Sun Temples in India: భారతదేశంలో ప్రసిద్ధ సూర్య దేవాలయాలు - ఆరోగ్యం, సంపదను ప్రసాదించే ఆలయాల గురించి తెలుసుకోండి!
Sun Temples in India: ప్రత్యక్ష భగవానుడు అయిన సూర్యుడు ఆరోగ్యం, ఆయుష్షు, సంపదను ప్రసాదిస్తాడు. నిత్యం కనిపించే ఆదిత్యుడి ఆలయాలు మన దేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా..

భారతదేశంలో ప్రసిద్ధ సూర్య దేవాలయాలు: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు రాజు సూర్యుడు. ఏ వ్యక్తి జాతకంలో సూర్యుడు శుభంగా ఉంటాడో ఆవ్యక్తి నాయకత్వం వహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాడని పండితులు చెబుతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడిని దేవుడిగా పరిగణించడమే కాకుండా గ్రహంగా కూడా పరిగణిస్తారు. ఆయుష్షు, రూపం, ఆరోగ్యం , సంపదను సూర్యుడు ప్రసాదిస్తాడు. దీంతో పాటు వ్యక్తిత్వం, అధికారం, సాధారణ ఆరోగ్యం, ప్రభుత్వ ఉద్యోగం, రాజకీయ పదవి మొదలైన వాటికి చిహ్నం సూర్యుడు అని విశ్వసిస్తారు.
అదే సమయంలో ఓ వ్యక్తి జాతకంలో సూర్యుడు అశుభ స్థానంలో ఉంటే గౌరవం , ప్రతిష్ట కోల్పోయి అవమానం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి వ్యక్తి జీవితంలో సంతోషం, సంపద ఉండదు..ఆ వ్యక్తి ముఖంలో మెరుపు కూడా మాయమవుతుంది. అంతేకాదు.. జాతకంలో సూర్యుడు అశుభ స్థానంలో ఉం అనారోగ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, కంటి సమస్యలు, ఆత్మవిశ్వాసం లేకపోవడం, అదృష్టంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. జ్యోతిష్యం ప్రకారం సూర్య భగవానుడు ఆరోగ్యానికి దేవుడు. తీవ్రమైన వ్యాధితో బాధపడేవారు సూర్య భగవానుడిని దర్శించుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని భక్తుల నమ్మకం. మరి మన దేశంలో సూర్యదేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా?
కోణార్క్ సూర్య దేవాలయం
కోణార్క్ సూర్య దేవాలయం భారతదేశంలో పురాతనమైనది, అత్యంత ప్రసిద్ధమైన సూర్య దేవాలయం. అద్భుతమైన శిల్పకళకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం ప్రపంచ వారసత్వ ప్రదేశం. ఇక్కడ దేవుడు ప్రత్యక్షంగా దర్శనమిస్తాడని నమ్ముతారు. కోణార్క్ దేవాలయం ఇప్పుడు ఒక చారిత్రక వారసత్వంగా మారింది
మోధేరా సూర్య దేవాలయం
గుజరాత్‌లో మోధేరాలో ఓ సూర్య దేవాలయం ఉంది. మోధేరా సూర్య దేవాలయం గుజరాత్‌లోని మెహసానా జిల్లాలో పుష్పావతి నది ఒడ్డున ఉంది. ఈ
దేవాలయ సముదాయం మూడు భాగాలుగా విభజించి ఉంటుంది. సభా మండపం 52 స్తంభాలపై ఉంటుంది..ఇది ఏడాదిలో 52 వారాలను సూచిస్తుంది. గోడలపై పంచభూతాలను చూడవచ్చు. అదే సమయంలో సూర్యుని అనేక రూపాలను వివిధ భాగాలలో చూడవచ్చు. ఇ
మార్తాండ్ సూర్య దేవాలయం
మార్తాండ్ సూర్య దేవాలయం కాశ్మీర్‌లో ఉంది. 8వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయాన్ని కర్కోటా వంశానికి చెందిన రాజు లలితాదిత్య ముక్తాపిదా నిర్మించారని స్థలపురాణం. కాశ్మీరీ వాస్తుశిల్పం నైపుణ్యానికి ఇది ఒక ఉదాహరణ. అయితే, దీనిని 15వ శతాబ్దంలో పాలకుడు సికిందర్ బుట్‌షికన్ ధ్వంసం చేశాడు.
అరసవిల్లి
ఆంధ్రప్రదేశ్‌లో అరసవిల్లిలో ఉన్న సూర్యదేవాలయం. ఇక్కడ సూర్యనారాయణుడు తన భార్యలు ఉష ఛాయతో పూజలందుకుంటున్నాడు. ఏడాదికి రెండుసార్లు సూర్యుడి తొలి కిరణాలు నేరుగా గర్భగుడిలో ఉన్న విగ్రహాన్ని తాకుతాయి. అరసవిల్లిలో ఆదిత్యుడిని దర్శించుకుంటే ఆరోగ్యం, సంపద వృద్ధి చెందుతాయని భక్తుల నమ్మకం
దేవార్క్ సూర్య దేవాలయం
బీహార్‌లో సూర్యదేవాలయాల్లో ఔరంగాబాద్‌లోని దేవార్క్ దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలోని దేవ్ అనే ప్రదేశంలో ఉంది. ఈ ఆలయంలో సూర్య భగవానుడిని పూజిస్తారు. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఆలయం తలుపు తూర్పు వైపు కాకుండా పడమర వైపు ఉంది. పురాణాల ప్రకారం ఈ ఆలయాన్ని విశ్వకర్మ కేవలం ఒక రాత్రిలో నిర్మించాడు. ఇక్కడి రాజుగా ఉన్న వృషపర్వ పురోహితుడు శుక్రాచార్యుని కుమార్తె దేవయాని పేరు మీద ఈ ప్రదేశానికి దేవ్ అని పేరు వచ్చిందని నమ్ముతారు.
బెలౌర్ సూర్య దేవాలయం
బీహార్ భోజ్‌పూర్ జిల్లా బెలౌర్ గ్రామ సమీపంలో ఉన్న బెలౌర్ సూర్య దేవాలయం చాలా పురాతనమైనది. ఇది అప్పటి రాజు నిర్మించిన 52 చెరువులలో ఒక చెరువు మధ్యలో ఉంది.
దక్షిణాయన్ సూర్య దేవాలయం
బీహార్‌లో ఉన్న మరో సూర్యదేవాలయం దక్షిణాయన్ సూర్య దేవాలయం. ఇక్కడున్న విగ్రహం సత్యయుగం నాటిదని నమ్ముతారు. ఇక్కడ సూర్య భగవానుడితో పాటు శని , యముడు కూడా ఉన్నారు. ఇక్కడ సూర్య భగవానుడి విగ్రహం నల్లరాయిది. గయాసురుడు విగ్రహాన్ని ప్రతిష్టించాడని నమ్ముతారు. సూర్య పురాణం , వాయు పురాణంలో దీని స్థాపన గురించి ప్రస్తావన ఉంటుంది.
సూర్యనార్ కోవిల్
తమిళనాడులోని కుంభకోణం సమీపంలో ఉన్న సూర్యనార్ కోవిల్ చాలా పవర్ ఫుల్ అని భక్తుల విశ్వాసం. సూర్యనార్ కోవిల్ తమిళనాడులోని ఏకైక సూర్య దేవాలయం, ఇక్కడ అన్ని గ్రహ దేవతలకు ప్రత్యేక ఆలయం ఉంది. పురాణాలలో కూడా దీని గురించి ప్రస్తావన ఉంటుంది. ఈ ఆలయంలో పూజలు చేయడం వల్ల సూర్యుని దోషాల వల్ల కలిగే సమస్యలన్నీ తొలగిపోతాయని చెబుతారు.
రాజస్థాన్‌లోని ఝాలావార్‌కు చెందిన రెండవ జంట నగరం అయిన ఝలారాపటన్‌ను సిటీ ఆఫ్ వెల్స్ అని కూడా పిలుస్తారు, ఇక్కడ నగరం మధ్యలో సూర్య దేవాలయం ఉంది. ఈ ఆలయం గర్భగుడిలో విష్ణుమూర్తి విగ్రహం ఉంది.
మధ్యప్రదేశ్ లోని దతియా జిల్లాలో ఉంది ఉనావ్-బాలాజీ సూర్య దేవాలయం. ఈ ఆలయం దగ్గర పహుజ్ నది ఉంది. అందులో స్నానం చేస్తే చర్మ వ్యాధులు నయమవుతాయని నమ్ముతారు. ఈ ఆలయాన్ని గొప్ప రాజు మారుచ్ అనేక వేల సంవత్సరాల క్రితం నిర్మించారని చెబుతారు.
ప్రయాగ్‌రాజ్‌లోని శూలటంకేశ్వర మహాదేవ దేవాలయం సూర్యదేవుడికి సంబంధించినది
ఉత్తర ప్రదేశ్ లోని సంగం నగరం ప్రయాగ్‌రాజ్‌లోని అరైల్‌లో ఉన్న శూలటంకేశ్వర మహాదేవ దేవాలయం సూర్యదేవుడికి సంబంధించినది. శివపురాణం స్కంద పురాణంలో ఈ ఆలయాన్ని శూలటంకేశ్వర మహాదేవ దేవాలయంగా వర్ణించారు. బ్రహ్మ ఆదేశం మేరకు జనహితం కోసం సూర్యదేవుడు సంగం సమీపంలో అక్షయవట్ ముందు ఒక శివలింగాన్ని ప్రతిష్టించాడని చెబుతారు. శివుడిని పూజించడం ద్వారా సూర్యదేవుడు కూడా సంతోషించే ఏకైక ఆలయం ఇది.
దేవభూమి ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలోని అధేలి సునార్ గ్రామంలో కటార్మల్ సూర్య దేవాలయం ఉంది. సూర్యదేవుడు కటార్మల్ ఆలయంలో ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడని నమ్ముతారు. ఇక్కడ సూర్య భగవానుడి విగ్రహం బడ్ చెట్టు నుంచి తయారైందని చెబుతారు. అందుకే ''బడ్ ఆదిత్య దేవాలయం'' అని కూడా పిలుస్తారు.
గమనిక: ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసిన కథనం ఇది. ఇందులో ఉన్న సమాచారాన్ని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం..






















