Hindu Marriage System: పెళ్లి ఎందుకు చేసుకోవాలి - ఒంటరిగా ఉండిపోతే ఏమవుతుంది - పురాణాలు ఏం చెబుతున్నాయి!
పెళ్లి వద్దు అనే వారిసంఖ్య చాలా తక్కువ. అయితే ఈ మధ్య డేటింగ్ కల్చర్ పెరిగినతర్వాత పెళ్లొద్దు కానీ తోడు కావాలని ఫిక్సవుతున్నారు. అసలు ఇంతకీ పెళ్లెందుకు చేసుకోవాలో మీకు తెలుసా...
Hindu Marriage System: పెళ్లి ఉత్సవం కాదు..మనిషి జీవితంలో పాటించాల్సిన షోడశ సంస్కారాలలో ప్రధానమైనది. సానపెట్టడం వల్ల వజ్రం ఎలా ప్రకాశిస్తుందో సంస్కారాల వల్ల ఆత్మ ప్రకాశిస్తుంది. జీవితం సార్థకం, సుఖవంతం, ఆనందమయం అవుతుంది. వివాహంలోని మంత్రాల అర్థం పరమార్థం పూర్తిగా తెలియకపోవడం వల్ల ఏదో తంతు త్వరగా పూర్తిచేశామా లేదా అన్నదే చూసుకుంటున్నారు నేటి తరం. ఫొటోలు, వీడియోలు, విందులకు ఇచ్చిన ప్రాధాన్యత ముఖ్యమైన సంస్కారానికి చాలామందికి ఇవ్వడం లేదు. అందుకే వైవావిక జీవితంలో ఎన్నో సమస్యలు. అసలు పెళ్లెందుకు చేసుకోవాలో తెలుసా!
వివాహ శబ్దార్ధం
శ్లో|| ఇయం సీతా మమ సుతా సహధర్మచరీ తన!
వ్రతీచ్చ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా||
అర్థం: శ్రీమద్రామాయణంలో జనక మహారాజు అంటారు. ఓ రామచంద్రా! ఈ సీత నా కుమార్తె. నీకు సహధర్మ చారిణిగా ఈమెను అర్పిస్తున్నాను. ఈమె చేతిని పట్టుకుని స్వీకరింపుము. నీకు శుభమగు గాక !
Also Read: జూలై 13 రాశిఫలాలు ,ఈ 5 రాశువారి జీవితంలో సంతోషం - ఆ రాశివారిలో అత్యాశ
ఇంతకీ పెళ్లెందుకు చేసుకోవాలి
పెళ్లెందుకు చేసుకోవాలి...ఇది చాలా మంది నుంచి వచ్చే ప్రశ్న. ఈ మధ్య డేటింగ్ కల్చర్ పెరగడంతో పెళ్లిని చాలా లైట్ తీసుకుంటున్నారు. కానీ మనం పాటించే ప్రతి సంప్రదాయం వెనుకా ఓ ఆంతర్యం ఉంటుంది. ముఖ్యంగా పెళ్లిచేసుకోవడం అనేది మూడు రుణాలు తీర్చుకునేందుకే అని అంటారు పండితులు.
ప్రతీ మనిషీ మూడు ఋణాలతో పుడతాడు
1. ఋషిఋణం
2. దేవఋణం
3. పితౄణం
ఈ మూడు రుణాలను తీర్చడం ప్రతి ఒక్కరి విధి. ఈ రుణాలు తీర్చకపోతే మరో జన్మ ఎత్తవలసి వస్తుంది. మానవజన్మకు సార్థకత జన్మరాహిత్యం. అందుకే ప్రతిక్కరూ రుణవిముక్తులు కావాలి. దానికి పరిష్కారమే పెళ్లి
"బ్రహ్మచర్యేణ ఋషిభ్యః" " యజ్ఞేన దేవేభ్యః" "ప్రజయా పితృభ్యః"
ఋషి ఋణం
బ్రహ్మచర్యం ద్వారా ఋషి ఋణం తీర్చాలి. అంటే బ్రహ్మచర్యంలో వేదాధ్యయనం చేయాలి, దైవారాధనలో ఉండాలి, గురువులను పూజించాలి. పురాణాలు మొదలైన వాగ్మయాన్ని అధ్యయనం చేసి తరువాత తరం వారికి వాటిని అందించడం ద్వారా ఈ ఋణాన్ని తీర్చుకోవాలి.
దేవఋణం
యజ్ఞ యాగాది క్రతువులు చేయడం, చేయించడం ద్వారా ఈ ఋణాన్ని తీర్చుకోవాలి. యజ్ఞం అంటే త్యాగం. యజ్ఞాలవల్ల దేవతలు తృప్తి చెందుతారు. సకాలంలో వర్షాలు కురుస్తాయి. పాడిపంటలు వృద్ధి చెందుతాయి. కరువు కాటకాలు తొలగిపోతాయి. నీరు, గాలి, వెలుతురు, ఆహారాన్ని ప్రసాదిస్తున్న వారందరికి మనమెంతో ఋణపడివున్నాం. ఆ ఋణాన్ని తీర్చకపోతే మనం కృతఘ్నలం అవుతాం.
పితౄణం
సత్సంతానాన్ని కనడం ద్వారా ఈ ఋణాన్ని తీర్చుకోవాలి. తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు, మనకు జన్మనిచ్చి పెంచి పోషించినవారు. వంశాన్ని అవిచ్చిన్నంగా కొనసాగించడం ద్వారా పితృ దేవతలకు తర్పణాది క్రియలు నిర్వహించే యోగ్యులైన సంతానాన్ని కనడం ద్వారా పితౄణం తీర్చుకోవాలి. సంతానం కలగాలంటే వివాహం చేసుకోవాలి కదా. "ప్రజాతంతుం మావ్యవత్సేత్సీః" అంటుంది వేదం. అంటే వంశపరంపరను త్రెంచవద్దని అర్థం. యజ్ఞాలలో పంచ యజ్ఞాలు విధిగా ప్రతి మనిషీ చేయాలి. అవే దేవ, మనుష్య, భూత, పితృ, బ్రహ్మ యజ్ఞాలు
Also Read: జూలై 17 నుంచి దక్షిణాయనం ప్రారంభం- ఈ సమయంలో పాటించాల్సిన విధులివే!
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial