Gyanvapi Mosque Row: మూడు దశాబ్దాల క్రితమే మొదలైన జ్ఞానవాపి మసీదు వివాదం
ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన వారణాసిలో జ్ఞానవాపి వివాదం మూడు దశాబ్దాల క్రితమే మొదలైంది... మరి మధ్యలో బ్రేక్ పడి ఇప్పుడెందుకు రాజుకుందంటే...
జ్ఞానవాపి మసీదులో నిర్వహించిన వీడియోగ్రఫీ సర్వే నివేదికను వారణాసి సివిల్ కోర్టులో సమర్పించారు కోర్టు కమిషనర్ అజయ్ ప్రతాప్ సింగ్.జ్ఞానవాపి మసీదు గోడలపై హిందూ రాతలు ఉన్నట్లు కమిటీ గుర్తించింది. దీంతో పాటు మసీదులో ఆలయ అవశేషాలను గుర్తించినట్లు సమాచారం. విగ్రహాల ముక్కలున్నాయని కోర్టుకు తెలిపింది. మరోవైపు శివలింగం కనిపించినచోట తక్షణమే పూజలకు అనుమతించాలని కాశీ విశ్వ నాథ ఆలయ ట్రస్ట్ విజ్ఞప్తి చేసింది. మసీదు మొత్తాన్ని పురావస్తు శాఖ సర్వే చేయాలని డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి.అయితే ఈ వివాదం నిన్నో మొన్నో మొదలైంది కాదు...మూడు దశాబ్దాలక్రితమే రాజుకుని మధ్యలో కొడిగట్టింది. అయోధ్య రామమందిరం నిర్మాణానికి అనుకూలంగా తీర్పురావడంతో మళ్లీ భగ్గుమంటోంది...
Also Read: జ్ఞానవాపి మసీదులో ఆలయ అవశేషాల గుర్తింపు- వారణాసి కోర్టు విచారణకు సుప్రీం బ్రేకులు!
మూడుదశాబ్ధాల క్రితమే మొదలైన వివాదం
కాశీ విశ్వనాథుడి ఆలయం కూల్చేసి ఆ స్థానంలో మసీదు కట్టారని 1991 అక్టోబర్ 15న పండిట్ సోమ్‌నాథ్ వ్యాస్, డాక్టర్ రామ్‌రంగ్ శర్మతో పాటు పలువురు వారణాసి కోర్టును ఆశ్రయించారు. మసీదు ప్రాంతంలో కొత్తగా ఆలయం నిర్మించి పూజలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని అప్పట్లో కోర్టును కోరారు. అదే సమయంలో మసీదు తరుపున అంజుమన్ ఇంతెజామియా స్టే కోర్టుతూ హైకోర్టును ఆశ్రయించింది. అలా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఆ కేసు 1998 వరకు పెండింగ్‌లోనే ఉండిపోయింది. 2019లో సుప్రీం కోర్టు అయోధ్యలో రామాలయ నిర్మాణానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో.. మరోసారి జ్ఞానవాపి మసీదు వివాదం తెరపైకి వచ్చింది. దీంతో న్యాయవాది విజయ్ శంకర్ రస్తోగీ కొత్త పిటిషన్ వేశారు. మసీదు ప్రాంగణంలో ఆర్కియలాజికల్ సర్వే నిర్వహించాలని కోరారు. 2021 ఏప్రిల్ 8న కోర్టు ఈమేరకు ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై యూపీ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించగా.. మధ్యంతర స్టే ఇచ్చింది.
Also Read: 'జ్ఞానవాపి' వెనుక ఇంత కథ ఉందా, శివలింగంతో పాటూ బావిలో దూకిన పూజారి!
30 ఏళ్లుగా తిరుగుతున్న ఈ వివాదాన్ని ఐదుగురు మహిళలు సరికొత్త మలుపు తిరిగేలా చేశారు. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శృంగార గౌరి గణపతి, హనుమంతుడి విగ్రహాలకు నిత్యపూజలు జరిపించే అవకాశం ఇవ్వాలని విశ్వ వేదిక్ సనాతన్ సంఘ్ తరుపున ఐదుగురు మహిళలు గతేడాది కోర్టులో పిటిషన్ వేశారు. దీనితో పాటు వీడియోగ్రఫీని డిమాండ్ చేశారు. ఈ పిటిషన్‌ను అంగీకరిస్తూ కోర్టు జ్ఞాన్‌వాపి మసీదు సర్వే జరపాలని, వీడియోగ్రఫీ చేయాలని ఆదేశించింది. మసీదు ప్రాంగంణంలో ఉన్న బావిలో నీటి స్థాయిని తగ్గించి చూస్తే అక్కడ శివలింగం గుర్తించారు. దీంతో తాము చెప్పిందే నిజమైందని హిందువులు...మరో మసీదు కోల్పోయేందుకు సిద్ధంగా లేమని ముస్లిం సంఘాలు స్ట్రాంగ్ గా స్పందిస్తున్నాయ్. ఇన్నేళ్ల తర్వాత భగ్గుమంటున్న ఈ వివాదానికి ఎలాంటి ఫుల్ స్టాప్ పడుతుందో వెయిట్ అండ్ సీ....
Also Read: 'జ్ఞానవాపి మసీదు' కేసులో సుప్రీం కీలక ఆదేశాలు- కమిషనర్ తొలగింపు