Golconda Bonalu 2024: ఘనంగా ప్రారంభమైన గోల్కొండ బోనాలు, పోటెత్తిన భక్తులు- జగదాంబికకు తొలిబోనం
Golconda Bonalu Hyderabad 2024: హైదరాబాద్ లో బోనాల సందడి మొదలైంది. ప్రభుత్వం తరపున మంత్రులు పట్టువస్త్రాలు సమర్పణ అనంతరం గోల్గొండలో కొలువైన జగదాంబికకు తొలిబోనం సమర్పించారు.
Golconda Ashada Bonalu 2024: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే బోనాల జాతర ప్రారంభమైంది. శ్రీ శ్రీ జగదాంబిక మహంకాళీ గోల్కొండ బోనాల ఉత్సవాల నిర్వాహకుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం తరఫున స్పీకర్ గడ్డం ప్రసాద్ , మంత్రులు కొండ సురేఖ , పొన్నం ప్రభాకర్ , మేయర్ గద్వాల్ విజయలక్ష్మి , డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి , ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ , ప్రిన్సిపాల్ సెక్రెటరీ శైలజ , కలెక్టర్ అనుదీప్ బోనాలను అధికారికంగా ప్రారంభించారు. ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు అందించారు. లంగర్‌హౌజ్ చౌరస్తా నుంచి పట్టు వస్త్రాలు , తొట్టెలు ఊరేగింపు గోల్గొండ కోట వరకూ సాగింది. చారిత్రక గోల్కొండ కోటలో కొలువైన జగదాంబిక మహంకాళి ఎల్లమ్మకు తొలి బోనం సమర్పించడంతో ఉత్సవాలు మొదలయ్యాయి.
Also Read: ఎనిమిది ఘట్టాలతో కూడిన ‘బోనాలు’ పండుగ..మొదలెక్కడ ముగింపేంటి!
పోటెత్తిన భక్తులు
హైదరాబాద్ మహా నగరంలో వైభవంగా జరిగే బోనాల వేడుక చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో అమ్మవారికి తొలిబోనం సమర్పించారు. డప్పు చప్పళ్లు, శివసత్తులు పూనకాలు, పోతరాజులు విన్యాసాలతో గోల్కొండ పరిసర ప్రాంతాలు మారుమోగాయి. ఈ రోజు మొదలైన బోనాల సందడి ఆషాడం మాసం ముగిసేవరకూ ఘనంగా జరగనున్నాయి..ఆఖరి రోజు గోల్గొండ కోటలోనే ముగింపు ఉత్సవాలు జరగనున్నాయి.అంటే మొదటి పూజ చివరి పూజ గోల్కొండ జగదాంబ అమ్మవారి ఆలయంలోనే .
Also Read: వందల ఏళ్లుగా జరుగుతున్న సంబురం.. ప్రకృతికి కృతజ్ఞతా పూర్వకంగా సమర్పించే బోనం!
జూలై 29న 'రంగం'
ఈ నెల 21న లష్కర్ సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాంళి బోనాలు, ఈ నెల 28న పాతబస్తీ లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాలు జరుగుతాయి. పాతబస్తీలో 11 రోజుల పాటు ఉత్సవాలు కన్నులపండువగా జరుగుతాయి. సింహవాహిని మహంకాళి ఆలయంతో పాటూ ఉప్పుగూడ మహంకాళి ఆలయం, హరిబౌలి అక్కన్న మాదన్న ఆలంయాల్లోనూ బోనాలు సమర్పిస్తారు. ఈ నెలలో ప్రతి గురువారం, ఆదివారం బోనాల వేడుకలు నిర్వహిస్తారు. ఇక సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి ఆలయంలో జరిగే బోనాలకు ఘనచరిత్ర ఉంది. 1814 నుంచి అక్కడ బోనాల ఉత్సవాలు కొనసాగుతున్నాయి. జూలై 29న రంగం నిర్వహించనున్నారు. అంబారీపై అమ్మవారి ఊరేగింపు, పలహారం బండ్ల ఊరేగింపు నిర్వహిస్తారు.
Also Read: అమ్మకు బోనం.. ఆధ్యాత్మిక సంబురం మాత్రమే కాదు అంటు వ్యాధులు తరిమేసే ఆయుధం!
ఓ వైపు భక్తి - మరోవైపు ఆరోగ్యం
ఆషాడమాసం అంటే వానలు కురిసే సమయం...అంటువ్యాధులు విజృంభించి అనారోగ్యం పెరిగే సమయం. ఈవ్యాధుల నుంచి రక్షించమ్మా అని వేడుకుంటూ అమ్మ ప్రసాదించిన ఆహారాన్ని ఆమెకు కృతజ్ఞతతో సమర్పించే భోజనమే బోనం. అందుకే ఈ క్రతువు కోసం వినియోగించే వస్తువులన్నీ వైరస్ లను తరిమేసేవే.. వేపాకులు, పసుపు, పసుపునీళ్లు..ఇవన్నీ ఆరోగ్యానికి దివ్యమైన ఔషధాలే. ఆయురారోగ్యాలను ప్రసాదించి చల్లంగ చూడమ్మా అంటూ భక్తిపూర్వకంగా బోనాలు సమర్పిస్తారు.
Also Read: బోనాలు, రథయాత్ర, తొలి ఏకాదశి, గురుపూర్ణిమ సహా జూలై నెలలో ఎన్ని పండుగలో!