Ayyappa Deeksha 2023: అయ్యప్ప మండల దీక్ష తర్వాత మాలధారుల్లో రావాల్సిన మార్పులివే!
Ayyappa Mandala Deeksha: అయ్యప్ప మాల ఎందుకు వేసుకుంటారు? 41 రోజుల దీక్ష వెనుకున్న ఆంతర్యం ఏంటి? మాలధారులు పాటించాల్సిన నియమాలేంటి? మండల దీక్ష పూర్తయ్యేసరికి ఎలాంటి మార్పులు రావాలి?..
Ayyappa Deeksha 2023
నియమాల మాలతో సుగుణాల మెట్లపై నడిపించు కనిపించు అయ్యప్ప స్వామి
మకర సంక్రాంతి సజ్యోతిపై అరుదెంచి మహిమలను చూపించు మణికంఠ స్వామి
కర్మ బందము బాపు ధర్మ శాస్త్ర కలి భీతి తొలగించు భూతాధినేత
అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః
కార్తీకమాసం మొదలు మకరసంక్రాంతి వరకూ ఎక్కడ చూసినా అయ్యప్ప భక్తులు తన్మయత్వమే. 41 రోజుల పాటూ అత్యంత నియమ నిష్టలతో దీక్ష చేస్తారు. మండల దీక్ష పూర్తయ్యే వరకూ కఠిన నియమాలు పాటిస్తారు. ఈ నియమాలన్నింటి వెనుకా కేవలం భక్తి మాత్రమే కాదు..ఎన్నో ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి.
నేలపై నిద్ర
అయ్యప్ప మాలదారులు నేలపై నిద్రిస్తారు. 41 రోజుల పాటూ ఈ నియమం పాటించడం వల్ల వెన్నునొప్పి తగ్గుతుంది, కండరాలు పటిష్టంగా ఉంటాయి. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
చన్నీటి స్నానం
సాధారణంగా చన్నీటిస్నానం ఆరోగ్యానికి మంచిది. పైగా బ్రహ్మముహూర్తంలో నిద్రలేవడం..ఆ సమయంలో చన్నీటి స్నానం చేయడం వల్ల శరీరంలో నాడీ వ్యవస్థ ఉత్తేజితమవుతుంది.ముఖంలో ప్రశాంతత కనిపిస్తుంది
Also Read: ఈ 6 రాశులవారు ఏ జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలంటే!
క్రమశిక్షణ
సమయానికి నిద్రలేవడం..స్నానానంతరం..పీఠం పెట్టిన ఆవరణ మొత్తం దీపకాంతులతో నింపేస్తారు. శరణు ఘోషతో మారుమోగిపోతుంది. ఇదోరకమైన యోగా అనే చెప్పాలి. శ్రద్ధగా పూజ చేయడం వల్ల క్రమశిక్షణ అలవడుతుంది. సామూహికంగా కలిసి ఉండటం ద్వారా క్రమశిక్షణ అలవడుతుంది. ఇతర భక్తులతో ఇచ్చిపుచ్చుకునే స్వభావం మరింత పెరుగుతుంది.నిత్యం రెండు పూటలా దుస్తులు మార్చడం ద్వారా పరిశుభ్రమైన దుస్తులు ధరించడం అలవాటవుతుంది.
ఆలోచనా సామర్థ్యం మెరుగుపడుతుంది
మాలధారులు అధిక ప్రసంగాలకు, వివాదాలకు దూరంగా ఉండటం వల్ల సమయం వృధారాదు. అయితే స్వామి ఆరాధన లేదంటే తమ తమ పనులు పూర్తిచేయడం శ్రద్ధ ఉంటుంది. అనవసర చర్చలకు దూరంగా ఉండడం వల్ల మెదడులో మరో ఆలోచనకు తావుండదు. ఫలితంగా మంచి ఆలోచనా సామర్థ్యం మెరుగుపడుతుంది.
Also Read: మీ రాశిప్రకారం కార్తీకమాసంలో మీరు దర్శించుకోవాల్సిన క్షేత్రం ఇదే!
మితాహారం
ఒక్కపూట భోజనం చేయడం వల్ల మితాహారం అలవాటు అవుతుంది. పైగా శాఖాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
పొగ తాగడం, మద్యపానం వంటి దురలవాట్లకు దూరంగా ఉండటం ద్వారా ఆరోగ్యం, మనసు, ఆలోచనలు మెరుగుపడుతుంది .
నల్ల దుస్తులు
అయ్యప్ప స్వామి దీక్షలో భాగంగా నల్లని వస్త్రాలు ధరిస్తారు. ఎందుకంటే శనీశ్వరుడికి నల్లని రంగు అంటే అత్యంత ఇష్టం. ఆ రంగు బట్టలని ధరించి నిత్య పూజలో పాల్గొనేవారిపై శనిప్రభావం ఉండదని చెబుతారు. అంతేకాదు సాధారణంగా అయ్యప్ప మాల శీతాకాలంలో వేస్తారు.. ఈ సమయంలో నల్లని దుస్తులు శరీరానికి వేడినిస్తాయి.
మాలలు
అయ్యప్ప దీక్ష తీసుకున్న వారు మాలలు ధరిస్తారు. రుద్రాక్ష, తులసి, చందనం, స్పటికం, పగడాలు, తామర పూసల మాలలు వేసుకుంటారు. ఈ మాలలు శారీరక, మానసిక ఆరోగ్యాన్నిస్తాయి. వీటికి అభిషేకం చేసి మంత్రోఛ్చారణ ద్వారా వాటికి అయ్యప్ప స్వామిని ఆవాహనం చేసి త్రికరణశుద్ధిగా స్వామిని సేవిస్తున్నా అని చెప్పి వేసుకుంటారు.
Also Read: అయ్యప్ప ఆలయంలో 18 మెట్లు దేనికి సంకేతం - ‘పదునెట్టాంబడి’ విశిష్ఠత ఏంటి!
గంధం
కనుబొమ్మల మధ్య భాగంలో “సుషుమ్న” అనే నాడి ఉంటుంది. ఈ నాడి జ్ఞానాన్నిస్తుందని..దాన్ని ఉత్తేజితం చేసేందుకే ఆ ప్రదేశంలో గంధం, కుంకుమ ధరిస్తారని చెబుతారు.
నేను అన్న భావన నశించిపోయేందుకే
అయ్యప్ప దీక్ష చేపట్టగానే నేను అన్న భావన నశించిపోతుంది. దేహానికి ఉన్న పేరు, ధరించే దుస్తులు, తినే ఆహారం, శారీరక సౌఖ్యాలు, ఆచార వ్యవహారాలు, దినచర్య అన్నీ ఒకే ఒక దీక్షతో మారిపోతాయి. అందుకే దీక్ష చేపట్టగానే ఆ వ్యక్తి పేరు అంతర్థానమై భగవతుండి స్వరూపంగా భావించి 'స్వామి' అని పిలుస్తారు. జీవులన్నిటిలోను దేవుడున్నాడనే భావంతో కూడా 'స్వామి' అని పిలవాలని అయ్యప్ప దీక్షలో నియమాన్ని విధించారు.
అయితే కేవలం 41 రోజుల మండల దీక్షలో ఈ నియమాలన్నీ పాటించి ఆ తర్వాత మళ్లీ మాములూగా మారిపోవడం కాదు..ఇదే పద్ధతిని కొనసాగించాలన్నదే దీక్ష ఆంతర్యం... దీక్షకు స్వీకరించడానికి ముందున్న ప్రతికూల ఆలోచనలు, దుర్గుణాలు, అవలక్షణాలు ను పూర్తిగా విడిచిపెట్టి మున్ముందు జీవితం సాగించాలన్నదే అసలు ఉద్దేశం. ఇదో పని కాదు..ప్రతిజ్ఞలా ఉండాలి...
ఒక్క మాటలో చెప్పాలంటే మానవుడు మాధవుడిగా పరివర్తన చెందే క్రమమే అయ్యప్ప మండల దీక్ష