ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉంటే అన్నీ కష్టాలే, ఈ చిట్కాలు పాటిస్తే అంతా మంచే జరుగుతుంది
ఇంట్లో ప్రతికూల ప్రభావాలుంటే ఎప్పుడూ ఏదో ఒక చికాకు ఉంటూనే ఉంటుంది. దాన్ని తొలగించుకోవాలంటే కొన్ని చిన్న పనులు చేస్తే చాలు పాజిటివ్ ఎనర్జీ కలిగి జీవితం సుఖమయం అవుతుంది.
మనచుట్టూ మంచి ఉన్నట్లే చెడు కూడా తప్పకుండా ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ కనుక మన చుట్టూ ఉంటే అన్నీ పాజిటివ్ ఆలోచనలే కలుగుతాయి. జీవితం ప్రశాంతంగా సుఖమయంగా ఉంటుంది. అదే నెగటివ్ ఎనర్జీ ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా చికాకులు కలుగుతాయి. ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. అనుకున్న పనులు జరగవు. ప్రశాంతంగా ఉండలేం. మీ ఇంట్లో కూడా ఇలా అవుతుందంటే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందన్నమాట. మరి ఇంట్లో ప్రతికూల ప్రభావాలని తొలగించి, అనుకూల ప్రభావాలను పొందాలంటే ఇలాంటి చిన్న చిన్న పనులను ఇంట్లో చేయండి. దానివల్ల ఇంట్లో ప్రశాంతంగా ఉండి.. జీవితం సుఖమయం అవుతుంది.
స్వచ్చమైన గాలికి ఆహ్వానం పలకండి
అపార్ట్మెంట్స్ లో ఉండేవారు చాలామంది ఎప్పుడూ తలుపులు, కిటికీలు బిగుసుకుని కూర్చుంటారు. కానీ అలా చేయడం తప్పు. ముఖ్యంగా ఉదయం నిద్రలేచిన వెంటనే మీ ఇంటి కిటికీ తలుపులను, ఈశాన్యం వైపున ఉండే గది తలుపులను తెరవాలి. దాని వల్ల ఉదయం లేలేత కిరణాలు ఇంట్లోకి ప్రవేశిస్తాయి. స్వచ్ఛమైన గాలి లోపలికి వస్తుంది. ఇంట్లో ఎప్పుడూ లోపలి గాలి బయటకు, బయటగాలి లోపలికి వెళ్లేలా చూసుకోవాలి. తలుపులు మూసుకుని ఉన్నా కిటికీలను మాత్రం దాదాపు తెరిచిపెట్టుకోండి. దీనివల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ మీ ఇంట్లో ఉండి, ఏదైనా ప్రతికూలమైన శక్తులు ఉంటే తొలగిపోతాయి.
ఎప్పటికప్పుడు పాతవస్తువులను తీసివేయండి
చాలామంది అవసరం ఉన్నా లేకున్నా అన్నీ వస్తువులను ఇంట్లో పెట్టుకుని ఉంటారు. ఇకపై అలా ఉంచుకోకండి. మీకు అవసరం లేదు అని అనిపిస్తే ఆ వస్తువులను వెంటనే తీసేయండి. ఒక సంవత్సరం అంతకన్నా ఎక్కువ కాలం నుంచి పాడుబడి మూలన ఉన్న వస్తువులను ఖచ్చితంగా తీసేయండి. వంటపాత్రలు కూడా పగిలిపోయినవి, పాడైపోయినవి బయట పడేయండి. అలాగే చినిగిపోయిన బట్టలను, కాలిపోయిన బట్టలను ఉంచుకోకండి వాటిని వేసుకోకండి. అవన్నీ బయటవేసేయండి. గడియారం పాడైపోయి ఉంటే వాటిని తీసివేయండి. ఆగిపోయిన గడియారాన్ని ఇంట్లో ఉంచుకోకూడదు. ఇంట్లో వస్తువులు పెట్టే ప్రదేశాలన్నీ సరైన ప్రదేశాలలోనే ఉన్నాయా లేవా అనేది కూడా చూసుకోండి. ఒకవేళ సరైన దిశలో అవి లేకుంటే వాటిని సరిచేసుకోండి.
అదేవిధంగా ఇంటిలోని ప్రతి మూలను శుభ్రపరిచేటప్పుడు మీ ఇంటిని లోపల నుండి బయట వరకు శుభ్రం చేయండి. మనం రోజూ తుడుచుకోని ఇంటి మూలలో చాలా ప్రతికూలతలు పేరుకుపోతాయి. అలాకాకుండా అన్నింటినీ చక్కగా శుభ్రం చేయండి. ఎప్పటికప్పుడు బూజు దులపడం, ఫ్యాన్లు కిటికీలను శుభ్రం చేయడంలాంటి పనులను చేయండి.
నిరంతరం దేవుడి నామస్మరణ
ఒకప్పుడు ఇంట్లో ఉదయం లేవగానే సుప్రభాతం, దేవుడి ప్రార్థనా గీతాలతో ఇల్లు మారుమ్రోగేవి. కానీ ఇప్పుడు చాలామంది నిద్రలేవగానే సినిమా పాటలను పెట్టుకుంటున్నారు. అలా కాకుండా ఉదయం నిద్రలేవగానే ప్రశాంతమైన సంగీతాన్ని వినడానికి ప్రయత్నించండి. ఇష్టదేవతారాధనను చేయండి. ఓంకార శబ్దం, మఈత్యుంజయ మంత్రం లేదా గాయత్రీమంత్రం లాంటివి ఉత్తమమైన ఫలితాలను ఇస్తాయి. ఇక హనుమాన్ చాలీసాను కూడా చదవవచ్చు. ఇంట్లో ఎప్పుడూ దీపం వెలుగుతూ ఉండేలా చూసుకోండి. దైవానుగ్రహం ఉంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. అనుకున్న పనులన్నీ సక్రమంగా నెరవేరుతాయి. మనస్సు కూడా చాలా ప్రశాతంగా ఉంటుంది.
ఇంటిని ఎప్పుడూ సువాసనాభరితంగా ఉంచండి
ఇంట్లో ఎప్పుడూ మంచి సువాసనలు వెదజల్లేలా చూసుకుంటే మనస్సుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అందుకోసం సుంగంధ ద్రవ్యాలు, లావెండర్ లాంటి మంచి వాసనలు వచ్చే స్ప్రేలను కూడా ఉపయోగించవచ్చు. అదేవిధంగా ప్రతి శుక్రవారం, గురువారం, ఆదివారం సాయం సమయంలో ఇంట్లో ప్రతిమూలలా ధూపం వేయడం వల్ల ఇంట్లో ప్రతికూల ప్రభావాలు తొలిగి సానుకూల ప్రభావం కలుగుతుంది.
Also Read: కార్తీక పౌర్ణమి రోజు వెలిగించే జ్వాలా తోరణం కిందనుంచి ఎందుకు దాటితే ఏమవుతుంది!