Araikasu amman: విలువైన వస్తువులు, పత్రాలు పోగొట్టుకుంటే ఈ అమ్మవారిని ప్రార్థిస్తే దొరుకుతాయట
అరై కాసు అమ్మన్ ..అంటే.. సగం నాణెం తల్లి. అమ్మవారి పేరు విచిత్రంగా ఉందేంటి, అసలీ పేరు ఎందుకొచ్చింది, ఆ అమ్మవారి ప్రత్యేకత ఏంటి...ఆలయం ఎక్కడుంది..ఈ విశేషాలు మీకోసం
ఏదైనా ఆపద వచ్చినప్పుడో,ఏవైనా వస్తువులు పోయినప్పుడో భగవంతుడిపై భక్తి ఎక్కువైపోతుంది. బాధలన్నీ చెప్పుకుని ఉపశమనం కల్పించాలని కోరుకుంటారు. అవన్నీ తీరుతాయో లేదో అనే విషయం పక్కనపెడితే చాలామందికి ఈ సెంటిమెంట్ ఉంటుంది. అయితే తమిళనాడు రాష్ట్రం రత్నమంగళంలో కొలువైన అరై కాసు అమ్మన్ కి మొక్కుకుంటే మాత్రం ఎంతటి కష్టమైనా తీరిపోతుందట. మరీ ముఖ్యంగా విలువైన వస్తువులు, పత్రాలు పోగొట్టుకున్నవారు అరైకాసు అమ్మన్ ని ప్రార్థిస్తే అవి దొరుకుతాయని విశ్వాసం.
ఈ పేరెలా వచ్చింది
అరై కాసు అమ్మన్ అంటే సగం నాణెం తల్లి.ఈ పేరు ఎందుకొచ్చిందంటే...పుదుక్కోట దగ్గరున్న గోకర్ణంలో ప్రగడాంబాల్ అనే అమ్మవారు కొలువు తీరి పూజలందుకుంటోంది. ఒకసారి విజయనగరాన్ని పాలిస్తున్న రాజు ఒక ముఖ్యమైన పత్రాన్ని పోగొట్టుకున్నాడు. ఎంత వెదికినా అది దొరక్కపోవడంతో ప్రగడాంబాల్ అమ్మవారిని ప్రార్ధించాడు. ఆ తర్వాత ఆ పత్రం దొరికింది. సంతోషించిన రాజు అమ్మవారికి కృతజ్ఞతగా ఆవిడ రూపాన్ని అరకాసు విలువైన నాణెంపై ఓ వైపు ముద్రించి...వాటిని పండుగలు, ప్రత్యేక దినాల్లో రాజ్యంలో ప్రజలకు పంచిపెట్టేవాడు. అప్పటి నుంచి అరైకాసు అమ్మగా మారిపోయింది. ప్రజల్లో కూడా అమ్మవారి పట్ల విశ్వాసం పెరిగింది. పోయిన వస్తువుల గురించి అమ్మవారికి మొరపెట్టుకోవడం అవి దొరకడంతో మరింత నమ్మకం పెరిగింది.
అమ్మవారి మహిమ తెలిపే మరో సంఘటన
తమిళనాడులో రత్నమంగళలో లక్ష్మీ కుబేర ఆలయం ఉంది. ఏటా కళ్యాణోత్సవం సమయంలో అత్యంత విలువైన లక్ష్మీదేవి ఆభరణం ఒకటి కనిపించలేదు. ఎంత వెతికినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. దీంతో ఆ ఆలయ మేనేజింగ్ ట్రస్టీ అరై కాసు అమ్మవారిని ప్రార్ధించి, ఆ ఆభరణం దొరికితే అరైకాసు అమ్మకి అక్కడ ఆలయం నిర్మిస్తానని మొక్కుకున్నారట. ఆ తర్వాత ఆభరణం దొరకడంతో ట్రస్ట్రీ కుబేర ఆలయం సమీపంలోనే అరై కాసు అమ్మన్ కి ఆలయం నిర్మించారు.
Also Read: ఏడు జన్మలకు గుర్తుగా ఏడు ద్వారాలు, అజ్ఞానాన్ని పోగొట్టి ముక్తిని ప్రదర్శించే శక్తి స్వరూపం
ప్రస్తుతం అరైకాసు అమ్మ పీఠం తమిళనాడులోనే కాక ఇతర ప్రాంతాల్లోనూ ప్రసిద్ధి చెందింది. అవివాహితులు, పిల్లలు లేనివారు, కుటుంబ సభ్యులెవరైనా తప్పిపోయినప్పుడు ...అమ్మవారికి మొరపెట్టుకుంటే మంచి ఫలితాలు పొందుతున్నారు. ముఖ్యంగా మంగళ, శుక్ర, ఆదివారాలు, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో అమ్మవారిని పూజిస్తే కోరికలు తప్పక నెరవేరుతాయని నమ్మకం. ఈ రోజుల్లో అమ్మవారి దగ్గరున్న 108 పత్రాల్లోంచి భక్తులు ఒక దానిని తీసుకోవటానికి అనుమతిస్తారు. ఆ కాగితంలో ఉన్న సూచనల ప్రకారం వారి కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం. దీనినే దేవ ప్రశ్న అంటారు. ఆలయంలో అమ్మవారితో పాటూ వినాయకుడు, క్షేత్ర పాలకుడు కరుప్పన్ లను దర్శించుకోవచ్చు.
Also Read: ఇంట్లో ఆదిశగా దీపం పెడితే అన్నీ అపశకునాలే
Also Read: మీరు తినే ఆహారంపైనా నవగ్రహాల ప్రభావం ఉంటుందని తెలుసా