Dussehra 2023 : ఇంద్రకీలాద్రిపై మహాలక్ష్మి అలంకారంలో దుర్గమ్మను దర్శించుకుంటే!
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అక్టోబరు 18 బుధవారం శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారంలో దర్శనమిస్తోంది...
![Dussehra 2023 : ఇంద్రకీలాద్రిపై మహాలక్ష్మి అలంకారంలో దుర్గమ్మను దర్శించుకుంటే! Dussehra 2023 : Dussehra celebrations in Vijayawada indrakiladri, goddess Durga in Mahalakshmi Alamkaram Dussehra 2023 : ఇంద్రకీలాద్రిపై మహాలక్ష్మి అలంకారంలో దుర్గమ్మను దర్శించుకుంటే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/17/0bf563cb8e459681c3a7aaa25acd2d111697561023419217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
అక్టోబరు 18 బుధవారం- ఆశ్వయుజ శుద్ధ చవితి - శ్రీ మహాలక్ష్మీ దేవి
ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్మీ రూపాల్లో అష్టలక్ష్ములుగా అమ్మవారు మహాలక్ష్మీ అవతారంలో దర్శనమిస్తుంది. మహాలక్ష్మీ అలంకారాన్ని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయి. మంగళప్రదమైన దేవత ఈ మహా లక్ష్మీ. మూడు శక్తుల్లో ఒకటి ఈ మహాలక్ష్మి రూపం. అమిత పరాక్రమం చూపి హలుడు అనే రాక్షస సంహారార్థం అవతరించిన తల్లి మహాలక్ష్మి. లోకస్థతి కారిణి, ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్ముల సమష్టి రూపంలో దుర్గమ్మను మహాలక్ష్మి దేవి అలంకారంలో ఈ రోజు పూజిస్తారు.
Also Read: దసరాల్లో బాలలకు పూజ ఎందుకు చేస్తారు - దానివెనుకున్న ఆంతర్యం ఏంటి!
అష్టలక్ష్ముల అనుగ్రహం
మహాలక్ష్మీ సర్వ మంగళకారిణి, ఐశ్వర్యప్రదాయిని. అష్టలక్ష్ముల సమష్టి రూపమే మహాలక్ష్మీ. డోలాసురుడు అనే రాక్షసుడిని వధించింది. శక్తిత్రయంలో మధ్య శక్తి. మహాలక్ష్మీని ఉపాసిస్తే ఫలితాలు త్వరితంగా కలుగుతాయి. యాదేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా అంటే అన్ని జీవాలలోనూ ఉండే లక్ష్మీస్వరూపం దుర్గాదేవని చండీ సప్తసతి చెబుతోంది. శరన్నవరాత్రులలో మహాలక్ష్మిని పూజిస్తే సర్వ మంగళ మాంగల్యాలు కలుగుతాయి. లక్ష్మీదేవి అంటేనే సంపదకు ప్రతిరూపం! అందుకనే ఆ తల్లిని ‘శ్రీ మహాలక్ష్మి’ అని పిలుస్తారు. ‘శ్రీ’ అంటే సిరిసంపదలే. అమ్మవారిని పూజిస్తే ఎలాంటి కోరికైనా నెరవేరుతుందని నమ్మకం. అమ్మవారు అనుగ్రహించే వరాలను బట్టి ఆమెను ఎనిమిది రూపాలలో పూజిస్తారు. వాళ్లే అష్టలక్ష్ములు. దసరా సందర్భంగా మహాలక్ష్మిని కనుక పూజిస్తే ఈ అష్టలక్ష్ములంతా అనుగ్రహిస్తారు.
Also Read: రాజపుత్రుల జన్మస్థానంలో ఏం చేసినా రాజసమే-దసరా ఉత్సవాల నిర్వహణలో కూడా!
గులాబీ రంగు వస్త్రం - తెల్లని పూలతో పూజ
దసరా సమయంలో అమ్మవారిని గులాబి రంగు వస్త్రంతో అలంకరిస్తారు. ఇక పాలసముద్రం నుంచి ఉద్భవించినందుకు ప్రతీకగా ఆ తల్లికి తెల్లటి కలువలతో పూజ చేయాలి. తెల్ల కలువులతో పూజ చేయడం కుదరకపోతే అదే రంగులో ఉండే మల్లెలాంటి పూలతో అయినా అర్చించవచ్చు. ఇక అమ్మవారికి ఇష్టమైన క్షీరాన్ని గుర్తుచేసుకుంటూ పాలతో చేసిన పరమాన్నాన్ని నివేదించాలి. పరమాన్నం చేయడం కుదరని పక్షంలో అటుకులు, బెల్లం, కొబ్బరి కలిపిన ప్రసాదాన్ని కూడా సమర్పించవచ్చు. ఈ రోజు దానం చేస్తే ధనలక్ష్మి అంతకంతా ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుందట.
Also Read : శక్తి ఉపాసనలో బెంగాలీయులకే అగ్ర తాంబూలం, కోల్ కతాలో దసరా వేడుకలు మరింత ప్రత్యేకం!
ఈ రోజు లక్ష్మీదేవికి సంబంధించిన అష్టోత్తరం, శ్రీసూక్తం, కనకధారాస్తవం లాంటి స్తోత్రాలు చదువుకోవాలి.
లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేందర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరిసిజాం వందే ముకుంద ప్రియాం
శ్రీ లక్ష్మాష్టక స్తోత్రం
ఇంద్ర ఉవాచ –
నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే |
శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోఽస్తు తే || 1 ||
నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి |
సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే || 2 ||
సర్వజ్ఞే సర్వవరదే సర్వ దుష్ట భయంకరి |
సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే || 3 ||
సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని |
మంత్ర మూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే || 4 ||
ఆద్యంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి |
యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోఽస్తు తే || 5 ||
స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే |
మహా పాప హరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే || 6 ||
పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి |
పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమోఽస్తు తే || 7 ||
శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే |
జగస్థితే జగన్మాతః మహాలక్ష్మి నమోఽస్తు తే || 8 ||
మహాలక్ష్మష్టకం స్తోత్రం యః పఠేద్ భక్తిమాన్ నరః |
సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ||
ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనం |
ద్వికాలం యః పఠేన్నిత్యం ధన ధాన్య సమన్వితః ||
త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనం |
మహాలక్ష్మీ ర్భవేన్-నిత్యం ప్రసన్నా వరదా శుభా ||
[ఇంత్యకృత శ్రీ మహాలక్ష్మ్యష్టక స్తోత్రం సంపూర్ణమ్]
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)