YSRCP Politics : వైఎస్ఆర్‌సీపీలో జిల్లా అధ్యక్షులకు ఉక్కపోత - పదవులకు రాజీనామాలెందుకు ?
వైఎస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షులు రాజీనామాలు ప్రకటిస్తున్నారు. అధికార పార్టీలో ఏం జరుగుతోంది?
YSRCP Politics : వైఎస్ఆర్‌సీపీలో రెండు జిల్లాల అధ్యక్ష పదవులకు తాము రాజీనామాలు చేస్తున్నట్లుగా ఇప్పటి వరకూ ప్రకటించారు. గుంటూరు జిల్లా అధ్యక్ష పదవికి మేకతోటి సుచరిత, అనంతపురం జిల్లా అధ్యక్ష పదవికి కాపు రామచంద్రారెడ్డి ఇక తాము కొనసాగలేమి చెప్పేశారు. అయితే వీరు పార్టీ హైకమాండ్‌కు చెప్పలేదు. అంగీకరించరేమోనని ముందుగా మీడియాకు చెప్పారు. అందరికీ తెలిసిన తర్వాత పార్టీ బాధ్యతల్లో ఉండమని ఒత్తిడి చేయబోరని వారి ధీమా. ఎమ్మెల్యేలను గెలిపించుకుని వస్తే మంత్రి పదవులు ఇస్తామని జగన్ ఆఫర్ ఇచ్చినా వీరు ఎందుకు పదవులు వద్దనుకుంటున్నారు ? వైఎస్ఆర్‌సీపీలో అసలేం జరుగుతోంది ?
తీవ్ర ఒత్తిడిలో వైఎస్ఆర్‌సీపీ జిల్లాల అధ్యక్షులు !
బయటకు చెప్పిన ఇద్దరు వైఎస్ఆర్‌సీపీ జిల్లాల అధ్యక్షులు.. పదవుల్లో ఉండలేమన్నారు. కానీ మెజార్టీ జిల్లాల అధ్యక్షులది అదే పరిస్థితని ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. ఎక్కువమంది తమకు ఆ బాధ్యతలు వద్దంటున్నారు. వీరిని బుజ్జగించడమో.. లేకపోతే వేరే వారిని నియమించడమో చేయకపోతే వారు కూడా అదే ప్రకటనలు చేసే అవకాశం ఉంఆ పార్టీలో చర్చ జరగుతోంది. జిల్లా అధ్యక్ష పదవుల్ని వారికి ఇవ్వడానికి కారణం.. మంత్రి వర్గం నుంచి వారిని తొలగించడమో లేదా.. మంత్రి పదవుల్ని ఆశించి అసంతృప్తికి గురి కావడమో. మంత్రి స్థాయిలో ఊహించుకున్న వారికి జిల్లా అధ్యక్ష పదవులు ఇచ్చి గెలిపించుకు వస్తే మంత్రి పదవి మీదే అని జగన్ ఆఫర్ ఇచ్చారు. ఈ ఆఫర్‌ను కూడా కాదనుకుని వారు పదవుల్ని వదిలేస్తున్నారు.
నియోజకవర్గాల్లో వెనుకబడిపోతున్నామన్న భయమా ?
జిల్లా అధ్యక్ష పదవి అంటే కత్తి మీద సాములా మారింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాల వారీగా ఒకరో .. ఇద్దరో మంత్రులు ఉంటారు. అంతా వారు చెప్పినట్లే వింటారు. వారి ఆధిపత్యం ఉంటుంది. అదే సమయంలో జిల్లా అధ్యక్షుడి లేదా అధ్యక్షురాలిని ఎవరూ పట్టించుకోరు. అదే సమయంలోకనీసం తమ నియోజకవర్గాల్లోనూ పని చేసుకోకుండా.. బలమైన ఇతర నేతలకు ప్రాధాన్యం ఇస్తున్నారన్న అనుమానంలో ఉన్నారు. అందుకే.. రాజకీయ భవిష్యత్‌ను కాపాడుకోవడానికైనా.. జిల్లా అధ్యక్ష పదవుల నుంచి వైదొలగాలని భావిస్తున్నారు. ఆ మేరకు బయటపడతున్నారు. వైసీపీ నేతల్లో అంతర్గత రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయి. పార్టీ హైకమాండ్ దగ్గర పలకుబడి ఉన్న వారికే ప్రాదాన్యత లభిస్తోంది. ఇతరుల మాటలను కూడా ఆలకించేవారు లేకపోవడంతో పరిస్థితి తారుమారవుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
అంతర్గతంగా చెప్పకుండా బయట పడుతున్న నేతలు!
నిజానికి ఇలాంటి పార్టీ వ్యవహారాలు ఎవరూ బయటకు చెప్పవద్దని.. తామే సర్దుబాటు చేస్తామని వైసీపీ హైకమాండ్ నేతలకు సూచిస్తూ ఉంటుంది. ఇతరుల్ని సైలెంట్‌గా నియమించే వరకూ ఏమీ చేయకపోయినా పదవిలో ఉండాలని చెబుతుంది. కానీ అలా కూడా ఉండటానికి చాలా మంది సిద్ధంగా లేరు. పార్టీ పెద్దలకు ఝులక్ ఇవ్వాలనో.. తమ అసంతృప్తిని బయటకు చెప్పాలనో.. కానీ రాజీనామాలు ప్రకటించేస్తున్నారు. ఈ విషయంపై పార్టీ హైకమాండ్ దృష్టి పెట్టాలని ఆ పార్టీ క్యాడర్ కోరుకుంటోంది. ఒకరిపై ఒకరు అనేక మంది ఇంచార్జులు ఉండటం వల్ల క్యాడర్ కూడా గందరగోళానికి గురవుతోంది. ఒకరిపై ఒకరు రాజకీయాలు చేసుకుని పార్టీని దెబ్బతీస్తున్నారని వారు ఆందోళన చెందుతున్నారు.