chanakya niti in telugu: శత్రువుపై విజయం సాధించాలంటే ఈ విషయాలను గుర్తుంచుకోండి
chanakya niti in telugu: శత్రువును ఓడించాలంటే ధైర్య సాహసాలతో పాటు సరైన ఆలోచన, సంయమనం తప్పనిసరి అని చాణక్యుడు తెలిపాడు. శత్రువు శక్తిమంతుడైనప్పుడు ఎలా వ్యవహరించాలో కూడా చెప్పాడు.
chanakya niti in telugu: చాణక్యుడి పేరు చెప్పేసరికి గొప్ప రాజకీయ గ్రంథం అర్థశాస్త్రం గుర్తొస్తుంది. అంతేకాదు… తన అపారమైన రాజనీతితో వందల సంవత్సరాలు నిరంతరాయంగా పాలించిన నందవంశాన్ని నిర్మూలించి… మగధ సింహాసనంపై చంద్రగుప్తుడిని కూర్చోబెట్టిన అపర మేధావి చాణక్యుడు. నంద వంశ నిర్మూలను మౌర్యవంశ స్థాపనకు కారకుడైన కౌటిల్యుడు కేవలం అర్థశాస్త్రం, రాజనీతిజ్ఞత మాత్రమే కాదు. సుఖమయ జీవితానికి పాటించాల్సిన చాలా నియమాలను చెప్పాడు. విజయం ఆనందాన్నిమాత్రమే కాకుండా అనేక మంది శత్రువులను కూడా తెస్తుంది. ఎందుకంటే విజయవంతమైన వ్యక్తికి అతని విజయం పట్ల అసూయపడే చాలా మంది శత్రువులు ఉంటారు. వారు మీ లక్ష్యాన్ని అడ్డుకోవడానికి సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తారు. విజయం వేగాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. తన లక్ష్యం పట్ల ధైర్యంగా, దృఢంగా ఉండే వ్యక్తి శత్రువులు తనపై ఆధిపత్యం చెలాయించడానికి అనుమతించబోడని చాణక్యుడు చెప్పాడు. శత్రువు చాలా శక్తిమంతుడైనప్పుడు అతన్ని ఓడించేందుకు ఏం చేయాలో చాణక్యుడు వివరించాడు.
చాణక్య నీతి ప్రకారం.. ప్రతి ఒక్కరి జీవితంలో శత్రువు ఉంటాడు. అలాంటి వారి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. నిజంగా శత్రువులను ఓడించాలంటే కొన్ని నియమాలు పాటించాలి. జీవితంలో ఇబ్బందులు ఏర్పడినప్పుడు ధైర్యం, కష్టం వచ్చినప్పుడు సహనాన్ని కోల్పోయిన వ్యక్తి శత్రువుల చేతిలో చాలా సులభంగా ఓడిపోతాడు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం సహనాన్ని కోల్పోకూడదు. అలాంటి సమయాల్లో ఓర్పు, మీ మీద మీకు నమ్మకం చాలా ముఖ్యం.
శత్రువు మీ కంటే శక్తిమంతుడైనప్పుడు, పూర్తి స్థాయిలో సన్నద్ధం కాకుండా అతని ముందుకు వెళ్లడం మూర్ఖత్వం. బలహీన స్థితిలో ఉన్న శత్రువుతో కరచాలనం చేస్తే అతని ఓటమి ఖాయం. శత్రువు బలవంతుడైతే, ప్రశాంతంగా ఉండటం ద్వారా అతని బలహీనతను గుర్తించి, సరైన సమయం కోసం వేచి ఉండాలి.
శత్రువును ఓడించడానికి, ప్రతి అంశాన్ని ప్రశాంతంగా ఉండి, మెదడుకు పదును పెట్టి సరైన ఆలోచనల ద్వారా అతని బలాబలాలను పరిగణించి, ఆపై కార్యాచరణలోకి దిగాలి. చాణక్య నీతి ప్రకారం ఆరోగ్యం విషయంలో కూడా అజాగ్రత్తగా అసలు ఉండకూడదట. తగిన విధంగా ఆరోగ్యం ఉంటేనే పని సామర్థ్యం పెరుగుతుందట. శత్రువును ఓడించాలంటే ఆరోగ్యం బాగుంటేనే కీలకపాత్ర పోషించగలుగుతాం.
శత్రువు చేతిలో ఓటమి ఖాయం అని తెలిసినా ఆ భావన బయటకు ఎప్పుడూ చూపించకూడదని చాణక్యుడు సూచించాడు. అలాంటి సమయంలో బలహీనంగా మారితే 100 శాతం ఓడిపోవడం ఖాయమని తెలిపాడు. శత్రువు మనకంటే శక్తిమంతుడైతే, అతని పట్ల అనుకూలంగా వ్యవహరించాలని చాణక్యుడు సూచించాడు. ఇలా చేయడం ద్వారా, మీరు అతని వ్యూహాన్ని క్రమంగా పసిగట్టడంతో పాటు ఎప్పటికీ ఇబ్బందుల్లో చిక్కుకోరు. అలాంటి వారి శక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు, శత్రువు బలహీనంగా, మోసపూరితంగా ఉంటే, అప్పుడు దీనికి విరుద్ధంగా ప్రవర్తించాలని చాణక్యుడు తెలిపాడు.
నీ చిరునవ్వులో అతిపెద్ద శత్రువును ఓడించే శక్తి ఉందని చాణక్యుడు చెప్పాడు. చాణక్యుడి ప్రకారం, శత్రువు ఇబ్బంది కలిగిస్తూ, బాధ పెడుతున్నప్పుడు, భయపడకుండా, సంతోషంగా ఉండటానికి మీ వంతు ప్రయత్నం చేయండి. ఇది ఖచ్చితంగా కష్టంగా ఉంటుంది. కానీ మీ శత్రువు చాలా నిరాశకు గురవుతాడు. మిమ్మల్ని ఎంత బాధపెట్టినా మీ మొహంలో చెదరని చిరునవ్వు చూసి ఆవేశానికి లోనై ఇంకేమీ చేయలేకపోతాడు. ఇది మీరు విజయం దిశగా సాగిపోయే ఘడియకు సరైన సమయం అవుతుంది.