(Source: ECI/ABP News/ABP Majha)
శివరాత్రి రోజున ఏ రాశి వారు ఎలాంటి పూజ చేయాలి?
మహాశివరాత్రి రోజున మీ రాశిని అనుసరించి ఎలాంటి పూజ చేయడం శ్రేయస్కరం?
శివ పురాణం చెప్పిన దాన్ని బట్టి శివరాత్రి రోజున అగ్నిలింగ ఆవిర్భావంతో సృష్టి ప్రారంభమైంది. అగ్ని లింగం అంటే ఆ మహా దేవుడి బృహద్రూపం. సంవత్సరంలో 12 శివరాత్రులు ఉన్నప్పటికీ ఫాల్గుణ మాసంలో వచ్చే ఈ శివరాత్రికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే ఇది మహా శివరాత్రి అయ్యింది. ఈరోజున శివారాధకులు పూర్తి భక్తి విశ్వాసాలతో శంకరుని కొలుచుకుంటారు. కొన్ని ప్రత్యేక నియమాలు పాటించడం వల్ల కోరికలు నెరవేరుతాయని నమ్మకం. మహాశివరాత్రి రోజున మీ రాశిని అనుసరించి ఎలాంటి శివారాధన చేసుకోవచ్చనే ఇక్కడ తెలుసుకుందాం.
మేషరాశి
మేషరాశి వారు ఎర్రచందనం, ఎరుపు రంగు పువ్వులతో శివ పూజ చేసుకోవాలి. తర్వాత ఓం నమోః నాగేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 51 లేదా 108 సార్లు జపించాలి.
వృషభ రాశి
వృషభ రాశి వారు మల్లెపూలతో శివారాధన చేసుకోవాలి. తర్వాత రుద్రాష్టకం చదువుకోవాలి.
మిథున రాశి
మిథున రాశి వారు ధాతురా, గంగా జలంతో శివాభిషేకం చేసుకోవాలి. ధాతురాను శివునికి సమర్పించే సమయంలో పంచాక్షరీ మంత్ర పఠనం చెయ్యాలి. ఓం నమః శివాయః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు జనపనారతో కలిపిన ఆవుపాలతో శివలింగానికి అభిషేకం చేసి రుద్రాష్టాధ్యాయిని పఠించాలి.
సింహ రాశి
సింహ రాశి వారు మహా శివరాత్రి నాడు ఎర్రని తామరలతో శివుడికి పూజ చేసుకోవాలి. శివాలయంలో శ్రీ శివ చాలీసా పారాయణం చెయ్యాలి.
కన్యా రాశి
కన్యారాశి వారు బిల్వపత్రం, ధాతురా, భాంగ్ వంటి పదార్థాలతో పూజచేసుకుని పంచాక్షరీ ఓం నమః శివాయః అనే మంత్రాన్ని జపించాలి. దీనితో పాటు శివ చాలీసాను కూడా పఠించాలి.
తులా రాశి
తులరాశి వారు మహాశివ రాత్రి రోజున శివాష్టకం పఠించాలి. దీనితోపాటు, పెరుగు లేదా చక్కెర మిఠాయి కలిపిన పాలతో శివలింగాన్ని అభిషేకించి శివ సహస్ర నామాన్ని పఠించాలి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు గులాబి పువ్వులు , బిల్వ పత్ర మాలతో శివ పూజ చేసుకోవాలి. తర్వాత రుద్రాష్టక స్తుతి చేసుకోవాలి. దీనితో పాటు ఓం అంగరేశ్వరాయ నమ: మంత్రాన్ని జపించాలి.
ధనస్సు రాశి
ధనస్సు రాశి వారు మహా శివరాత్రి రోజున పసుపు రంగు పూలతో శివ పూజ చెయ్యాలి. పాయసం ప్రసాదంగా సమర్పించుకోవాలి. శివాష్టకం పఠించాలి.
మకర రాశి
మకర రాశి వారు ధాతుర, భాంగ్, అష్టగంథ వంటి వాటితో పూజ చేసుకోవాలి. ఓం పార్వతి నాథాయ నమ: అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.
కుంభరాశి
కుంభరాశి వారు పాలు, పెరుగు, పంచదార, నెయ్యి, తేనేతో విడివిడిగా అభిషేకం చేసి ఓం నమ: శివాయ నమ: మంత్రాన్ని జపిస్తూ శివాష్టకం కూడా చదువుకోవాలి.
మీనరాశి
మీన రాశి వారు మహా శివరాత్రి రోజున శివలింగానికి పంచామృతం, పెరుగు పాలుతో అభిషేకం చేసుకోవాలి. పసుపు రంగు పూలను మహాదేవుడికి సమర్పించుకోవాలి. పూజ ముగిసిన తర్వాత గంధపు మాలతో ఓం భమేశ్వరాయ నమః మంత్రాన్ని 108 సార్లు జరిపించాలి.
Also Read: గరుడ పురాణం - ఆలస్యంగా నిద్రలేస్తే అన్ని కష్టాలా? లక్ష్మీదేవి కటాక్షించాలంటే ఏం చేయాలి?