(Source: ECI/ABP News/ABP Majha)
Chanakya Niti: స్నేహమైనా, బంధమైనా ప్రారంభంలోనే ఈ అంశాలు గమనించాలి
chanakya niti: వియ్యానికైనా, కయ్యానికైనా సమ ఉజ్జీలు ఉండాంటారు. అదే విధంగా స్నేహానికైనా, బంధానికైనా కొన్ని లక్షణాలు గమనించిన తర్వాతే ముందుకు వెళ్లాలని చాణక్యుడు తెలిపాడు.
Chanakya niti: సజ్జనుల సహవాసం ఎప్పుడూ మంచిదే. చెడ్డవారితో కలిసి ఉంటే జీవితం కూడా అంతే చేదుగా ఉంటుందనేది నిజం. ఆ విధంగా, మనం ఎవరితో స్నేహం లేదా బంధాన్ని పెంచుకుంటామనేది చాలా ముఖ్యం. కానీ, ఎవరితో సహవాసం చేయాలో, ఎవరితో సహవాసం చేయకూడదో తెలుసుకోవడం ఎలా...? దానికి ఆచార్య చాణక్యుడు అద్భుతమైన సలహాలు ఇచ్చాడు.
స్నేహం చేసే ముందు...
ఆచార్య చాణక్యుడు గొప్ప జ్ఞాని. తెలివైన దౌత్యవేత్త. ఆయన నైతికత ప్రతి ఒక్కరి జీవితానికి స్ఫూర్తిదాయకం. చాణక్య నీతి ఇతరుల వ్యక్తిత్వాన్ని సరిగ్గా గుర్తించే సామర్థ్యాన్ని పెంపొందించడానికి, తప్పు ఒప్పులను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఒకరిని చూసి మీరు వారిని పూర్తిగా అంచనా వేయలేరు. మనం వారిని నిశితంగా గమనించాలి. స్వర్ణకారుడు బంగారాన్ని వేడి చేయడం, రుద్దడం, కోయడం వంటి చర్చల ద్వారా దాని స్వచ్ఛతను పరీక్షించే పద్ధతిని అనుసరించినట్లే.. ఇతరుల గుణాలు, లోపాలను కూడా గమనించాలని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. కాబట్టి స్నేహమైనా, బంధమైనా ప్రారంభించే ముందు ఏయే అంశాలను గమనించాలో తెలుసుకుందాం.
Also Read: శత్రువుపై విజయం సాధించాలంటే ఈ విషయాలను గుర్తుంచుకోండి
త్యాగం
ఒకరి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడానికి మనం అతని త్యాగాలను చూడాలని ఆచార్య చాణక్యుడు సూచించాడు. అంటే ఎదుటివారి బాధలకు స్పందించే వారు సహృదయులు. ఇతరుల బాధలకు ప్రతిస్పందనగా తమ ఆనందాన్ని త్యాగం చేసేవారు ఖచ్చితంగా మంచివారు. అలాంటి వారి స్నేహం, సహవాసం చాలా బాగుంటుంది. అయితే, మీరు సంతోషంగా ఉన్నప్పుడు మీతో ఉన్నవారు, మంచి స్నేహితులు అని భావించేవారు.. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు పారిపోతారు, ఖచ్చితంగా వారు మీ నుంచి దూరంగా ఉంటారు. అలాంటి వ్యక్తుల స్నేహం మనల్ని కష్టాల్లో పడేస్తుంది. కష్ట సమయాల్లో కూడా మీతో ఉండి మీకు ధైర్యాన్ని ఇచ్చే వారి స్నేహం చాలా ముఖ్యమే కాదు చాలా అవసరం. ఇది జీవితానికి ఒక చోదక శక్తిలా పని చేస్తుంది.
ప్రవర్తన
మానవ వ్యక్తిత్వాన్ని అతని ప్రవర్తన ఆధారంగా గుర్తించవచ్చని ఆచార్య చాణక్యుడు తెలిపాడు. కాబట్టి, మీరు ఎవరితోనైనా స్నేహం చేయాలనుకుంటే, వారి ప్రవర్తనను బాగా అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే, మంచి నడవడిక ఉన్నవారు ఎప్పుడూ అన్ని రకాల చెడు విషయాలకు దూరంగా ఉంటారు. అంతేకాకుండా వారు ఎవరినీ మోసం చేయరు,. కష్టకాలంలో చేయి వీడరు. వారి స్నేహం ఖచ్చితంగా మెరుగ్గా ఉంటుంది. అందువల్ల స్నేహాన్ని కొనసాగించే ముందు ఎదుటివారి ప్రవర్తనను అర్థం చేసుకోవడం కూడా అవసరం. కానీ, దుష్ప్రవర్తన కలిగిన వారు స్నేహితులను మోసం చేయవచ్చు, అందువల్ల మీరు ఇబ్బందుల్లో పడవచ్చు లేదా కష్ట సమయాల్లో మిమ్మల్ని ఒంటరిగా వదిలివేయవచ్చు.
గుణగణాలు
మంచి నడవడిక ఉన్నవారిలో మంచి లక్షణాలు కూడా ఉంటాయి. అలా మంచి లక్షణాలున్న వారి స్నేహం జీవితానికి బలాన్నిస్తుంది. ఒక వ్యక్తిలోని గుణగణాలు అతని వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడానికి మనకు చాలా సహాయపడతాయి. అబద్ధాలు, అహంకారం, మోసం చేసే వారికి దూరంగా ఉండటం మంచిది. వారి తప్పులు మిమ్మల్ని కూడా ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి.
Also Read: గంగా పుష్కరాలకు కాశీ వెళుతున్నారా - టెంట్ సిటీలో రూమ్స్ ఇలా బుక్ చేసుకోండి
వ్యక్తిత్వం
ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని అతని చర్యల ద్వారా గుర్తించవచ్చని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. నిజాయితీపరులు, నీతి మార్గాన్ని అనుసరించేవారు, కష్టపడి సంపాదించుకునే వారు ఖచ్చితంగా మంచి మనసు కలిగి ఉంటారు. వారి స్నేహం చాలా బాగుంటుంది. కానీ తప్పుదారిపట్టిన వారు, తప్పుడు మార్గాల్లో సంపాదించేవారు, చెడ్డవారి సహవాసంలో దారితప్పిన వారితో ఎప్పుడూ స్నేహం చేయవద్దు. వారి సహాయం కూడా ఎప్పుడూ కోరుకోవద్దు. ఇతరులకు చేసినట్లే వారు మీకు కూడా కీడు చేయగలరు. అందుచేత వారికి దూరం పాటించడం చాలా మంచిదని చాణక్యుడు తెలిపాడు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించగలరు.