Dhanurmasam : తెలుగు రాష్ట్రాల్లో ధనుర్మాసం ప్రారంభం -తిరుమల సహా వైష్ణవాలయాల్లో తిరుప్పావై పారాయణం
Tiruppavai In Tirumala and Yadagiri Gutta: ధనుర్మాసం ప్రారంభమైంది. ఉదయాన్నే లేచిన భక్తులు గోదాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. తిరుప్పావై ప్రవచనాలు చేశారు.
Dhanurmasam Starts: తెలుగు పల్లెలకు సంక్రాంతి కళ వచ్చేసింది. ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యే ధనుర్మాసం సంక్రాంతి సందడిని తీసుకొచ్చింది. వణికిస్తున్న చలిలో ప్రజలంతా ఉదయాన్నే లేచి తలస్నానమాచరించి ధనుర్మాస పూజలు ప్రారంభించారు. వైష్ణవాలయాల్లో పాశులా మంత్రాలు జపించి గోదాదేవికి ప్రత్యేక పూజలు చేశారు.
ధనుర్మాసం ఇవాళ్టి నుంచి భోగి పండగ వరకు ఉంటుంది. రోజూ గోదాదేవికి భక్తులు పూజలు చేస్తారు. ఆఖరి రోజున అంటే భోగి పండగ నాడు గోదాశ్రీరంగనాథుల కల్యాణం నిర్వహించి పూజను ముగిస్తారు. మధ్యలో వచ్చే ముక్కోటి ఏకాదశి నాడు ఉపవాస దీక్షలు చేస్తారు భక్తులు. అది ఈసారి డిసెంబల్ 26న వచ్చింది.
సంక్రాంతి వేడుకలు ప్రారంభానికి సూచికగా ధనుర్మాసనం ప్రారంభం రోజునే నెల గంట మోగుతుంది. ఇవాళ్టి నుంచే గ్రామాల్లో హరిదాసుల కీర్తనలు వినిపిస్తాయి. డూడూ బసవన్న విన్యాసాలు కనిపిస్తాయి. ఇంటి ముంగిట రంగవల్లులు దర్శనమిస్తాయి.
సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే వరకు కాలాన్ని ధనుర్మాసంగా చెబుతారు. ఈ టైంలో సూర్యుడు ధనుస్సులోకి ప్రవేశిస్తాడు దాన్ని సూచించేలా ఆలయాల్లో గంటను మోగిస్తారు. దీన్నే నెల గంట అంటారు. అప్పటి నుంచి ప్రతి రోజూ వైష్ణవ ఆలయాల్లో వేకువ జామున 4గంటల నుంచి పూజలు చేస్తారు.
తిరుమలలోని వెంకటేశ్వర స్వామి ఆలయం, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానంలో కూడా ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. యాదగిరిగుట్ట ఆలయంలో ఉదయం నుంచి 30 రోజుల పాటు ఉదయం 5 గంటలకు తిరుప్పావై నిర్వహిస్తారు. జనవరి 13న గోదా కళ్యాణం, 14 న ఒడిబియ్యం కార్యక్రమంతో జరగుతుంది.
తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఏడాది పొడవునా సుప్రభాత సేవను తెల్లవారుజామున సమర్పించినప్పటికీ ఈ నెల రోజుల పాటు మాత్రం సుప్రభాతం కాకుండా తిరుప్పావై పారాయణం చేస్తారు. తనను తాను ద్వాపర యుగానికి చెందిన శ్రీదేవి చిన్న విగ్రహం పక్కనే ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామివారి వక్షస్థలంపై ధనుర్మాసం చివరి వరకు బంగారు చిలుకను అలంకరిస్తారు. తిరుప్పావై పూర్తిగా ఏకాంతంగా పఠిస్తారు. ధనుర్మాస సమయంలో భగవంతుడికి సహస్ర నామార్చన కోసం పవిత్రమైన తులసికి బదులుగా బిల్వ ఆకులను ఉపయోగిస్తారు.
పవిత్ర ధనుర్మాసాన్ని జనవరి 13వ తేదీ వరకు తిరుపతితోపాటు దేశవ్యాప్తంగా 232 కేంద్రాల్లో తిరుప్పావై ప్రవచనాలు చేయనున్నారు. టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసింది. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం, కెటి రోడ్డులోని శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలో తిరుప్పావై ప్రవచనాలు పారాయణం చేశారు.
భాగవతం దశమ స్కందంలో చెప్పినట్టు 12 మంది ఆళ్వారులలో ఒకరైన శ్రీ గోదాదేవి ధనుర్మాసం వ్రతం చేశారు. ఈ వ్రతం చేయడం వల్ల దేశం సమృద్ధిగా, సుభిక్షంగా ఉంటుంది. ద్వాపరయుగంలో గోపికలు ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణుని కృపకు పాత్రులయ్యారని చెబుతారు.
ఈ వ్రతం ఎలా చేయాలనే విషయాన్ని శ్రీ గోదాదేవి 30 పాశురాలతో కూడిన తిరుప్పావై దివ్యప్రబంధాన్ని లోకానికి అందించారు. భగవంతునికి సేవ చేయడమే ఈ తిరుప్పావై సారాంశం. ఈ వ్రతం ఒకరు చేయడం కంటే అందరినీ కలుపుకుని చేస్తే ఫలితం ఉంటుందని పండితులు చెబుతారు . ఈ సంప్రదాయం ప్రకారం దేశవ్యాప్తంగా గల అన్ని వైష్ణవ దేవాలయాల్లో తిరుప్పావై శాత్తు మొర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.