Dattatreya Jayanti 2022: అనసూయ మహా పతివ్రత ఎందుకంటే!
Datta Jayanthi 2022: మార్గశిర పౌర్ణమి రోజున దత్తాత్రేయ స్వామి జయంతిగా జరుపుకుంటారు. సప్త ఋషులలో ఒకరైన అత్రి మహర్షి అనసూయ దంపతులకు మార్గశిర పూర్ణిమ రోజున త్రిమూర్తుల అంశంతో దత్తాత్రేయుడు జన్మించాడు.
Datta Jayanthi 2022: త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అవతారమైన దైవ స్వరూపులు. దత్తా అంటే సమర్పించుకోవడం అనే అర్థం కూడా. త్రిమూర్తులు అత్రి మహర్షి, అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము "సమర్పించుకున్నారు" కనుకే దత్తా అని ... అత్రి కుమారుడు కాబట్టి "ఆత్రేయ" ..అలా.. దత్తాత్రేయుడిగా పిలుస్తారు. దత్త జయంతి ప్రాముఖ్యత ఏంటంటే.. ఉపవాసం, జపం, ధ్యానం, పారాయణం, ప్రార్థనలు. ఈ రోజు దత్త చరిత్ర, గురు చరిత్ర, అవధూత గీత, జీవన్ముక్త గీత, శ్రీపాదవల్లభ చరిత్ర, నృసింహసరస్వతి చరిత్ర, షిర్డి సాయిబాబా చరిత్ర, శ్రీదత్తదర్శనం పారాయణ చేస్తారు.
దత్తాత్రేయ ఆవిర్భావం
ఒకసారి లోక కళ్యాణార్థం నారదుడు ఆడిన చతురోక్తికిలోనైన లక్ష్మీ, సర్వస్వతి, పార్వతిమాతలు..మహాపతివ్రత అయిన అనసూయపై ఈర్ష్య అసూయ ద్వేషం పెంచుకున్నారు. నారద మహర్షి అనసూయ "పాతివ్రత్యాన్ని" పొగడడాన్ని వారు సహించలేకపోయారు. వారి వారి పత్నులను తక్షణం ఆ అనసూయ ఆశ్రమానికి వెళ్ళి ఆమె పాతివ్రత్యాన్ని భగ్నం చేయమని ప్రార్థించారు. త్రిమూర్తులు ఎంతవారించినా వారు పట్టించుకోలేదు. చేసేది లేక సన్యాస వేషం ధరించి అత్రి ఆనసూయ ఆశ్రమానికి వెళ్లారు. వారు అక్కడ అడుగుపెట్టడంతోనే భూదేవి పులకించింది, పూలు, పళ్లు నైవేద్యం అన్నట్టు నేలరాలాయి. ప్రకృతి మొత్తం పులకరించిపోయింది
ఇదంతా చూసిన త్రిమూర్తులు...ఇంత చక్కని ప్రకృతి అందాలకు ఈ వాతావరణంలో ఉంటున్న భూలోకవాసులు అదృష్టవంతులు. మనం కూడా చిన్నారి బాలురులా మునిబాలకులతో కలసి ఆడుకుంటే బావుండును అనుకుంటారు. అంతలోనే భార్యలకు ఇచ్చిన మాట గుర్తొచ్చి ఆశ్రమం వైపు వెళతారు.
Also Read: చెడు పనులు చేస్తే బొగ్గు - మంచి పనులు చేస్తే బహుమతి, ఆ దేశంలో శాంటాక్లాజ్ బదులు మంత్రగత్తె
గృహస్థురాలిగా అత్రి మహర్షికి సేవలు చేస్తూ, అతిధి అభ్యాగతులను అదరిస్తూ.. ముల్లోకాలను అబ్బురపరుస్తున్న అనసూయను చూసినంతనే త్రిమూర్తులు ముగ్ధులయ్యారు. వారిని సాదరంగా ఆహ్వానించింది అనసూయ. స్వాగత సత్కారాలు అనంతరం భోజనానికి రమ్మని పిలిచింది. వడ్డన ప్రారంభించేందుకు సమాయత్తమవుతున్న అనసూయతో...దుస్తులు ధరించకుండా నగ్నరూపంలో వడ్డిస్తేనే తాము భుజిస్తామన్నారు త్రిమూర్తులు. ఆ మాట విని అనసూయ నివ్వెరపోయింది. ఆ తర్వాత కళ్లు మూసుకుని తన ప్రత్యక్షదైవమైన భర్తకు నమస్కరించుకుంది. ఆమె జ్ఞాననేత్రం తెరుచుకుంది.. సన్యాసరూపంలో ఉన్నది త్రిమూర్తులు అని తెలుసుకుంది. వారి అంతర్యమేంటో గ్రహించిన అనసూయ...ముల్లోకాలను ఏలే సృష్టి, స్థితి, లయకారకులైన వీరు యాచకులులా వచ్చారా...వీరిని తృప్తిపరిస్తే ముల్లోకాలు కూడా ఆనందింప చేసిన భాగ్యం నాకు కలుగుతుంది కదా అని ఆలోచిస్తుంది.
ఓ వైపు పాతివ్రత్యం, మరోవైపు అతిథిసేవ. ఈ రెండు ధర్మాలను ఏకకాలంల్లో సాధించడమెలా? అనుకుంటూ పతికి నమస్కరించి ఆయన కమండలంలో ఉదకం త్రిమూర్తుల శిరస్సున చల్లింది. వెంటనే అ ముగ్గురు పసిపిల్లలుగా మారిపోయారు.వెంటనే అనసూయలో మాతృత్వం పొంగి...ఆ ముగ్గురు బాలురకు ఆకలి తీర్చింది. ఇంతలో ఋషి కన్యలు, ఋషిబాలురు కలిసి మెత్తని పూల పానుపుతో ఊయలవేయగా! వారికి జోలపాడుతూ నిదురపుచ్చింది. ఆ వింత దృశ్యాన్ని చూసిన అత్రి మహర్షి తుళ్లిపడి అంతలోనే తేరుకుని తన దివ్య దృష్టితో జరిగినది, జరగబోతున్నది గ్రహించుకున్నాడు. ఈ త్రిమూర్తులు ఆశ్రమ ప్రవేశ సమయంలోనే చిన్నారి బాలురం అయిపోతే బావుండును అన్న మాటలే బ్రహ్మవాక్కుగా కార్యరూపం దాల్చాయి. మునిబాలురతో కలసి ఆడుకున్నారు.
Also Read: డిసెంబర్ నెల ఈ 5 రాశులవారికి బావుంది, ఆ రాశివారికి అత్యద్భుతంగా ఉంది
లక్ష్మీ, సరస్వతి, పార్వతి మాతలకు భర్తల ఆచూకీ తెలియక గుబులు పుట్టింది. అంతలో దేవర్షి నారదునివల్ల అత్రిమహర్షి ఆశ్రమమందు జరిగిన వింత తెలుసుకున్నారు. దానితో అనసూయపై ఏర్పడిన "ఈర్ష్య అసూయ - ద్వేషాలు" పటాపంచలు అయ్యాయి. వెంటనే వారి స్వరూపాలతోనే అనసూయ అత్రిముని ఆశ్రమానికి చేరుకున్నారు. అప్పటికి త్రిమూర్తులను ఊయలలో పడుకోబెట్టి జోలపాడుతోంది అసూయ. ఆ ముగురమ్మలను చూసి సాదరంగా ఆహ్వానించింది. తమకు పతిబిక్ష పెట్టమని అడిగితే... మీ భర్తలను గుర్తించి తీసుకెళ్లండని చెప్పింది అనసూయ.ఒకే వయస్సుతో, ఒకేరూపుతో, అమాయకంగా నోట్లో వేలేసుకుని నిద్రిస్తున్న అ జగన్నాటక సూత్రధారులను ఎవరు? ఎవరో? గుర్తించుకోలేక పోయారు. తల్లీ! నీ పాతివ్రత్య దీక్షను భగ్నం చేయ్యాలని "ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో!" మేము చేసిన తప్పిదాన్ని మన్నించి మా భర్తలకు దయతో స్వస్వరూపాలు ప్రసాదించమని ప్రాధేపడతారు. అంత ఆ అనసూయమాత తిరిగి పతిని తలచుకుని కమండలోదకము తీసి వారిపై చల్లడంతో మళ్లీ త్రిమూర్తులు సాక్షాత్కరించారు.
అనసూయకు వరం
ఈ ఆశ్రమవాస సమయమందు మీరు కన్న తల్లి దండ్రులకన్నా మిన్నగా పుత్రవాత్సల్యాన్ని పంచిపెట్టారు. మీకు ఏం వరంకావాలో కోరుకోమంటారు. ఈ పుత్ర వాత్సల్యభాగ్యాన్ని మీకు మీరుగా ఇచ్చారు..అది మాకు శాశ్వతంగా ఉండేలా అనుగ్రహించండి అని వరం కోరుకున్నారు. శ్రీ మాహవిష్ణువు, బ్రహ్మ, శివుడు వారి వారి అంశలను "దత్తనారాయణు"నికి యిచ్చారు. అప్పటి నుంచీ త్రిమూర్తి స్వరూపంగా "శ్రీ దత్తాత్రేయ" స్వామిగా అవతారించారు.