Lord Vishnu Names: శ్రీమహా విష్ణువు వివిధ నామాలు, వాటి అర్థం, ప్రాముఖ్యత మీకు తెలుసా?
Lord Vishnu Names: శ్రీమహా విష్ణువును రకరకాల నామాలతో పిలుస్తారు. విష్ణువుకున్న అనేక నామాలు ఏమిటి? విష్ణువు ప్రతి పేరు వెనుక అర్థం ఏమిటి? దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా?
Lord Vishnu Names: హిందూ ధర్మంలో అధిక మాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అధికమాసం అని పిలిచే ఈ మాసంలో శ్రీమహావిష్ణువును ఆరాధించేలా పూర్తిగా విష్ణువుకు అంకితం చేశారు. హిందూధర్మంలో అచ్యుత, జనార్దన, శ్రీహరి, నారాయణ, అనంత మొదలైన అనేక పేర్లతో విష్ణువును పిలుస్తారు. శ్రీహరి ప్రతి పేరు దాని సొంత నేపథ్యంతో పాటు ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటుంది. విష్ణువు అనేక పేర్లలో నారాయణుడు ఒకటి. నారద మహర్షుల నోటి నుంచి ఈ పేరు మనం తరచుగా వింటూ ఉంటాము. విష్ణువును నారాయణ అని ఎందుకు అంటారు? ఈ పేరు ప్రాముఖ్యత ఏమిటి?
1. పురుషోత్తమ
జగన్నాటక సూత్రధారి అయిన శ్రీ మహా విష్ణువును పురుషోత్తముడు అంటారు. అంటే మనుషులలో ఉత్తముడు. విష్ణుమూర్తికి ఉన్న ఈ పేరు అతని అనేక అవతారాలలో ఒకదానిని సూచిస్తుంది.
Also Read : శివుడు, విష్ణువులు వేర్వేరా? పురాణాలు ఏం చెబుతున్నాయి?
2. అచ్యుత
అచ్యుత అంటే ఎప్పటికీ నశించనివాడు లేదా శాశ్వతంగా అమరుడు. విష్ణువు భూమిపై శాశ్వతుడు కాబట్టి ఆయనకు ఈ పేరు పెట్టారు.
3. హరి
విశ్వం పతనమైనప్పుడల్లా విష్ణువు వివిధ అవతారాలు ధరించి భూమిని రక్షిస్తాడని భక్తుల విశ్వాసం. అందుకే విష్ణువును విశ్వ రక్షకుడిగా పేర్కొంటారు. హరి అంటే ఒక వ్యక్తికి ఉన్న అన్ని బాధలను తొలగించేవాడు. యజ్ఞాలలో మంత్రాలలో ఆ స్వామిని ఆవాహన చేస్తారు. అప్పుడాయన తన యజ్ఞభాగాన్ని తాను హరిస్తాడు. అంటే స్వీకరిస్తాడు. అలాగే ఆయన శరీర వర్ణం హరితం. ఈ వర్ణంతో ఉన్నందువల్ల, తన యజ్ఞభాగాలను తాను స్వీకరిస్తున్నందువల్ల హరి అనే పేరు వచ్చింది.
4. నారాయణ
పురాణాలలో చెప్పినట్లుగా నారదుడు విష్ణువును నారాయణ.. నారాయణ అని పిలిచాడు. నారా అనేది నీటికి పర్యాయపదం, సంస్కృతంలో భగవంతుడిని ప్రత్యేక సందర్భాలలో నర అని కూడా పిలుస్తారు. నీరు మొదటి అధిష్ఠానం లేదా నివాసం. వైకుంఠ ధామంలో క్షీరసాగరంలో నివసించే శ్రీ హరితో ఈ నీటికి గాఢమైన అనుబంధం ఉంది. అందుకే శ్రీహరిని నారాయణ అని కూడా అంటారు.
5. విష్ణువు
లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన విష్ణువు కన్నులు తామరపువ్వులవంటివి. కౌస్తుక పూసలతో అలంకరించి, చతుర్భుజాలలో వివిధ ఆయుధాలను ప్రయోగించి విశ్వమంతటా తన శక్తిని ప్రదర్శిస్తాడు. అందుకే నారాయణుడిని విష్ణువు అంటారు.
6. హృషీకేశుడు
విష్ణుపూజలో వినిపించే ఓ మధురమైన నామం హృషీకేశుడు. జగత్తుకంతటికీ హర్షాన్ని ప్రసాదించేవారు అగ్నిసోములు అని పిలుపులందుకుంటున్న సూర్యచంద్రులు. వీరినే హృషీ అని కూడా అంటారు. సూర్యచంద్రుల కిరణాలను హృషీకేశాలు అని అనటం కూడా ఉంది. ఈ మొత్తం అర్థాన్ని కలిపి చూస్తే సూర్యచంద్రుల కిరణాలు కేశాలుగా ఉన్నవాడు అనే అర్థం వస్తుంది. అలా ఉన్నవాడే శ్రీమన్నారాయణుడు.
7. గోవింద
పూర్వం భూమండలమంతా రసాతలానికి వెళ్లిపోయింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపాన్ని ధరించి భూమిని పైకి ఉద్ధరించాడు. అందుకే ఆయనకు గోవిందుడు అని పేరొచ్చింది. గాం విందతి ఇతి గోవిందః అనే దానికి అర్థం భూమిని ప్రప్తింపచేసిన వాడు అని. అందుకే గోవిందుడయ్యాడు.
Also Read : సాక్షాత్తు ఆ విష్ణు స్వరూపమే ‘సాలగ్రామం’ - ఇలా పూజిస్తే మీ కష్టాలన్నీ మాయం!
8. అజుడు
విష్ణువును అజుడు అని అంటారు. అదెలాగంటే ఆ స్వామికి ఆది, అంతాలు లేవు. స్వయంభువు. ప్రాణుల శరీరాలలో క్షేత్రజ్ఞుడైన ఆత్మగా ఉంటాడు. అందుకే అజుడు అని పేరొచ్చింది.
పైన పేర్కొన్న అనేక కారణాల వల్ల విష్ణువును వివిధ పేర్లతో పిలుస్తారు. విష్ణువు ప్రతి పేరుకు దాని సొంత ప్రాముఖ్యం, ప్రత్యేకత ఉంది.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.