Capitals Resign Politics : రాజీనామాలపై రాజీ పడ్డ వైఎస్ఆర్‌సీపీ - "వికేంద్రీకరణ" ఉద్యమంలో పదవీ త్యాగాలు లేనట్లే !
వికేంద్రీకరణ కోసం అవసరమైతే రాజీనామా చేస్తామన్న వైఎస్ఆర్‌సీపీ నేతలు ఇప్పుడు అలాంటిదేమీ లేదంటున్నారు. రాజీనామాల వల్ల ఉపయోగం ఏముందంటున్నారు ? ఒక్క సారిగా ఈ మార్పు ఎందుకొచ్చింది ?
Capitals Resign Politics : మూడు రాజధానుల కోసం రాజీనామాలకు సిద్దం అని మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రకటించిన తర్వాతి రోజే ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాజీనామా లే్ఖ జేఏసీకి ఇవ్వడంతో ఒక్క సారిగా హీట్ పెరిగింది. మిగిలిన ఎమ్మెల్యేలు కూడా తాము రాజీనామాలకు సిద్ధమన్నారు. ఇతర ప్రాంతాల వైసీపీ నేతలు కూడా రెడీ అన్నారు. దీంతో ఇక మూడు ప్రాంతాల్లో ఉపఎన్నికలు రావడమో లేకపోతే నేరుగా ముందస్తు ఎన్నికలు రావడమో ఖాయమన్న వాతావరణం కనిపించింది. అయితే మళ్లీ ఒక్క రోజులోనే అనూహ్యంగా వైఎస్ఆర్‌సీపీ నేతలు మాట మార్చారు. తాము రాజీనామాలు చేస్తామని ఎప్పుడూ చెప్పలేదంటున్నారు. నేరుగా చెప్పింది.. జేఏసీకి లేఖలిచ్చింది... కళ్ల ముందు ఉండగానే వారిలా ఎందుకు మాట్లాడుతున్నారు ? రాజీనామాల వ్యూహం ఎదురు తన్నిందా ? టీడీపీని ఫిక్స్ చేద్దామనుకుంటే తామే ఫిక్సయ్యే పరిస్థితి రావడంతోనే ప్లేట్ ఫిరాయించారా ?
రాజీనామాల సవాళ్లపై వైఎస్ఆర్‌సీపీ యూటర్న్ !
మూడు రాజధానుల కోసం వైఎస్ఆర్‌సీపీ రాజధానుల వ్యూహం ఎంచుకుందని రెండు, మూడు రోజులుగా ఏపీలో జరిగిన ఘటనలు చూసి రాజకీయవర్గాలు ఓ నిశ్చితాభిప్రాయానికి వచ్చాయి. పార్టీ హైకమాండ్ అనుమతి లేకుండా రాజీనామాల ప్రకటనలు.. రాజీనామాల పత్రాలు ఇవ్వడం లాంటివి ఆ పార్టీ నేతలు చేయరు. పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకే వారు ఇలా రాజీనామా సవాళ్లు చేసి ఉంటారని డిసైడయ్యారు. అయితే ఒక్క రోజులోనే వారు మాట మార్చేశారు. మంత్రులు బొత్స, అమర్నాత్ అసలు ధర్మాన రాజీనామాల ప్రస్తావనే తేలేదని చెప్పేందుకు ప్రయత్నించారు. రాజీనామాల వల్ల ఏం వస్తుందని ఎదురు ప్రశ్నించారు.
టీడీపీని ఫిక్స్ చేద్దామనుకున్న వ్యూహం తేడా కొట్టిందా ?
కరణం ధర్మశ్రీ జేఏసీకి రాజీనామా పత్రం ఇవ్వగానే.. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెరుగుతుందని వైఎస్ఆర్‌సీపీ నేతలు అంచనా వేశారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలనే డిమాండ్లు వస్తాయనుకున్నారు. కానీ ఉత్తరాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు గతంలో తాము అమరావతికే మద్దతని చెప్పామని ఇప్పుుడు కూడా అదే చెబుతామని..అమరావతికి మద్దతు ప్రకటించి ఇప్పుడు మూడు రాజధానులని మాట మార్చింది మీరే కాబట్టి రాజీనామాలు చేయాలని అంటున్నారు. అదే సమయంలో ప్రజల్లో కూడా రాజీనామాల ఎపిసోడ్‌లో అనుకున్నంత స్పందన రాలేదు. కరణం ధర్మశ్రీ రాజీనామా నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో అదంతా ఉత్త రాజకీయం అనే అనుకున్నారు.
ఒక్కరెందుకు.. అందరూ రాజీనామాలు చేయాలని టీడీపీ సవాళ్లు !
మూడు రాజధానులకు మద్దతుగా వైఎస్ఆర్‌సీపీలో ఉన్నది ఒక్క ఎమ్మెల్యేనేనా అన్న సెటైర్లు కరణం ధర్మశ్రీ రాజీనామా లేఖ ఇచ్చినప్పటి నుండి వచ్చాయి. మిగిలిన వారందరూ అమరావతికి మద్దతు ఇచ్చినట్లేనా అన్న విశ్లేషణలు చేశారు. ఈ పరిస్థితి వైఎస్ఆర్‌సీపీకి ఇబ్బందికరంగా మారింది. ఇతరులతో రాజీనామా చేయించలేరు.. అందుకే్ వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. నిజానికి తెలుగుదేశం పార్టీ చాలా కాలంగా వైఎస్ఆర్‌సీపీకి ఒకటే సవాల్ చేస్తోంది. మూడు రాజధానుల ఎజెండాగా.. రిఫరెండం అనుకుని.. మళ్లీ ఎన్నికలకు వెళదాం రమ్మని సవాల్ చేస్తోంది. ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీనే రాజీనామాల అంశం తేవడంతో టీడీపీకి కొత్త హుషారు వచ్చినట్లయింది. మరింత దూకుడుగా సవాళ్లు చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఉపఎన్నికలు .. లేదా ముందస్తు ఎన్నికలను వైఎస్ఆర్‌సీపీ కోరవడం లేదు కాబట్టి.. ఈ వయూహం విషయంలో వెంటనే వెనక్కి తగ్గినట్లుగా కనిపిస్తోంది.
పులి మీద సవారీ చేస్తున్న వైఎస్ఆర్‌సీపీ !
ప్రాంతాల మధ్య పోటీ పెట్టి.. ప్రజల మధ్య విద్వేషాలు రేగేలా రాజధానుల వివాదం తీసుకు రావడం ద్వారా వైఎస్ఆర్‌సీపీ పులి మీద స్వారీ చేస్తున్నట్లుగా అవుతోంది. ఏ మాత్రం తేడా వచ్చినా.. మూడు ప్రాంతాల ప్రజలకూ వ్యతిరేకతవుతారు. ఓ చోట సెంటిమెంట్ రేకెత్తించడానికి ప్రయత్నిస్తే మరో చోట ప్రజలు వ్యతిరేకమవుతారు. ఇప్పటికిప్పుడు బయట పడకపోవచ్చు కానీ ఎన్నికల్లో ఈ అంశం ప్రభావితం చేస్తే వైఎస్ఆర్‌సీపీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.