Dhanteras 2022: సులభంగా లక్ష్మీ కటాక్షం కావాలంటే ఈ ధనత్రయోదశి రోజున ఈ వస్తువులను దానం చేయండి
ధన త్రయోదశి రోజున మంగళకరమైన వస్తువులు కొనుగోలు చేయడం సంగతి మనకు తెలిసిందే. అయితే కొన్నిరకాల వస్తువులను అవసరం ఉన్నవారికి దానం చేస్తే మరింతగా లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుందని చెబుతున్నారు పండితులు.
దేశంలో చాలా చోట్ల దీపావళి పండుగను నరకచతుర్దశి, దీపావళి అంటూ రెండురోజులు మాత్రమే జరుపుకుంటున్నప్పటికీ ఇప్పటికీ కొన్నిప్రాంతాలలో కొంతమంది ధన త్రయోదశి, నరకచతుర్ధశి, దీపావళి అంటూ మూడు రోజుల పాటు జరుపుకుంటుండగా మరికొంత మంది ధనత్రయోదశి, నరకచతుర్థశి, దీపావళి, గోవర్ధన పూజ (బలిప్రతిపద), యమద్వితీయ అంటూ ఐదు రోజుల పాటు దీపావళి పండుగను జరుపుకుంటున్నారు.
దీపావళికి రెండు రోజుల ముందు వచ్చే ఆశ్వయిజ శుద్ద త్రయోదశే ధన త్రయోదశి. ఈరోజుకు పౌరాణిక ప్రశస్తి ఎంతో ఉంది. ఆరోజున మహాలక్ష్మీ దేవి ఉద్భవించిన రోజు. దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరమధనం చేయు సమయంలో ఆ పాలసముద్రం నుంచి మహాలక్ష్మి ఉద్భవించింది. అందుకే ఆమెను క్షీర సముద్ర రాజ తనయ అన్నారు. సర్వ సంపద ప్రదాయిని అయిన శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం సర్వ మానవాళి ఈ రోజున శ్రీమహాలక్ష్మిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి, ఆమె ఆశీసులు అందుకుంటారు. మహాలక్ష్మి అంటే ధనానికి ప్రతిరూపం. అందుకే ఆరోజును ధనత్రయోదశి అనే పేరుతో పిలుస్తాం.
అయితే ఇక ఈరోజు ముఖ్యంగా బంగారం, వెండి, కుంకుమ, పసుపు, పట్టు చీరలులాంటి సౌభాగ్య వస్తువులని కొంటారు. దాన్ని లక్ష్మీరూపకంగా భావించి పూజిస్తారు. దాంతో పాటూ ఇంటికి శుభాన్నిచ్చే రకరకాల వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. అయితే కేవలం అవి మాత్రమే కాదు ఈరోజు కొన్ని రకాల వస్తువులను దానం చేస్తే, ఇంట్లో ఆర్థిక బాధలు తొలిగిపోయి మహాలక్ష్మీ దేవి అనుగ్రహానికి పాత్రులవుతారట. మరి ఆ వస్తువులేంటో తెలుసుకోండి.
లోహ దానం
ధన త్రయోదశి రోజున ఇనుమును లేదా దానితో తయారు చేసిన వస్తువులను దానం చేయాలి. అందులో ఇనుముతో చేసిన ఏదైనా విగ్రహాన్ని దానం చేయడం చాలామంచిది. దీనివల్ల ఇంట్లో ఉన్న దారిద్ర్యం తొలగిపోయి, కలిసి వస్తుంది. అయితే ఈరోజున ఇనుమును, దానితో తయారు చేసిన ఏ వస్తువును కొనుగోలు చేయరాదు. అలా చేస్తే మీరు దారిద్ర్యానికి స్వాగతం పలికినట్లే. ఒకవేళ ధనత్రయోదశి రోజున ఇనుమును మీరు దానం ఇవ్వాలనుకుంటే ముందు రోజే కొని ఉంచుకోవాలి.
నూతన వస్త్రాలు ఇవ్వడం
ధనత్రయోదశి రోజు బట్టలు ఇవ్వాలంటారు. కానీ చాలామంది ఇంట్లో ఉన్న పాతబట్టలను దానం చేస్తుంటారు. అలా చేయడం తప్పు. పేదవారు కూడా సంతోషంగా పండగ జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో బట్టలను దానం చేయాలంటారు. అందుకని వారికి ఈరోజు నూతన వస్త్రాలను దానం చేయాలి, కానీ పాతబట్టలను కాదు. ఇలా బట్టలను దానం చేయడం వల్ల లక్ష్మీ దేవి సంతుష్టురాలవుతుంది. సులభంగా లక్ష్మీ కటాక్షం కలిగి మీ ఇంట సంపద పెరుగుతుంది.
ధాన్యాలను ఇవ్వడం ద్వారా
ధనత్రయోదశి రోజున బియ్యం, గోధుమలు, జొన్నలు మొదలైన ధాన్యాలను అవసరం ఉన్న వ్యక్తులకు ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే ఈరోజున అన్నదానానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యంగా లక్ష్మీదేవికి ప్రతీపాత్రమైన వడలు, పాయసం, క్షీరాన్నం, పూరీ ఇలాంటివి దానం చేయాలి. మిఠాయిలను పంచాలి. అలాగే పూజకు పెట్టే ప్రసాదాన్ని నలుగురికీ పంచాలి. ఈ విధంగా అన్నదానం చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది.
Also Read: కార్తీకమాసంలో రెండో రోజు యమ ద్వితీయ, ఈ రోజు ఎంత ప్రత్యేకమో తెలుసా!