Golconda Mahakali Temple: తొలి బోనాలు ఇక్కడే - గోల్కొండ మహంకాళి దేవి ఆలయం ప్రత్యేకతలు ఇవే
హైదరాబాద్ నగరంలో ఆశాఢం బోనాలు గోల్కొండ కోటలోని శ్రీ మహంకాళి ఆలయం నుంచి ప్రారంభమవుతాయి. ఇక్కడి అమ్మవారికి తొలి బోనం సమర్పించిన తర్వాతే మిగతా చోట్ల బోనాలు పెడతారు.
Golconda Mahakali Temple History: హైదరాబాద్ మహా నగరంలో ఆషాఢం బోనాల సంబురాలు ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఆషాఢ మాసం తొలి వారం నుంచి ప్రారంభమయ్యే బోనాల ఉత్సవాలు.. చరిత్రాత్మక గోల్కొండ కోటలో ఓ రాతి గుహలో నెలకొన్న శ్రీ మహంకాళి దేవి ఆలయం నుంచే మొదలవుతాయి. ఈ అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో భాగ్యనగర ఆషాఢ బోనాల ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. కోరిన కోర్కెలు నెరవేర్చే శక్తి స్వరూపిణిగా పూజలు అందుకుంటున్న మహంకాళి అమ్మవారికి బోనం పెడితే, ఏడాదంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉంటారని భక్తుల విశ్వాసం. గోల్కొండ అమ్మవారికి తొలి బోనం ఎత్తిన తర్వాతే, భాగ్యనగరంలోని మిగతా ఆలయాల్లో బోనాల పండుగ మొదలువుతుంది.
గోల్కొండ మహంకాళి దేవి ఆలయం చరిత్ర
గోల్కొండ బోనాలు గత వెయ్యి సంవత్సరాలుగా కొనసాగుతున్నట్లు చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. ఈ అమ్మవారికి బోనం సమర్పించడం వెనుక చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. అమ్మవారి ఏర్పాటు, ఆలయ నిర్మాణం, కొనసాగింపు గురించి ప్రజలు పలు రకాలుగా చెప్పుకుంటున్నారు. హైదరాబాద్ నగరం ఏర్పడక ముందు ఈ ప్రాంతంలో రామ్ దేవ్ రావు అనే వ్యక్తి పశువులు కాస్తుండగా, అమ్మవారి విగ్రహం దొరికిందట. అద్భుత తేజస్సు కలిగిన ఆ విగ్రహం విషయం అప్పటి కాకతీయ రాజులకు తెలిసి, ఇక్కడ చిన్న ఆలయాన్ని కట్టించి.. అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారట. ఆ ప్రాంతానికి గొల్లకొండ అనే పేరు పెట్టారట. అంతేకాదు, కాకతీయ రాజు ప్రతాప రుద్రుడు మహంకాళి ఆలయంలో బోనాల సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారట. అప్పటి నుంచి ఏటా ఇక్కడ బోనాల ఉత్సవాలు జరుగతున్నాయి. కాకతీయుల తర్వాత ఈ ప్రాంతాన్ని పాలించిన నిజాం నవాబులు కూడా ఆలయాన్ని అలాగే కొనసాగించారని స్థానికులు చెప్తుంటారు. హిందూవులు భక్తితో జరుపుకునే బోనాల వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసేవారట.
గోల్కొండ బోనాల వెనుక ప్రచారంలో ఉన్న మరోకథ
హైదరాబాద్ నగరాన్ని నిజాం నవాబులు పాలిస్తున్న సమయంలో ప్లేగు వ్యాధి సోకి ఎంతో మంది చనిపోయారట. స్థానికంగా ఉండే ఓ వ్యక్తి కలలోకి మహంకాళి అమ్మవారు వచ్చి, తనకు బోనాలు సమర్పిస్తే, ప్లేగు వ్యాధి తగ్గిపోతుందని చెప్పిందట. ఆ వ్యక్తి ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారికి చెప్పడంతో అంతా కలిసి గోల్కొండ మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించారట. కొద్ది రోజుల్లోనే ప్లేగు వ్యాధి తగ్గడంతో ప్రతి ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు పెట్టే సంప్రదాయం కొనసాగుతుందట.
గురు, ఆది వారాల్లో అమ్మవారికి బోనాలు
హైదరాబాద్ నగరంలోని మిగతా ఆలయాలకు, గోల్కొండలోని మహంకాళి ఆలయానికి ఓ తేడా ఉంది. సాధారణంగా ఆషాడ మాసంలో వచ్చే నాలుగు లేదంటే ఐదో ఆదివారంలోనే ఆయా దేవతలకు బోనాలు సమర్పిస్తారు. కానీ, గోల్కొండ మహంకాళి అమ్మవారి ఆలయంలో ఆషాఢమాసంలోని ప్రతి గురు, ఆదివారాల్లో భక్తులు బోనాలు సమర్పిస్తారు. ఈ ఆలయంలో బోనాలు సమర్పించడం ద్వారా ఏడాదంతా సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉంటారని భక్తులు భావిస్తారు.
Read Also: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం గురించి ఈ విషయాలు తెలుసా? 1813లో ఏం జరిగింది?