Holi 2022: హోలీ రోజే లక్ష్మీదేవి ఆవిర్భవించింది, ఈ సారి శుక్రవారం కావడంతో మరింత పవర్ ఫుల్
లక్ష్మీదేవి జననం గురించి వివిధ పురాణాల్లో వివిధ రకాలుగా ప్రస్తావించారు. వాటిలో ఒకటి ఫాల్గుణమాసంలో వచ్చే పౌర్ణమిని అంటే హోలీ పౌర్ణమిని లక్ష్మీదేవి జన్మదినంగా భావిస్తారు...
ఫాల్గుణమాసంలో వచ్చే పౌర్ణమిని లక్ష్మీదేవి జన్మదినంగా పాటిస్తారు. లక్ష్మీదేవి కృపకు పాత్రులుకావాలని తద్వార సిరిసంపదలు సమకూరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఈరోజు లక్ష్మీదేవిని పూజిస్తే అమ్మవారి కటాక్షం లభిస్తుందంటారు. వివిధ పురాణాల్లో లక్ష్మీదేవి జనన గాథల గురించి చూస్తే...
Also Read: హోలీ రోజు మగాళ్లని చితక్కొట్టేయడమే అక్కడి వేడుక
క్షీరసాగర మధనం సమయంలో సాగరంలో ఉద్భవించిన అనేక వస్తువులు , అపూర్వ జంతుజాలాదులతో పాటు లక్ష్మీదేవి కూడా జన్మించిందని ఒక కథనం. చాలా పురాణాల్లో కనపడే కథనం ఇదే. ఒకసారి దూర్వాస మహాముని కల్పవృక్షమాలను దేవేంద్రునికి బహూకరించగా దేవేంద్రుడు ఆ మాలను తన వాహనమైన ఐరావతానికి వేస్తాడు. ఆ ఏనుగు ఆ మాలను కిందపడేసి , కాళ్ళతో తొక్కి ముక్కలు చేస్తుంది. అది చూసిన దూర్వాస మహాముని కోపోద్రిక్తుడై ”నీ రాజ్యం నుంచి లక్ష్మి వెళ్ళిపోవుగాక” అని శపిస్తాడు. శాపఫలితంగా స్వర్గలోకంలో ఐశ్వర్యం నశించిపోతుంది. రాక్షసులు స్వర్గంపైకి దండయాత్రలు చేస్తారు. స్వర్గాన్ని స్వాధీనం చేసుకుంటారు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు సూచన మేరకు క్షీరసాగరమథనం చేసి అమృతాన్ని ఉద్భవింపచేసి రాక్షసులను సంహహిస్తారు. క్షీరసాగరమధనంలో ముందుగా హాలాహలం ఆ తర్వాత సురభి అనే కామధేనువు, ఉచ్ఛ్వైశ్రవం అనే అశ్వం , ఐరావతం , కల్పవృక్షం , వీటన్నింటి తరువాత క్షీరాబ్ధి నుంచి ఫాల్గుణమాసంలో వచ్చే పౌర్ణమి ఉత్తరఫల్గుణి నక్షత్రంలో శ్రీమహాలక్ష్మి ఉద్భవించింది. ఇది వైవస్వత మన్వంతరంలో శ్రీ మహాలక్ష్మీ జననం వెనుక ఉన్న గాధ.
" లక్షీం క్షీరసముద్ర రాజతనయాం
శ్రీరంగ ధామేశ్వరీం
దాసీభూత సమస్త దేవ వనితాం
లోకైక దీపాంకురాం
శ్రీమన్మంధ కటాక్ష లభ్ద
విభవద్భ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక కుటుంబినీం సరసిజాం
వందే ముకుందప్రియాం "
Also Read: హోలీ ఎందుకు జరుపుకోవాలి, ఈ సంప్రదాయం ఎప్పటినుంచి ఉంది
విష్ణుపురాణం ప్రకారం లక్ష్మీదేవి భృగుమహర్షి కుమార్తె. భ్రుగు మహర్షి భార్య ఖ్యాతి. వీరికి మొదట పుత్ర సంతానం కలిగింది. కానీ పుత్రిక కోసం జగన్మాతను ప్రార్థించిన తఫః ఫలమే లక్ష్మీదేవి. విష్ణుమూర్తిని ఈమె వివాహమాడింది. స్వారోచిష మన్వంతరంలో లక్ష్మీదేవి అగ్నినుంచి అవతరించిందని చెబుతారు. జౌత్తమ మన్వంతరంలో జలరాశి నుంచి , తామస మన్వంతరంలో భూమినుంచి , రైతవ మన్వంతరంలో బిల్వవృక్షం నుంచి, చాక్షుస మన్వంతరంలో సహస్రదళ పద్మం నుంచి జన్మించినట్టు విశ్వసిస్తారు.
లక్ష్మీదేవి కటాక్షం కోసం
శంకరాచార్య లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు కనకధారాస్తోత్రం పఠించాడని , అప్పుడు లక్ష్మీదేవి ఆయనను కరుణించి బంగారు వర్షం కురిపించిందని ఒక గాథ. అపరిశుభ్రంగా ఉండే ఇళ్ళలోనూ , ప్రదేశాలలోనూ లక్ష్మీదేవి ఉండదు . భక్తిశ్రద్ధలతో ఈ రోజున మహాలక్ష్మిని ఆరాధిస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. సిరిసంపదలతో పాటు కీర్తి దక్కుతుంది. బుద్ధి వికాసం కలుగుతుంది. అన్నింటా జయం లభిస్తుంది.