YSRCP MLAs : వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలందరిదీ ముస్తఫా సమస్యేనా ? ఎన్నికలకు ముందు బరస్ట్ అవుతున్నారా ?
చిన్న చిన్న అభివృద్ధి పనుల కోసం దీనంగా వేడుకుంటున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. ప్రజలు నిలదీస్తున్నారని.. ఓట్ల కోసం వారి దగ్గరకు వెళ్లే సమయం వచ్చిందని అంటున్నారు.
YSRCP MLAs : ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ది పనులకు నిధుల సమస్య అనేది నాలుగేళ్లుగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వ ప్రయారిటీ అభివృద్ధి కాదు. సంక్షేమ పథకాలే. ఆదాయం.. అప్పులు.. ఆస్తులు తాకట్టు పెట్టినవి కూడా సంక్షేమ పథకాల అమలుకు వెచ్చిస్తున్నారు. అందుకే అభివృద్ధి పనులకు పెద్దగా నిధులు కేటాయించలేకపోయారు. ఇంత కాలం ఎలాగోలా సర్ది చెప్పుకున్నారు కానీ ఇప్పుుడు ఎన్నికలకు ముందు ఎమ్మెల్యేలు బరస్ట్ అవుతున్నారు. తాము మళ్లీ ఓట్లు అడుక్కోవాల్సి ఉందని ఇప్పుడైనా చిన్న చిన్న పనులైనా చేయాలని వేడుకుంటున్నారు.
గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా బయటపడ్డారు.. మిగతా వాళ్లు బయటపడలేదు !
గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా ప్రజలను తనను నిలదీస్తూండటంతో.. మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్ లో ఒక్క సారిగా బరస్ట్ అయ్యారు. తనను పట్టించుకోవాలని, పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నానని.. మళ్లీ ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడుక్కోవాల్సి ఉంటుందని ముస్తఫా కన్నీళ్లు పెట్టుకున్నంత పని చేశారు. తాను 10 ఏళ్లుగా ఎమ్మెల్యేగా చేశానని, అధికారులు తనను గుర్తించాలంటూ చేతులు జోడించి వేడుకున్నారు. లక్ష రూపాయలు ఖర్చు చేసి కల్వర్టు నిర్మాణం చేయలేదని ఎమ్మెల్యే ముస్తఫా ప్రస్తావించారు. జనాల వద్ద అడుక్కోవాల్సిన అవసరం రావొద్దంటే, అంతకుముందే మనమే పని చేసిపెట్టాలని కోరారు. జనం సమస్యలు చెబుతుంటే కన్నీళ్లు వస్తున్నాయని, ఇది పద్దతి కాదంటూ వేడుకున్నారు. అయితే ఇది ఒక్క వైసీపీ ఎమ్మెల్యే బాధ కాదని.. అందరిదన్న వాదన గట్టిగానే వినిపిస్తోంది.
గడప గడపలోనూ నిలదీతలు - సమాధానం చెప్పుకోలేకపోయిన నేతలు
గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎక్కడికక్కడ అభివృద్ధి పనులపై ప్రజలు నేతల్ని నిలదీశారు. నిజానికి ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, ఇంచార్జులు మందీ మార్బలంతో వెళతారు. ఎవరైనా ప్రశ్నించడానికి భయపడే వాతావరణం ఉంటుంది. కానీ చాలా చోట్ల.. అభివృద్ధి పనుల కోసం గట్టిగానే ప్రశ్నించారు. ఓ వైపు చిన్న చిన్న పనులకూ ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోతూండటం.. మరో వైపు గడప గడపలో ప్రజలు నిలదీస్తూండటంతో చాలా మంది అసహనానికి గురయ్యేవారు. ప్రజలపై విరుచుకుపడేవారు. సంక్షేమ పథకాలు ఇస్తున్నాం కాబట్టి తలా కొంత చందా వేసుకుని రోడ్లేసుకోవాలన్న సలహాలు కూడా ఇచ్చేవారు. చివరికి ఎన్నికలకు ముందు ఈ పరిస్థితి మరింత దారుణంగా మారింది. దీంతో ఎమ్మెల్యేలు బరస్ట్ అవుతున్నారు.
చిన్న కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేసినా పనులు జరిగేవంటున్న ఎమ్మెల్యేలు
ప్రజలకు ఉపయోగపడే చిన్న చిన్న పనులు చేయడం చాలా కీలకమని వైసీపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఇలాంటి పనులు చేసే కాంట్రాక్టర్లకు బిల్లుల మంజూరు చాలా పెద్ద సమస్య అయింది. ఏళ్ల తరబడి మంజూరు కావడం లేదు. ఇటీవల ప్రభుత్వం పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు వేల కోట్లు చెల్లించిందన్న ప్రచారం జరిగింది. కానీ చిన్న కాంట్రాక్టర్లు మాత్రం ఎదురు చూడాల్సి వస్తోంది. వారు కాంట్రాక్టులు చేయడానికి ముందుకు రావడంలేదు. వచ్చిన వారు సొంత పార్టీ నేతలైనప్పటికీ బిల్లులు మంజూరు కావడం లేదు. దీంతో పనులు ఎక్కడివక్కడ ఆగిపోతున్నాయి. ఇటీవల సచివాలయానికి ఇరవై లక్షలు చొప్పున విడుదల చేశామని పనులన్నీ చేయించాలని సీఎం జగన్ ఆదేశించారు. కానీ ఎలాంటి నిధులు అందలేదని ఎమ్మెల్యేలు వాపోతున్నారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial