయానికీ చారిత్రక ప్రాముఖ్యత ఉంది. వీటిలో ఎన్ని దేవాలయాలు మీరు దర్శించుకున్నారు?
ఉడిపి - కర్ణాటక
ఉడిపి శ్రీకృష్ణుడి అత్యంత పవిత్రమైన క్షేత్రాల్లో ఒకటి. 13వ శతాబ్దంలో మధ్వాచార్యులు ఇక్కడ కృష్ణుడిని ప్రతిష్టించారు. ఇక్కడున్న స్వామివారి మూర్తి అత్యంత విశిష్టమైనది. దీనివెనుక ఓ కథనం ప్రచారంలో ఉంది. ఓసారి సముద్రం ఒడ్డుకి వెళ్లారు మధ్వాచార్యులవారు. ఆ సమయంలో సముద్రం మధ్యలో నీట మునుగుతున్న ఓ పడవను ఒడ్డుకి చేర్చారు. అందుకు ప్రతిగా ఏం కావాలని అడిగారు పడవలో ఉన్నవారు. అందులో ఉన్న శ్రీ కృష్ణుడి విగ్రహాన్ని అడిగి తీసుకున్నారు మధ్వాచార్యులు. పడవలో ఉండే సంపదను కాకుండా ఓ విగ్రహాన్ని అడిగి తీసుకున్నారేంటని ఆశ్చర్యపోయారు అక్కడున్నవారంతా. అయితే ఆ విగ్రహం ప్రత్యేకత ఏంటంటే.. నీ చిన్నతనాన్ని నేను ఆస్వాదించలేదన్న దేవకి కోరిక మేరకు మళ్లీ కృష్ణుడు చిన్న పిల్లాడిలా మారి అల్లరి చేయడం ప్రారంభించాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న రుక్మిణీదేవి దేవశిల్పి విశ్వకర్మను పిలిచి కృష్ణుడి రూపాన్ని చెక్కించింది. ఆ విగ్రహమే ప్రస్తుతం మీరు ఉడిపిలో దర్శించుకుంటున్న కృష్ణుడి రూపం. ద్వారక నీట మునిగిన తర్వాత సముద్రం ద్వారా అలా ఉడిపికి చేరుకుంది. ఓ భక్తుడిని దర్శనానికి అనుమతించకపోవడంతో కిటికీలోంచి స్వామిని దర్శించుకున్నాడు. అప్పటి నుంచి భక్తులంతా కనకదాసుడు అనే భక్తుడిలా కిటికీ నుంచే దర్శించుకోవడం ప్రారంభమైంది. ఏటా కృష్ణాష్టమి రోజు ‘విట్టల్ పిండి’ పేరుతో మట్టివిగ్రహాన్ని రూపొందించి ఊరేగించిన తర్వాత ఆలయంలో ఉన్న సరోవరంలో నిమజ్జనం చేస్తారు.
గురువాయూర్ - కేరళ
సౌత్ లో శ్రీ కృష్ణుడి ఆలయాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం కేరళ. అన్నిటికన్నా ప్రసిద్ధమైన ఆలయం గురువాయూర్...ఈక్షేత్రాన్ని దక్షిణ ద్వారక అంటారు. దేవగురు బృహస్పతి, వాయుదేవుడి సహాయంతో ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్టించాడని స్థలపురాణం. అందుకే దీనిని భూలోక వైకుంఠంగా అభివర్ణిస్తారు.ఇక్కడ కన్నయ్య 4 చేతులతో దర్శనమిస్తాడు. జన్మాష్టమి, కుచేల,డోలాపూర్ణిమ, విషు ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. చిన్నారులు ఇక్కడ అన్నప్రాసన చేస్తే అనారోగ్య సమస్యలు దరిచేరవని భక్తుల నమ్మకం.
పార్థసారథి - తమిళనాడు
చెన్నైలో ఉన్న పార్థసారథి ఆలయంలో విష్ణువుకు సంబంధించిన 4 అవతారాలు రాముడు, కృష్ణుడు, నారసింహుడు, వరాహాస్వామిని ప్రత్యేకంగా పూజిస్తారు. 108 వైష్ణవ దివ్య క్షేత్రాలలో ఒకటి పార్థసారథి ఆలయం
బృందావనం - ఉత్తర ప్రదేశ్
శ్రీ కృష్ణ జన్మభూమి అయిన మధురలో కృష్ణాష్టమి సంబరాలు అంబరాన్నంటుతాయి. 50 అడుగుల ఎత్తైన ద్వాదశాదిత్య శిలపై కొలువైన శ్రీ రాధా మదన్ మోహన్ మందిరాన్ని బృందావనంలో నిర్మించిన మొదటి ఆలయం అంటారు. ఆలయ గర్భగుడిలో రాథాకృష్ణులు, బలరాములతో పాటూ పాలరాతి కృష్ణుడి విగ్రహం ఉంటుంది. కృష్ణుడు జన్మించింది ఈ జైల్లోనే అని చెబుతారు. బృందావనం సమీపంలో గోవర్ధన పర్వతం ఉంటుంది. ఇంకా రాధా కుండ్/ శ్యామ్ కుండ్ ఇవన్నీ గోపికలు కృష్ణుడికోసం ఎదురుచూసిన ప్రదేశాలివి.
ద్వారక -గుజరాత్
కృష్ణుడు పరిపాలించిన ద్వారక అత్యంత మహిమాన్విత ప్రదేశం. వేల ఏళ్ల క్రితం నిర్మించిన ద్వారకాధీశుడి ఆలయం ప్రధాన విగ్రహం నల్ల పాలరాతితో చెక్కి ఉంటుంది. శ్రీ మహాలక్షి బహుమతిగా ఇచ్చిన దండతో ఈ విగ్రహాన్ని అలంకరించారు. చాళుక్య శైలిలో నిర్మించిన ఈ ఆళయంలో జన్మాష్టమి వేడుకలు చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. ఈ సమీపంలో దర్శించుకునేందుకు చాలా ప్రదేశాలున్నాయి.
పూరీ- ఒడిశా
బలరాముడు, సుభద్రతో కలసి జగన్నాథుడు కొలువైన క్షేత్రం పూరీ. ఈ క్షేత్రంలో అడుగడుగునా మిస్టరీలే. ఏటా ఆషాఢ మాసం ప్రారంభంలో జరిగే రథయాత్ర అత్యంత ప్రత్యేకం.
ఇవిమాత్రమే కాదు..ఇంకా జైపూర్, రాజస్థాన్ సహా దేశవ్యాప్తంగా కృష్ణ భగవానుడికి ఎన్నో ఆలయాలున్నాయి






















