(Source: ECI/ABP News/ABP Majha)
Ujjaini Mahankali Bonalu: నిండు మనసుతో బోనం సమర్పిస్తే మెండు మనసుతో అనుగ్రహించే మహంకాళి!
సికింద్రాబాద్‌లోని ప్రసిద్ధ శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం ఆషాడ బోనాల సందడితో వెలిగిపోతోంది. జూలై 9న మహంకాళికి భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. జూలై 10న రంగం కార్యక్రమం జరగనుంది.
Ujjaini Mahankali Bonalu: భాగ్యనగరంతో పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో ఆషాడ బోనాలు వైభవంగా సాగుతున్నాయి. ఆషాడమాసంలో మొదటి ఆదివారం గోల్కొండ జగదాంబిక ఆలయంలో ప్రారంభమైన బోనాలు, రెండవ ఆదివారం బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ఘనంగా జరిగాయి. మూడో ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో, నాలుగవ ఆదివారం పాతబస్తీ లాల్ దర్వా మహంకాళి అమ్మవారి సన్నిధిలో సంబరాలతో బోనాలు ముగుస్తాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ప్రభుత్వం దీనికి ‘రాష్ట్ర ఉత్సవం’ హోదా కల్పించి నిర్వహిస్తోంది.
Also Read: పోచమ్మ, ఎల్లమ్మ, మాంకాళమ్మ, పెద్దమ్మ వీళ్లంతా పార్వతీదేవి సంతానమే - మరి పోతురాజు ఎవరు!
ప్రకృతిమాతకు జరిపే పూజ
ప్రకృతిని శక్తిస్వరూపిణిగా, జగన్మాతగా కొలవడం భారతీయ సంప్రదాయం. ప్రకృతిశక్తుల విభిన్న కళలే గ్రామదేవతలని దేవీ భాగవతంలో ఉంది. ప్రకృతి తల్లిలాంటిది. ఆ తల్లి ఒడిలో సేదతీరాలంటే ఆమెను పూజించాలి. అంటే ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవాలి. మానవ మనుగడకు అదే శ్రీరామరక్ష. అందుకు భిన్నంగా వ్యహరించినప్పుడు, ప్రకృతి ప్రకోపిస్తే విపత్కర పరిణామాలు ఎదురుకాక తప్పదు. వాటిని అధిగమించేందుకు మారుతున్న రుతువులు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వివిధ రూపాలు, పేర్లతో కొలువైన గ్రామదేవతలను వేడుకుంటూ జరుపుకునే పండుగే బోనాలు. ఏటా ఆషాడ మాస తొలి ఆదివారం బోనాల జాతర మొదలై ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క ప్రాంతంలో జరుగుతుంది. ప్రధాన ఆలయాలతో పాటు వాడవాడలా కొలువై ఉన్న గ్రామదేవతలను కాళీమాత రూపాలుగా పూజిస్తూ బోనాలు సమర్పించుకుంటారు. ఆషాడంలో ఆడబిడ్డ ఇంటికి వచ్చిన భావించి పసుపు కుంకుమలు, చీరసారెలు, భోజన నైవేద్యాలతో మొక్కులు చెల్లించుకుంటారు. ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, ముత్యాలమ్మ… ఇలా శక్తి స్వరూపమైన అమ్మవార్ల వద్ద తమను చల్లగా చూడమని వేడుకుంటారు.
Also Read: గ్రామానికి, కుటుంబానికి ఆపద రాకూడదంటూ సమర్పించే బోనం, ఈ సంప్రదాయం ఇప్పటిది కాదు!
జూలై 10న రంగం/భవిష్యవాణి
బోనాల పండుగ మరుసటి రోజు ఘటాల ఊరేగింపు తర్వాత ‘రంగం’ అనే కార్యక్రమం జరుగుతుంది. ఈ ఏడాది జూలై 10 సోమవారం రంగం నిర్వహిస్తున్నారు. మట్టితో చేసి కాల్చిన పచ్చికుండను మండపంలో అడుగులోతున పాతిపెడతారు. ఒక కొత్త చేటను దానిపై పెట్టి పసుపు, కుంకుమలతో ముగ్గులు వేస్తారు. జోగినిగా మారిన మహిళ (మాతంగ కన్య) దానిపై నిలబడి అమ్మవారి విగ్రహం వంక చూస్తూ ..అమ్మవారు ఆవహించిన తర్వాత రాష్ట్ర భవిష్యత్తును వివరిస్తుంది. రాబోయే ఏడాది తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచిస్తుంది. దీన్నే ‘అమ్మమాట, భవిష్యవాణి’ అని అంటారు. రంగం పూర్తయ్యాక అమ్మవారి సోదరుడు పోతరాజు ఆలయం చుట్టూ తిరుగుతూ, తాండవం చేస్తారు. తర్వాత దైవసన్నిధిలోని ప్రసాదం, దీపాల ప్రమిదలు, పూలు సహా అన్నీ ఒక గంపలో వేస్తారు. ‘బలిగంప’గా పిలిచే దానిని ఊరి పొలిమేరలో నిక్షిప్తం చేస్తారు.
శరీరం బోనపుకుండకు ప్రతీక
శ్రీమాత సకల జగత్తును తన ఉదరమనే అమృత భాండంలో నిక్షిప్తం చేసుకుందని, అందుకు సంకేతంగా అన్న పదార్థాలను మట్టి కుండలలో వండి ‘బోనాలు’ గా సమర్పిస్తారని చెబుతారు. ‘మన శరీరం బోనపు కుండకు ప్రతీక అనుకుంటే కుండలోని అన్నం జీవశక్తికి సంకేతం. కుండపై వెలిగే దీపం ఆత్మజ్యోతి. ఈ ఆత్మజ్యోతిని పరంజ్యోతితో మమమేకం చేయాలన్నది బోనాలు సంబరాల ఆంతర్యం’ అని ఆధ్యాత్మికవాదులు చెబుతారు.
అమ్మవారికి నిండు మనసుతో బోనం సమర్పిస్తే మెండు మనసుతో అనుగ్రహం కురిపిస్తుందని భక్తుల విశ్వాసం.
గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.