Garuda Purana: గరుడ పురాణం - ఆలస్యంగా నిద్రలేస్తే అన్ని కష్టాలా? లక్ష్మీదేవి కటాక్షించాలంటే ఏం చేయాలి?
సనాతన ధర్మాన్ని రూపొందించిన అష్టాదశ పురాణాలలో గరుఢ పురాణం చాలా ముఖ్యమైందని చెప్పవచ్చు. ఈ పరురాణంలోని అన్ని పాఠాలు జీవిత దృక్పథాన్ని నిర్దేశిస్తాయి.
జీవితంలో చెయ్యవలసిన పనులు, చెయ్యకూడని పనులు ఎన్నో ఉంటాయి. కొన్నింటిని తప్పులుగా , మరి కొన్నింటిని పొరపాట్లుగా, ఇంకోన్నిటిని పాపాలుగా పరిగణిస్తారు. ఈ తప్పొప్పుల విషయాల గురించి మన పురాణాలలో చాలా సవివరంగా ఉంటుంది. సనాతన ధర్మాన్ని రూపొందించిన అష్టాదశ పురాణాలలో గరుడ పురాణం చాలా ముఖ్యమైందని చెప్పవచ్చు. ఇందులోని అన్ని పాఠాలు జీవిత దృక్పథాన్ని నిర్దేశిస్తాయి. ఆలోచనా సరళిని మారుస్తాయి. దైవత్వం సర్వ వ్యాపితమని సనాతన హిందూ ధర్మం చెబుతుంది. విష్ణుమూర్తి, గరుత్మంతుడి మధ్య జరిగే సంభాషణ గరుడ పురాణంగా ప్రాచూర్యంలో ఉంది.
గరుడ పురాణం జీవన్మరణాలు, పునర్జన్మల వంటి రహస్యమైన విషయాల గురించి తెలియజేస్తుంది. మరణం, ఆ తర్వాత జరిగే విషయాల గురించి, నరకం అక్కడి శిక్షల గురించి సమాచారం ఇందులో ఉంటుంది. అంతే కాదు వీటి నుంచి తప్పించుకునేందుకు జీవితంలో అనుసరించాల్సిన మార్గాలను కూడా వివరిస్తుంది. ఎలాంటి మార్గాలలో నడుచుకున్నపుడు జీవితం సుఖమయం అవుతుందో కూడా వివరిస్తుంది.
శ్రీమహా విష్ణువు గరుడ పురాణంలో వివరించిన దాన్ని బట్టి కొన్ని అలవాట్లు, నడవడికలు దారిద్ర్యానికి దారి తీస్తాయని వివరించారు. వీటిని త్వరగా వదిలించుకోవాలి. అంతేకాదు ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి అలవాట్లు ఉండకూడదు. తెలిసిన వారికి ఉంటే.. వారిని కూడా అప్రమత్తం చెయ్యాలని చెబుతోంది గరుడ పురాణం.
ఆలస్యంగా నిద్రలేస్తే?
ఈ రోజుల్లో చాలా మంది రాత్రి పొద్దుపోయే వరకు మెలకువగా ఉండడం, ఉదయం త్వరగా నిద్రలేవకపోవడం అలవాటు చేసుకున్నారు. పాండమిక్ తర్వాత చాలా మంది ఈ టైం టేబుల్ నుంచి బయట పడలేక పోతున్నారు. ఉదయం ఆలస్యంగా నిద్ర లేవడం శాస్త్ర సమ్మతం కాదు. ఉదయం ఆలస్యంగా నిద్ర లేచే వారు చురుకుగా ఉండలేరని, జీవితంలో పురోగతి సాధించలేరని పెద్దలు అంటుంటారు. ఎందుకంటే సోమరితనాన్ని మించిన జబ్బు మరొకటి లేదు. ఈ అలవాటు నుంచి బయటపడక పోతే నెమ్మదిగా ఆర్థిక స్థితి కుంటుపడుతుంది. ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని గరుడ పురాణం చెబుతోంది.
రాత్రిపూట ఎంగిలి పాత్రలను వదిలేస్తే?
గరుఢ పురాణం ప్రకారం రాత్రి పడుకునే ముందు వంట గదిలో ఎంగిలి పాత్రలను ఎప్పుడూ ఉంచకూడదు. ఇలా చెయ్యడం వల్ల శని ప్రభావం ఎక్కువై జీవితంలో కష్టాల పాలవుతారని చెబుతోంది. అంతేకాదు ఇలాంటి ఇంట్లోకి లక్ష్మీ దేవి రావడానికి ఇష్టపడదు. రాత్రి పడుకునే ముందుగానే రాత్రి భోజనానికి ఉపయోగించిన పాత్రలను శుభ్రం చేసుకోవాలని గరుఢ పురాణం సూచిస్తుంది.
అపరిశుభ్ర దుస్తులు ధరిస్తే?
శుభ్రంగా లేని బట్టలు కట్టుకోవడం కూడా లక్ష్మీదేవికి కోపం తెప్పించే పనుల్లో ఒకటి. ఎక్కడా శుచి, శుభ్రత ఉంటుందో అక్కడే లక్ష్మీ నివాసం. అందుకే ఉదయం స్నానం తర్వాత శుభ్రమైన ఉతికిన దుస్తులు ధరించాలి. ఇది లక్ష్మీ కటాక్షానికి అతి ముఖ్యం.
ఇతరుల కష్టార్జితాన్ని అనుభవిస్తే?
కొంత మంది ఇతరుల కష్టార్జితాన్ని తాము అనుభవించాలని, లాక్కోవాలని కుటిలమైన ఆలోచనలు చేస్తారు. ఇలాంటి వారికి ఎప్పటికీ ఆనందం దొరకదు. ఇలాంటి వారి మీద లక్ష్మీ కటాక్షం ఎన్నటికీ ఉండదు. కష్టపడి డబ్బు సంపాదించే వారినే లక్ష్మీ దేవి అనుగ్రహిస్తుంది.
ఉద్దేశపూర్వకంగా కీడు తలపెడితే?
ఉద్దేశపూర్వకంగా ఇతరులకు నష్టం చెయ్యాలని, కీడు తలపెట్టాలని చూసే వారిని కూడా లక్ష్మీ దేవి ఏనాడు అనుగ్రహించదని గరుడపురాణం చెబుతోంది. అలాంటి వారికి ఎప్పడూ అర్థిక ఇబ్బందులు వేధిస్తుంటాయట. ఎటువంటి కారణం లేకుండా కోపం ప్రదర్శించడం, ఇతరులను అవమానించడం చెయ్యకూడదు. ఇది దారిద్ర్యానికి కారణం అవుతుందని శ్రీమహా విష్ణువు వివరించారు. ప్రశాంతమైన ప్రదేశాలలో మాత్రమే లక్ష్మీ నివసించడానికి ఇష్ట పడుతుంది.