Ayudha Pooja 2023: దసరాకి ఆయుధ పూజ ఎందుకు చేస్తారో తెలుసా!
శరన్నవరాత్రుల్లో చివరి మూడు రోజులు అత్యంత ముఖ్యమైనవి. కొందరు దుర్గాష్టమి రోజు ఆయుధ పూజ చేస్తే...మరికొందరు మహర్నవమి...ఇంకొందరు దశమి రోజు ఆయుధపూజ చేస్తారు. ఇంతకీ ఆయుధ పూజ ఎందుకు చేస్తారో తెలుసా?
![Ayudha Pooja 2023: దసరాకి ఆయుధ పూజ ఎందుకు చేస్తారో తెలుసా! ayudha pooja 2023 vijayadashami festival to in telanagna and andhra pradesh Ayudha Pooja 2023: దసరాకి ఆయుధ పూజ ఎందుకు చేస్తారో తెలుసా!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/23/0ad6b0cc51f1270fb6fe46433a3e306d1698044684503217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ayudha Pooja 2023: ప్రతి మనిషి తను చేసే పనికి ఉపయోగించే వస్తువు ఏదో ఒకటి ఉంటుంది. అది ఆ మనిషి ఆయుధం అని చెప్పవచ్చు. ఆయుధం సమర్థవంతంగా ఉంటే ఆ పనిలో సగం విజయం సాదించినట్టే. తనకు విజయాన్ని చేకూర్చినందుకు కృతజ్ఞత చెప్పుకుంటూ ఆయుధాలకు జరిపే పూజనే ఆయుధపూజ.
ఆయుధ పూజ వెనుక కథనం
మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి ప్రయత్నం చేసిన త్రిమూర్తులు మహిషాసురుడికి మగవాడి వల్ల మరణం లేదనే వరం గుర్తుచేసుకుని అమ్మవారిని మహిషాసురుడితో యుద్ధం చేయమని పంపుతారు. అమ్మవారి శక్తి పెంపొందడనికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురూ తమ శక్తిని ధారపోస్తారు. ఆ శక్తిని నింపుకున్న అమ్మవారు మరింత శక్తివంతురాలవుతుంది. అలాగే మిగిలిన దేవతలు తమతమ ఆయుధాలను అమ్మవారికి ఇచ్చి మరింత పటిష్టం చేస్తారు. ఎనిమిది చేతులతోనూ, ఆ ఎనిమిది చేతులలో ఆయుధాలు ధరించి, సింహవాహనం మీద యుద్దానికి వెళ్తుంది అమ్మవారు. లోకాన్ని తన రాక్షసత్వంతో ముప్పుతిప్పలు పెడుతున్న ఆ మహిషాసురుడితో భీకర యుద్ధం చేసి అన్ని ఆయుధాలు ఉపయోగించి చివరకు వాడిని అంతం చేస్తుంది. ఇలా యుద్ధం పూర్తయ్యాక ఉగ్రరూపంలో ఉన్న అన్నవారిని మహిషాసురమర్ధిని స్తోత్రాన్ని సకల దేవలు అలపించి శాంతిపచేసి అమ్మవారి దగ్గర ఉన్న ఆయుధాలను తిరిగి తీసుకుని వాటిని శుద్ధి చేసి, యుద్ధంలో విజయం చేకూర్చినందుకు కృతజ్ఞతగా ఆయుధాలకు పూజ చేస్తారు. ఇదే ఆయుధపూజ వెనుక ఉన్న కథనం.
Also Read: మీ బంధుమిత్రులకు ఈ కోట్స్ తో దసరా శుభాకాంక్షలు తెలియజేయండి
ఆయుధ పూజ ఎప్పటి నుంచి మొదలైంది
దేవతలు, రాక్షసుల మధ్యన జరిగిన యుద్ధంలో ఉత్తరాషాడ శ్రవణం నక్షత్రాల మధ్య అభిజిత్ లగ్నంలో దేవతలు రాక్షసులపై విజయం సాధించారు. ఆసందర్భాన్ని పురస్కరించుకుని విజయదశమికి ఆయుధాలకు పూజలు నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోంది. మహిషాసుర మర్దిని అవతారంలో దుర్గాదేవి రాక్షసులను సంహరిస్తుంది. పాండవులు అరణ్యవాసం ముగించి, అజ్ఞాతవాసానికి వెళ్తూ జమ్మిచెట్టు కొమ్మల మధ్య తమ ఆయుధాలను దాచివెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత అర్జునుడు జమ్మిచెట్టుపై దాచిన ఆయుధాలను తీసి, పూజించి, ఉత్తర గోగ్రహణ యుద్ధం చేశాడు. శత్రువులను జయించి విజయం సాధించాడు. అప్పటి నుంచి ఆయుధాలకు రక్షణ కల్పించిన జమ్మిచెట్టు పవిత్రత పెరిగింది. కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొనేందుకు అర్జునుడు జమ్మిచెట్టు తొర్రలో దాచి ఉంచిన ఆయుధాలను విజయదశమికి ఒకరోజు ముందు క్రిందికి తీసి పూజలు నిర్వహించి యుద్ధానికి బయలు దేరతాడు. ఆయుద్ధంలో విజయం సాధించటంతో ఆ విజయాలకు గుర్తుగా అప్పటి నుంచి ఆయుధపూజ ప్రారంభమైందని మరో కథనం ప్రాచుర్యంలో ఉంది.
Also Read: పండుగల సమయంలో ఉల్లి, వెల్లుల్లి తినకూడదు అంటారెందుకు!
అపమృత్యు దోషం ఉండదు
లలిత సహస్ర నామాల్లో చెప్పినట్టు 'సర్వేశ్వరీ సర్వ మయి సర్వ మంత్ర స్వరూపిణి' అంటే సర్వ యంత్రాల్లనూ, మంత్రాల్లోనూ, తంత్రాల్లనూ అన్నిచోట్లా లలితామాత ఉందని అర్థం. ఆయుధ పూజ చేయడం ద్వారా అమపృత్యు దోషాలుండవని, వాహన ప్రమాదాలు జరగవని నమ్మకం. అందుకే వ్యాపారులు, ఉద్యోగులు, ఇతర వృత్తి పనివారంతా దుర్గాష్టమిరోజు తాము ఉపయోగించే పనిముట్లను,యంత్రాలను, వాహనాలను శుభ్రం చేసుకుని వాటిలో చైతన్య రూపంలో ఉండే శక్తి స్వరూపిణిని మననం చేసుకుంటూ పూజలు చేస్తారు. పోలీసులు తాము వినియోగించే లాఠీ,తుపాకులు వాహనాలు - రైతులు అయితే కొడవలి,నాగలి, వాహనం ఉన్న వారు తమ వాహనాలకు - టైలర్లు కుట్టు మిషన్లకు, చేనేత కార్మికులు మగ్గాలకు, ఫ్యాక్టరీలలో కార్మికులు తమ మిషన్లకు, ఇతర పనిముట్లకు పసుపు, కుంకుమలతో, పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)