Shani Shingnapur Temple: ఈ ఊరిలోని శనీశ్వరుడి ఆలయానికి పైకప్పు ఉండదు - ఇక్కడి ఇళ్లకు తలుపులు కూడా ఉండవ్
మహారాష్ట్రలోని ఆహ్మద్ నగర్ జిల్లాలో ఉన్న శింగనాపూర్ గ్రామం గురించి మీకు తెలుసా? శనిశింగనాపూర్ అంటే ఇంకా బాగా అర్థం అవుతుంది. ఈ ఊరు, ఊరిలోని శనిశ్వరుడి ఆలయ విశేషాలు తెలుసుకుందాం.
షిరిడికి 65 కిలోమీటర్ల దూరంలో ఆహ్మద్ నగర్ జిల్లాలో శింగనా పూర్ ఒక చిన్న గ్రామం. ఇక్కడ శనిశ్చరుని ఆలయం చాలా ప్రాచూర్యం పొందింది. అది కాకుండా ఈ ఊరిలోని ఏ ఇంటికీ కూడా ప్రధాన ద్వారానికి తలుపులు ఉండవు. ఇళ్లకే కాదు షాపులకు కూడా తలుపులు, గొళ్లాలు ఉండవు. అయినా సరే.. ఇక్కడ ఎప్పుడు దొంగతనాలు జరగలేదు. అలాగే ఇక్కడి ఆలయాలకు కూడా తలుపులు ఉండవు. అక్కడి శనిశ్వరుడి ఆలయానికైతే ఏకంగా పైకప్పే ఉండదు. మరి ఆ ఆలయ విసేషాలు ఏమిటో చూసేద్దామా.
స్వయంభూ శని ఆలయం
స్వయంభూవు అంటే ఎవరూ నిలిపిన దేవుడు కాదు. స్వామి తనంతట తానుగా వెలసిన దేవుడని అర్థం. ఇక్కడ శనీశ్వరుడు నల్లనిరాయి రూపంలో వెలిశాడని నమ్మకం. అయినా ఈ స్వామిని కొంతమంది గొర్రెల కాపరులు కలియుగారంభంలో కనుగొన్నారని ఒక కథ ఉంది.
అనంతాకాశమే పైకప్పు
గొర్రెల కాపరులు ఈ శనీశ్వరుని కనుగొన్న రోజు రాత్రి ఒక గొర్రెల కాపరి కలలో శనీశ్వరుడు కనిపించి తనను ఎలా సంతుష్టుడిని చెయ్యాలో, ఎలా ఆరాధించాలో విధివిధానాలను వివరించడాడని చెబుతారు. కొన్ని ప్రత్యేక నియమాలను, విధులను శనీశ్వరుడు స్వయంగా ఆ గొర్రెల కాపరికి వివరించాడట. అప్పుడు ఆ కాపరి ’మరి ఆలయ నిర్మాణం చేపట్టాలా‘ అని శనీశ్వరుని అడిగినపుడు ఆలయానికి పైకప్పు అవసరం లేదని ఆయన చెప్పాడట. ఈ అనంత నీలాకాశమే తనకు పైకప్పు అని చెప్పినట్టు స్థల పురాణం. అందుకే ఇక్కడి మూలవిరాట్టు తలమీద పై కప్పు లేకుండా ఆవరణలో ఉంటుంది.
ఇళ్లకూ తలుపుతాళాలు అవసరం లేదు
ఈ ఆలయానికి కిలోమీటరు పరిధిలో ఉన్న ఏ వ్యాపారస్థలానికైనా, ఇంటికైనా సరే ప్రధాన ద్వారానికి తలుపులు గడియలు ఉండవు. ఎందుకంటే శనీశ్వరుని మీద భయభక్తులతో ఇక్కడి నుంచి ఏ వస్తువు తీసుకునేందుకు కూడా ఎవరూ సాహసించరు. అందువల్ల వారికి ఎలాంటి రక్షణ చర్యలు అవసరం లేదట.
మహిళలు రాకూడదు
శనిశింగనాపూర్ ఆలయంలోకి మహిళకు ఇదివరకు అనుమతి ఉండేది కాదు. కేవలం పురుషులు మాత్రమే ఈ ఆలయంలో పూజాధికాలు చేసేందుకు అర్హులు. అయితే 2016 జనవరి 26 న తిరుపతి దేశాయ్ అనే సంఘసేవకురాలు 500 మంది మహిళలతో కలిసి ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించినపుడు పోలీసులు అడ్డుకున్నారు. తర్వాత 2016 మార్చి 30 న మహారాష్ట్ర ప్రభుత్వానికి బాంబే హైకోర్టు ఆలయంలో కి మహిళలకు కూడా అవకాశం కల్పించాలని ఆదేశించింది. అప్పటినుంచి మహిళలు కూడా శనీశ్వరుని దర్శించుకుని ఆరాధించుకునే అవకాశం ఏర్పడింది.
Also Read : Feng shui tortoise: ఈ తాబేలు బొమ్మను ఇంట్లో పెట్టకుంటే అదృష్టం కలిసి వస్తుందా? ఏ దిక్కున పెట్టాలి?
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు.. ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.