Who is Lokesh opponent in Mangalagiri : మంగళగిరిలో నారా లోకేష్‌పై పోటీ చేసేది ఎవరు ? తేల్చుకోలేకపోతున్న వైఎస్ఆర్‌సీపీ!
Mangalagiri : మంగళగిరిలో నారా లోకేష్‌పై నిలబెట్టాల్సిన ప్రత్యర్థిపై వైఎస్ఆర్‌సీపీ ఓ అంచనాకు రాలేదు. నిన్నటి దాకా గంజి చిరంజీవే అభ్యర్థి అనుకున్నారు కానీ మాజీ ఎమ్మెల్యే కమల పేరు తెరపైకి వచ్చింది.
Who is Lokesh opponent in Mangalagiri : ఆంధ్రప్రదేశ్ లో వీఐపీ నియోజకవర్గాల్లో ఒకటి మంగళగిరి. అక్కడ్నుంచి నారా లోకేష్ మరోసారి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఐదు వేల ఓట్ల తేడాతో ఓడిపోయినా పట్టుదలగా ఐదేళ్లుగా అక్కడి నుంచే పని చేసుకుంటున్నారు. సొంత డబ్బులతో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజల్లో తిరిగారు. ఇప్పుడు తనకు యాభై వేల మెజార్టీ వస్తుందని ధీమాగా చెబుతున్నారు. అయితే ఆయనకు ప్రత్యర్థిని ఎంపిక చేయడంలో మాత్రం వైఎస్ఆర్‌సీపీ తడబడుతోంది.
గంజి చిరంజీవి అభ్యర్థిత్వంపై పునరాలోచన
మంగళగిరిలో గత రెండు సార్లు వైసీపీ అభ్యర్ధే ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో అమరావతి సెంటిమెంట్‌తో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పోటీ చేసినప్పటికీ.. మంగళగిరిలో వైసీసీ హావేనే కొనసాగింది. ఈ సారి కూడా లోకేశ్ అక్కడ నుంచే పోటీకి సిద్దమయ్యారు. గత ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా రెండో సారి గెలిచిన ఆర్కే పార్టీని వీడటంతో మంగళగిరిలో బీసీ కార్డు ప్రయోగానికి తెర లేపారు సీఎం జగన్.. స్థానికంగా చేనేత వర్గీయుల ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో.. అదే వర్గానికి చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవిని ఇన్‌చార్జ్‌గా ప్రకటించారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన చిరంజీవి ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని అందరూ భావించారు. కానీ ఆయన అందర్నీ కలుపుకోలేకపోతున్నారని.. బలంగా పోటీ ఇవ్వలేరన్న రిపోర్టులు రావడంతో ప్రత్యామ్నాయ అభ్యర్థి వైపు చూస్తున్నారు.
మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలకు టిక్కెట్ ఖరారు చేసే చాన్స్
మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, మాజీ మంత్రి మరుగుడు హన్మంతరావు కూడా వైసీపీ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. సమన్వయకర్తగా చిరంజీవిని నియమించిన దగ్గర్నుంచి ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని కలవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. అవి విఫలం అవ్వడంతో ఎమ్మెల్యే అనుచర గణాన్ని ప్రసన్నం చేసుకోవడానికి చేసిన ప్రయత్నాలు కూడా బెడిసి కొట్టాయి. నియోజకవర్గంలో ప్రతి గడపగడపకు వెళుతూ ప్రచారం చేస్తున్నప్పటికీ.. ఆశించిన ఆదరణ లభించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. బీసీ నేత గంజి చిరంజీవి తన ప్రయత్నాల్లో తాను ఉంటే.. అదే వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల టికెట్ రేసులోకి వచ్చి వైసీపీ పెద్దలతో చర్చించారు. కమలతోపాటు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు సైతం తన కోడలిని ఎన్నికల బరిలో దించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు.
వారంలో ఖరారు చేస్తామన్న విజయసాయిరెడ్డి
మరో వైపు నియోజవర్గంలో అభ్యర్తిని వారంలో ఖరారు చేస్తామని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. నియోజకవర్గంలో పర్యటించిన ఆయన తో గంజి చిరంజీవితో పాటు కాండ్రు కమల కూడా ఉన్నారు. ఇద్దరిలో ఒకరిని ఖరారు చేస్తారా లేకపోతే.. లోకేష్ కు గట్టి పోటీ ఇవ్వాలన్న లక్ష్యంతో ఎవరినైనా హఠాత్తుగా రంగంలోకి తెస్తారా అన్నది వేచి చూడాల్సి ఉంది.