Balkampet Yellamma kalyanam 2024: కన్నులపండువగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం - పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి సురేఖ, హాజరైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
Yellamma kalyanam Balkampet 2024: ఏటా ఆషాఢ మాసం మొదటి మంగళవారం బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది జూలై 09 మంగళవారం కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది.
Balkampet Yellamma kalyanam 2024: బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం ఘనంగా జరుగింది. జూలై 08 సోమవారం ప్రారంభమైన ఈ వేడుకలు మూడు రోజుల పాటూ కన్నులపండువగా జరుగుతున్నాయి. జూలై 08 సోమవారం ఉదయం గణపతి పూజతో కల్యాణోత్సవ కార్యక్రమాలు ఘనంగా మొదలయ్యాయి. సాయంత్రం అమ్మవారికి ఎదుర్కోళ్లు నిర్వహించారు. వేడుకల్లో ముఖ్యమైన కళ్యాణోత్సవం మంగళవారం ఉదయం కన్నులపండువగా నిర్వహించారు. అమ్మవారికి 27 చీరలు, స్వామివారికి 11 పంచెలతో అలంకరించారు. కళ్యాణ మహోత్సవానికి భారీగా భక్తులు తరలివచ్చారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున స్వామీఅమ్మవార్లకు దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ పట్టువస్త్రాలు సమర్పించారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు.
ఆలయ అభివృద్ధికి ప్రత్యేక నిథులు - కిషన్ రెడ్డి
అమ్మవారి కల్యాణోత్సవాన్ని ప్రత్యక్షంగా చూడడం అదృష్టం అన్న కిషన్ రెడ్డి.. కేంద్ర ప్రభుత్వం తరఫున ఆలయ అభివృద్ధికి నాలుగున్నర కోట్లు నిధులు మంజూరు చేశామని చెప్పారు. ఆ నిధులతో త్వరలో ఆలయం అభివృద్ధి పనులు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, అంటువ్యాధులు, అనారోగ్యాలు లేకుండా ప్రజలను చల్లగా చూడాలని ఎల్లమ్మతల్లికి మొక్కుకున్నానని చెప్పారు కిషన్ రెడ్డి. వేలాది భక్తులు కళ్యాణోత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు...ఆలయ అధికారులు చేసిన ఏర్పాట్లు చాలా సంతృప్తికరంగా ఉన్నాయన్నారు.
Also Read: పూరీ జగన్నాథుడి విగ్రహంలో ఉన్న బ్రహ్మపదార్థం కృష్ణుడి గుండె..ఈ ప్రచారంలో నిజమెంత!
జూలై 10 రథోత్సవంతో వేడుకలు ముగింపు
భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తుండడంతో ఆలయ అధికారులు ఆ స్థాయిలోనే ఏర్పాట్లు చేశారు. గతేడాది 10 లక్షలమందికి పైగా భక్తులు ఎల్లమ్మ కళ్యాణ వేడుక, తదనంతర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ ఏడాది కూడా అంతకుమించిన సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేసిన అధికారులు...ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ను కంట్రోల్ చేసేందుకు ఆలయం చుట్టుపక్కల ప్రధాన రహదారులు మూసివేశారు.ఈ ఆంక్షలు బుధవారం రాత్రి 8 గంటలవరకూ కొనసాగనున్నాయి. ఆలయం వద్దకు వచ్చేందుకు హైదరాబాద్ ప్రధాన మార్గాల నుంచి ఆర్టీసీ 80 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. జూలై 10 బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు మహాశాంతి చండీ హోమం, సాయంత్రం ఆరు గంటలకు ఎల్లమ్మ రథోత్సవంతో వేడుకలు ముగియనున్నాయి.
Also Read: వెన్నుచూపి పారిపోయిన కర్ణుడు పరాక్రమవంతుడా? సినిమాలు చూసి మోసపోకండి..ఇదిగో నిజం!
స్వయంభువుగా వెలసిన ఎల్లమ్మ
భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతోన్న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారు.. 700 సంవత్సరాల క్రితం స్వయంభువుగా వెలసింది. హైదరాబాద్ నగరం ఏర్పడకముందు చుట్టూ పొలాల మధ్య బల్కంపేట చిన్న గ్రామంగా ఉండేది. ఓ రైతు తన పొలంలో బావిని తవ్వుతూ ఉండగా అమ్మవారి ఆకృతి కనిపించింది. భక్తితో ఆ విగ్రహాన్ని ఒడ్డుకు చేర్చాలని ప్రయత్నించినా, కదలకపోవడంతో ఊళ్లోకెళ్లి జనాన్ని తీసుకొచ్చినా కదలించలేకపోయారు. ఇక అక్కడే పూజలు చేయాలని నిర్ణయించి బావి ఒడ్డునే పూజలు చేసేవారు. రాను రాను అమ్మవారి మహిమ గురించి తెలుసుకుని వచ్చే భక్తుల సంఖ్య పెరగడంతో అక్కడే ఆలయం వెలిసింది. రాజా శివరాజ్ బహద్దూర్ అనే సంస్థానాధీశుడి హయాంలో ‘బెహలూఖాన్ గూడా’ గా పిలిచే ఈ ప్రాంతం ...బల్కంపేటగా మారింది. అమ్మవారి విగ్రహం శిరసుభాగం వెనుక నుంచి నిత్యం జలధార ప్రవహిస్తూ ఉంటుంది. ఆ పవిత్ర జలాన్నే భక్తజనం మహాతీర్థంగా భాలించి స్వీకరిస్తారు.. ఆ నీటిని ఇంట్లో చల్లితే అనారోగ్యాలు రావని, చెడు దృష్టి సోకదని భావిస్తారు. ప్రతి ఆదివారం, మంగళవారం భారీగా భక్తులు ఎలమ్మను దర్శించుకుంటారు..