Bhadrachalam: వైకుంఠ ఏకాదశికి సిద్ధమవుతోన్న దక్షిణ అయోధ్య.. భద్రాద్రిలో ఉత్తర ద్వార దర్శన ఏర్పాట్లు!
Bhadrachalam Mukkoti Utsavalu 2025: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మరోవైపు ముక్కోటి ఏకాదశి వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు
Bhadrachalam Mukkoti Ekadashi 2025: భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ పరిసరాలు సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. కరకట్ట, రామాలయ పరిసర ప్రాంతాలు, సూపర్‌బజారు సెంటర్, బ్రిడ్జి పాయింట్‌లో భక్తులకు స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. గోదావరి తీరంలో హంసవాహనాన్ని సిద్ధం చేస్తున్నారు.
డిసెంబర్ 31న ప్రారంభమైన అధ్యయనోత్సవాలు జనవరి 20 వరకూ జరగనున్నాయి. అధ్యయనోత్సవాల్లో భాగంగా మొదటి తొమ్మిది రోజుల పాటూ శ్రీరామచంద్రుడు రోజుకో అలంకారంలో బక్తులకు దర్శనమిస్తాడు. జనవరి తొమ్మిదో తేదీన తెప్పోత్సవం, జనవరి 10 ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారి ఉత్తరద్వార దర్శనం ఉంటుంది.
Also Read: వైకుంఠ ఏకాదశికి తిరుమల వెళ్లలేనివారు.. హైదరాబాద్ ఈ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం చేసుకోండి!
అధ్యయనోత్సవాల్లో తొమ్మిదిరోజులు స్వామివారు తొమ్మిది అలంకారాల్లో దర్శనమిస్తారు. డిసెంబర్ 31 నుంచి జనవరి 3 వరకూ వరుసగా మత్స్య అవతారం, కూర్మ అవతారం, వరాహ అవతారాలు పూర్తయ్యాయి. నాలుగో రోజైన జనవరి 3 శుక్రవారం స్వామివారు నారసింహ అవతారంలో దర్శనమిచ్చారు. తొలుత స్వామివారిని ఆలయంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత నిత్యకల్యాణ మండపానికి తీసుకొచ్చారు. అక్కడ పూజాధికాలు పూర్తిచేసి వేద విన్నపాలు సమర్పించారు. అనంతరం మిథిలా స్టేడియానికి మేళతాళాల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చారు. ప్రియభక్తుడైన ప్రహ్లాదుడిని బాధలు పెట్టిన హిరణ్యకశిపుడిని సంహరించేందుకు నారాయణుడు నారసింహావతారాన్ని ధరించాడని పురాణాల్లో ఉంది. ఈ అలంకారంలో ఉన్న స్వామివారిని దర్శించుకుంటే కుజ గ్రహ బాధలు తొలగిపోతాయని విశ్వాసం.
అధ్యయన ఉత్సవాల్లో ఐదో రోజు అయిన జనవరి 04 శనివారం వామన అవతారంలో దర్శనమిస్తారు సీతారాములు. మధ్యాహ్నం మహానివేదన అనంతరం కోలాట నృత్యాలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో తిరువీధి సేవ జరిపిస్తారు.
జనవరి 8తో స‌్వామివారి దశావతారాలు పూర్తవుతాయి. చివరి రోజు రోజున శ్రీరామచంద్ర స్వామి వారు శ్రీకృష్ణుడి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. జనవరి 9న పవిత్ర గోదావరి నదిలో తెప్పోత్సవం జరగనుంది...ఈ మేరకు హంసవాహనం సిద్ధం చేయిస్తున్నారు అధికారులు.
Also Read: లోహ్రి, ఖిచ్డీ, మాఘి, సంక్రాంతి..పేరేదైనా పండుగ సందడి ఒకటే.. ఏ రాష్ట్రంలో ఎలా జరుపుకుంటారంటే!
దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రిలో జరిగే వైకుంఠ ఏకాదశి (vaikunta ekadashi) ఉత్సవాలకు భక్తులు భారీగా తరలివస్తారు. జనవరి 10 తెల్లవారుజామున 5 గంటలకు ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమివ్వనున్నారు స్వామివారు. ఈ మేరకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీద్దిదిద్దుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ ప్రాంగణం మొత్తం చలువ పందిళ్లు, మామిడితోరణాలు, పూలమాలలతో అలంకరిస్తున్నారు. వీఐపీలకోసం ప్రత్యేక సెక్టార్లు ఏర్పాటు చేస్తున్నారు. శ్రీరామచంద్రుడి లడ్డూ ప్రసాదం విక్రయించేందుకు ప్రత్యేక కౌంటర్లను సిద్ధం చేస్తున్నారు. మరోవైపు పర్ణశాల రామాలయం కూడా ముక్కోటి వేడుకలకు ముస్తాబవుతోంది..
శ్రీ రామ చంద్రం శిరసా నమామి
శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్న దీపం
ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి
Also Read: కరవు, యుద్ధం, పకృతి వైపరీత్యాలు, అంటు వ్యాధులు..2025లో జరగబోయే ఈ సంఘటనలు ప్రపంచాన్ని వణికిస్తాయ్!