Dhanurmasam Special: పల్లె అందాలు, ఆలయాల విశిష్టత, భగవంతుడి గొప్పతనం వివరించే పాశురాలు.. అవే తిరుప్పావై!
Thiruppavai Pasuram: ధనుర్మాసంలో వైష్ణవ ఆలయాల్లో పాశురాలు ఆలపిస్తారు. గోదాదేవి రాసిన ఈ 30 పాశురాలను తిరుప్పావై అంటారు. ఇంతకీ ఈ పాశురాల అర్థం, ఆలపించాల్సిన విశిష్టత ఏంటో తెలుసా..
Dhanurmasam Special Thiruppavai: గోదాదేవిగా జన్మించిన ఆండాళ్ శ్రీ రంగనాథుడిని భర్తగా భావించి ఆయన్ను చేరుకునేందుకు సంకల్పించిన వ్రతమే తిరుప్పావై. తిరు అంటే శ్రీ అని పావై అంటే వ్రతం అని అర్థం. ఈ తిరుప్పావైలో పాశురాలుంటాయి. పాశురం అంటే ఛందోబద్ధంగా ఉన్న పాటలు అని అర్థం. ఆండాళ్ అపురూప భక్తి పారవశ్యాన్ని శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్తమాల్యద అనే గ్రంథంగా పొందుపరిచారు.
సృష్టిలో భగవంతుడొక్కడే పురుషుడు..మనుషులంతా స్త్రీలు అనే ఉద్దేశంతో శ్రీనివాసుడిని శ్రీవారు అని సంబోధిస్తారు. అలాంటి శ్రీ మహావిష్ణువును భర్తగా పొందాలనే తలంపుతో గోదాదేవి ధనుర్మాసంలో చేసిన తిరుప్పావై వ్రతాన్ని మహిళలు ఆచరిస్తుంటారు. ధనుర్మాసం మొదటిరోజున ఈ వ్రతాన్ని ఆరంభించి..భోగి రోజు ఆండాళ్-శ్రీరంగనాథుడి కల్యాణంతో వ్రతం ముగిస్తారు.
తిరుప్పావై వ్రతం చేసేవారు ..ధనుర్మాసం నెల రోజులూ సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానమాచరించి స్వామివారి కీర్తలను, తిరుప్పావై పాశురాలు ఆలపించాలి. నిత్యం స్వామివారికి పొంగల్ నివేదనగా సమర్పించాలి
Also Read: తెలుగు రాష్ట్రాల్లో ధనుర్మాసం ప్రారంభం -తిరుమల సహా వైష్ణవాలయాల్లో తిరుప్పావై పారాయణం
ఆండాళ్ అంటే ఎవరు?
శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం భక్తిలో మునిగితేలే వారిని ఆళ్వారులు అని పిలుస్తారు. మొత్తం 12 మంది ఆళ్వారుల్లో మొదటివాడు విష్ణుచిత్తుడు. మిథులా నగరాధిపతి జనకమహారాజు భూమి దున్నే సమయంలో సీతాదేవి దొరికినట్టు శ్రీరంగనాథుని పూజకు పూలకోసం సాగుచేసే తోటలో తులసి వనం మధ్యలో చిన్నారి ఆండాళ్ కనిపించింది. దేవతలు మాత్రమే కొలువై ఉండే తులసివనంలో ప్రత్యక్షమైన ఆ చిన్నారి భూదేవి అంశ అని చెబుతారు. ఆండాళ్ అసలు పేరు కోదై...కోదై అంటే మాలిక అని ఆ పేరు గోదా గా మారింది.
పాశురాలు ఏంటి?
శ్రీ రంగనాథుడిపై ప్రేమతో గోదాదేవి రచించిన 30 పాశురాల ఆంతర్యం ఏంటంటే.. మంచి అలవాట్లతో జీవించమని, తోటివారికి సాయపడమని, భగవంతుడిని ఆరాధించమని చెబుతాయ్. రోజుకో పాశురం చొప్పున మొత్తం 30 రోజులు గానం చేస్కారు.
Also Read: 108 వైష్ణవ క్షేత్రాల్లో మొదటిది.. దేశంలోనే అతి పెద్ద ఆలయం ..ధనుర్మాసంలో దర్శించుకుంటే జన్మ ధన్యం!
1 - 5 పాశురాలలో..
ఉపోద్ఘాతం, తిరుప్పావై గొప్పతనాన్ని తెలియజేస్తాయి. మనస్ఫూర్తిగా భగవంతుడిని పూజిస్తే ప్రకృతి పులకరిస్తుందని, వానలు కురిసి పంటలు పండుతాయని..తద్వార దేశం సుభిక్షంగా ఉంటుందని అర్థం.
5 నుంచి 15 పాశురాలలో..
గోదాదేవి చెలులతో కలిసి పూలు సేకరిస్తూ...మరోవైపు పల్లె అందాన్ని వర్ణిస్తుంది. పక్షుల సందడి, రంగురంగుల పూలు, వెన్న చిలకడంలో వచ్చే సంగీతం, ఆలమందల చిరుగంటల సవ్వడి, ఆలయాల్లో వినిపించే వేదమంత్రాల గురించి ఉంటుంది. చెలులు ఒక్కొక్కర్ని నిద్రలేపుతూ శ్రీ మహావిష్ణువు అవతారాలను వివరిస్తుంటుంది గోదాదేవి.
15 నుంచి 20 పాశురాలలో..
గోదాదేవి తన చెలులతో కలిసి ఆలయాలకు వెళ్లడం, భగవంతుడిని నిద్రలేందుకు సుప్రభాతం ఇవన్నీ ఉంటాయి. ఆలయ పరిరక్షకుల అనుమతితో లోపలకు అడుగుపెట్టి శ్రీ కృష్ణుడిని కీర్తించిన తర్వాత..కృష్ణుడి అష్టమహిషుల్లో ఒకరైన నీలాదేవిని దర్శించుకుంటారు.
20 నుంచి 29 పాశురాలలో
20 నుంచి 29 ...ఈ తొమ్మిది పాశురాల్లో భగవంతుడి గొప్పతనం గురించి వివరిస్తుంది గోదాదేవి.
Also Read: 12 ఏళ్లకోసారి విభీషణుడు సందర్శించే ఆలయం ఇది.. ధనుర్మాసంలో స్వామి వైభవం చూసితీరాల్సిందే!
ఆఖరి పాశురంలో
చివరిగా చెప్పే 30వ పాశురంలో తనని తాను పరిచయం చేసుకోవడంతో పాటూ.. నీపై భక్తితో నేను ఇవన్నీ రచించి పాడానని వివరిస్తుంది. వీటిని ఎవరైతే భక్తితో ఆలపిస్తారో వారిపై భగవంతుడి కృప ఉంటుందని కూడా చెబుతుంది.